మిడిల్ క్లాస్ మెలోడీ మాయమౌతోందా?
posted on Jan 19, 2023 @ 2:07PM
యూనియన్ బడ్జెట్ అనగానే దేశంలో మధ్యతరగతి ఆశల పల్లకిలో ఊరేగడం మొదలెట్టేస్తోంది. ఇది ఏటా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే అదే మధ్య తరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సంపన్నులకు సానుకూలంగా.. మధ్య తరగతిని దిగువ మధ్య తరగతిని డిమోషన్ ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన అన్నది పరిపాటిగా మారిపోయింది. స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నిర్లక్ష్యానికి గురౌతు వస్తున్న వర్గం ఏదైనా ఉందా అంటే అది మిడిల్ క్లాస్ వర్గం మాత్రమేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
మధ్యతరగతి ఆదాయం, పొదుపులపై ఎక్కవ శ్రద్ధ, దృష్టి పెడుతుంది. ప్రభుత్వాలు దానినే లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ ల పేరుతో ఆ తరగతి మీద దాడి చేస్తున్నాయి. అంటే మధ్యతరగతిని దోచి సంపన్నులకు భారీగా, పేదలకు పరిమితంగా పంచి పెడుతున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు బడ్జెట్ ప్రస్తావన వచ్చినా మధ్యతరగతి వర్గం తమకు ఏదైనా మేలు జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడున్నర దశాబ్దాలుగా మధ్యతరగతికి మిగిలింది ఆ ఎదురు చూపే.. ప్రభుత్వాలు మాత్రం మధ్యతరగతి నెత్తిన ఎంత పెద్ద బండ పెడితే.. అంతగా దేశాభివృద్ధి జరిగిందన్నట్లు భావిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం చెప్పే జీడీపీ పెరుగుదల మధ్యతరగతిని పీల్చి పిప్పి చేయడంపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఎందుకంటే దేశాబివృద్ధిలో అత్యంత కీలకమైన పన్నులు కట్టేది ఎక్కువగా మధ్య తరగతే. ధరల భారాన్ని మోసేదీ ఆ తరగతే. బడ్జెట్ వస్తోందంటే చాలు ఆ తరగతి జీవుల్లో పన్నుల భయం పట్టుకుంటుంది. ఆ పన్నులపై శ్లాబులు ఇస్తే బాగుండుని, ఆదాయపన్ను మినహాయింపు పెంచితే చాలనీ కోరుకుంటుంది. గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సమయం అయినా కాకపోయినా, సందర్భం వచ్చినా రాకున్నా తాను మధ్యతరగతికి చెందిన మహిళలని చెప్పుకుంటుంటారు. గత నాలుగు బడ్జెట్ లలో ఆమె మధ్యతరగతికి ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఆమె వరుసగా ఐదో సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
ఇప్పుడు కూడా యథావిధిగా తాను మధ్యతరగతి మహిళలనీ, వారి కష్టాలు, బాధలు, ఆశలూ తనకు బాగా తెలుసుననీ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మధ్యతరగతి మీద అదనపు పన్నుల భారం ఉండబోదని ఆమె ప్రకటించారు.
అయితే అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడేది మధ్యతరగతి మీదే. ఆ తరగతి జీవుల ద్వారానే అధికంగా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. అందువల్ల బడ్జెట్‌కు సంబంధించి ఏ ప్రస్తావన వచ్చినా మధ్యతరగతి జనులే ముందుగా స్పందిస్తుంటారు సాలీనా రూ. 5.30 లక్షలు సంపాదించే వారంతా మధ్యతరగతికి చెందినవారేనని ‘ప్రెస్’ అనే ఆర్థిక వ్యవహారాల అధ్యయన సంస్థ చెప్పింది. దాని ప్రకారం, దేశంలో 30 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవే. 2018-19 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5.60 కోట్ల మంది వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయగా, అందులో కోటీ 90 లక్షల మంది అంటే 34 శాతం మంది రూ. 5.25 లక్షల లోపు ఆదాయం కలిగినవారే, అంటే మధ్య తరగతి వారే. అంతేకాదు, దేశంలో అసలు సిసలు కొనుగోలుదారుల గణాంకాలను సేకరించినప్పుడు కూడా మధ్యతరగతి జనులే అధికం.
ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి మీద పన్నుల భారం వేయబోమని చెప్పిన నిర్మలా సీతారామన్, ప్రాథమిక సదుపాయాల కల్పన మీదే దృష్టి కేంద్రీకరింస్తామనీ, వీటి అభివృద్ధి మీదే భారీగా పెట్టుబడి పెట్టబోతున్నామనీ ప్రకటించారు. నిజానికి ప్రాథమిక సదుపాయాల కల్పన అనేది మధ్య తరగతికి పెద్దగా ప్రయోజనం కలిగించే అంశమేమీ కాదు. అది తమ జీవన స్థితిగతులను, జీవిత నాణ్యతను పెంచగ లదనే నమ్మకం ఆ తరగతి జీవులలో ఇసుమంతైనా లేదు. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యాల వల్ల మధ్యతరగతి ప్రత్యక్షంగా లబ్ధి పొం దుతుందే తప్ప ప్రాథమిక సదుపాయాల వల్ల కాదన్నది పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల మొదటి తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ అయినా ఏదో ఒక మేరకు మధ్యతరగతి జనుల.. వీరిలో అత్యధికులు వేతన జీవులే ఆశలను నెరవేర్చేదిగా ఉంటుందా? చూడాలి.