ఖమ్మంలో మరో బహిరంగ సభ.. ఈ సారి బీజేపీ?
posted on Jan 19, 2023 @ 10:32PM
ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈసారి బీజేపీ.. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభకు కమలం పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరవుతారని.. వారి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాషాయం కుండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు.
మరో వైపు జనవరి 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సభ జరిగిన రోజే న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగింది, కానీ పొంగులేటి కమలం గూటికి చేరడం మాత్రం జరగలేదు. ఖమ్మం వేదికగా కేసీఆర్ సభ జరిగిన అనంతరం.. బీజేపీలో చేరాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావించారని.. అందుకే ఆయన బీజేపీలోకి ఎంట్రీ కొంచం వాయిదా పడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి.. అనంతరం మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా.. బీజేపీ మాత్రం అనూహ్యంగా ఓటు బ్యాంకును భారీగా పెంచుకొంది.
అదే విధంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ సభావేదికపైనే పొంగులేటిని బీజేపీ గూటిలో చేర్చుకోవాలని కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తెలంగాణలోని ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... సైకిల్ పార్టీకి కేడర్ తప్ప లీడర్ లేంటున్న ప్రత్యర్థి పార్టీల నాయకులకు..ఈ సభతో సరైన సమాధానం లభించినట్లు అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభకు.. వివిధ రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం.. ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి .. అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఆ క్రమంలో తెలంగాణలో పార్టీ బలహినంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి.. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగు వేస్తోంది.
అందులోభాగంగా వివిధ పార్టీల్లో ఉన్న కీలక నేతలను తమ గుటిలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. అదీ కూడా గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో తమ పార్టీకి ఏ మాత్రం ఢోకా లేదనే ఓ స్పష్టమైన సంకేతాన్ని, సందేశాన్నీ.. ప్రత్యర్థి పార్టీలకే కాదు.. ప్రజలకు సైతం ఇవ్వాలన్న అజెండాతో కమలదళం.. ఆ దిశగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.