జనసేనతో బీజేపీ కటీఫ్.. వైసీపీతోనే కలిసి వెళుతుందా?
posted on Jan 20, 2023 @ 9:46AM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనాలంటే పొత్తులు అనివార్యం అన్న నిర్ణయానికి ప్రధాన పార్టీలు వచ్చేశాయి. ఈ విషయంలో మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని, ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోడీతో స్వయంగా మాట్లాడుతాననీ కూడా ప్రకటించారు. అయితే ఏపీలో ఇసుమంతైనా ఓట్ స్టేక్ లేని బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో ఒకింత ప్రాధాన్యత ఏపీలో రాజకీయంగా లభిస్తోంది.
ఈ నేపథ్యంలోనే జనసేన పవన్ కల్యాణ్ ను ఒక ట్రాప్ లో చిక్కుకునేలా గత మూడున్నరేళ్లుగా దిగ్బంధంలో ఉంచగలిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం, అరాచకాలు పెరుగుతున్న నేపథ్యంలో జనసేనాని రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండాలన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చేశారు. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం.. రణస్థలితో సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశంతో కలిసి సాగనున్నట్లు దాదాపుగా స్పష్టత ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని పూర్తిగా విస్మరించినట్లే కనిపించింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలిసి నడవాలా వద్దా అన్నది బీజేపీయే నిర్ణయించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇంత కాలం మిత్రపక్షంగా ఉన్నా జనసేనను బీజేపీ విస్మరిస్తే.. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన బీజేపీని ఇగ్నోర్ చేసింది. బంతిని ఆ పార్టీ కోర్టులోకే నెట్టేసింది.
తొలి సారి జనసేనాని ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించినప్పుడు రాష్ట్రంలో 2014 నాటి పొత్తులు పొడుస్తున్నాయా అన్న చర్చ తెరమీదకు వచ్చింది. జనసేన విశాఖ గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, పవన్ కల్యాణ్ ను హోటల్ కు పరిమితం చేసేలా ఆంక్షలు విధించడం తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించడమే కాకుండా.. ఆయన విశాఖ నుంచి వచ్చిన తరువాత స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనతో కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా జనసేన మిత్ర పక్షం బీజేపీ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు ఖాయమని అంతా భావించారు. ఈ సందర్భంగానే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ బీజేపీపై ఎంత ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం, చంద్రబాబుకు 12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు. అాదే విధంగా `ఢిల్లీలో మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు చంద్రబాబు హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి తార్కానాలుగా పేర్కొన్నారు.
అయితే.. ఏపీ బీజేపీలో మాత్రం తెలుగుదేశంతో మైత్రి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల హస్తినలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీలో పొత్తులు వద్దని నిర్ణయించింది. ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పొత్తులకు దూరం అని బీజేపీ ప్రకటించడమంటే వైసీపీకి సానుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం 1 లేదా 1.5 శాతం ఓట్లతో బీజేపీ రాష్ట్రంలో సాధించేదీ, సాధించగలిగేదీ ఏమీ లేకపోయినా.. జనసేనకు దూరం జరగడం ద్వారా ఏపీలో వైసీపీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. పేరుకు సొంతంగా ఎదగడానికే పొత్తులకు దూరం అని చెబుతున్నా.. ఇప్పటి వరకూ కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే బీజేపీ జగన్ పార్టీకి దగ్గరౌతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.