బీఆర్ఎస్ కు కుమార స్వామి దూరం ఎందుకంటే.. ?
posted on Jan 19, 2023 7:58AM
ఖమ్మం బీఆర్ఎస్ సభకు జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దూరంగా ఉన్నారు. ఆయనే కాదు.. జీడీఎస్ పార్టీ ప్రతినిధులెవరూ కూడా హాజరు కాలేదు. దీంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ పయనం ప్రారంభించనప్పటి నుంచీ ఆయనతో అడుగులు వేయడానికి ఉత్సాహం చూపిన జేడీఎస్, కుమారస్వామి.. బీఆర్ఎస్ కు దూరం జరిగారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తన జాతీయ ఆకాంక్షను బయటపెట్టిన క్షణం నుంచీ.. కుమారస్వామి ఆయనకు మద్దతు పలికారు. పార్టీ ప్రకటన సందర్భంలోనూ, ఢిల్లీ లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ కుమార స్వామి కేసీఆర్ వెంట నిలిచారు. కానీ ఆవిర్భావ సభకు మాత్రం దూరం జరిగారు. బీఆర్ఎస్ వర్గాలు ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని చెబుతున్నా.. జేడీఎస్ కు సంబంధించి ఎవరూ ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభకు హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఏదో చెడిందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. అలాగే.. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఖమ్మం ఆవిర్భావ సభలో ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ కర్నాటక బాధ్యతలు ప్రకాశ్ రాజ్ చేపడతారన్నంతగా ప్రచారం జరిగినా.. అత్యంత కీలకమైన ఆవిర్భావ సభకు ఆయన గైర్హాజర్ కావడంతో ఏదో జరిగింది, బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ దూరం జరిగారా, లేక కేసీఆరే పక్కన పెట్టారా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కుమారస్వామి బీఆర్ఎస్ తో ఎడం పాటించడంతో.. జేడీఎస్ బీఆర్ఎస్ మిత్రపక్షంగా ముందుకు సాగడానికి సుముఖంగా లేదన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తుండటం జేడీఎస్ నేత కుమారస్వామికి నచ్చలేదనీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ అభ్యర్థుల కోసం ప్రచారానికే పరిమితమవ్వాలన్న ఆయన కండీషన్ ను కేసీఆర్ అంగీకరించలేదనీ ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్ తో పొత్తుకు ముందే కుమారస్వామి తెగతెంపులు చేసుకున్నారని అంటున్నారు.
అసలింతకీ ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభతో కేసీఆర్ భారాస పార్టీ జాతీయ పార్టీగా అన్ని వర్గాల గుర్పింపు పొందేసినట్లేనా? అంటే ఔనన్న సమాధానం వస్తుందా, వచ్చిందా? అని స్పష్టంగా చెప్పలేము. కత్తీ పోయి డాలు వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లుగా ఆవిర్బవం నుంచీ తొడుగా ఉన్న మిత్రుడు దూరమై కొత్త మిత్రులు వచ్చారు అని మాత్రమే చెప్పగలం. జేడీఎస్ దూరమై ఆప్ దగ్గరైంది. వామపక్షాలు వచ్చి చేతులు కలిపినా.. ఆ పార్టీలకు కేసీఆర్ బలం కావాలే తప్ప కేసీఆర్ కు అవి బలంగా ఉండే అవకాశం లేదు. మరి ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సాధించిందేమిటయ్యా అంటే జేడీఎస్ ను దూరం చేసుకుని ఆప్ కు దగ్గరవ్వడం. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ కు కూడా అంతే బలీయంగా ఉంది.
తెలుగు రాష్ట్రాలలో పాగా కోసం ఆప్ గతంలో కొంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో ఆయన వ్యూహం మార్చి తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఆప్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం హస్తినలో ఆందోళనలకు దిగినప్పుడు కూడా స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారాస విషయంలో మాత్రం ఆయన ఖమ్మం సభకు రావడానికి ముందు వరకూ ఎటువంటి సానుకూలతా ప్రదర్శించలేదు. హిమాచల్, గుజరాత్ ఎన్నికలలో ఆప్ పరాభవం తరువాత వ్యూహం మార్చుకుని భారాస ఆవిర్భావ సభకు హాజరయ్యారు. భారాస అండతో తెలంగాణలో బలోపేతం అన్న వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ పార్టీ పూర్తిగా విస్తరించకముందే.. కొందరు మిత్రులను దూరం చేసుకుని కొత్త మిత్రులకు దగ్గరయ్యారు అని మాత్రమే భారాస ఆవిర్భావ సభ ద్వారా వెల్లడైంది. అయినా తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు మద్దతు పలికితే బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా? అంటే కాదనే రాజకీయ వర్గాలు అంటున్నాయి.
గత మూడు నాలుగేళ్లుగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన కేసీఆర్ సొంతంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసేసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేస్తానంటున్నారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వారు ముగ్గురూ కూడా ఆది నుంచీ కేసీఆర్ తో అడుగులు వేయడానికి సుముఖంగా లేరు. స్టాలిన్ అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర శక్తుల ఐక్యత వీలుకాదని ఇప్పటికే కుండ బద్దలు కొట్టేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ది కూడా దాదాపు అదే బాణి, అదే బాట. ఆయన సొంత రాష్ట్రం బీహార్ లో జేడీఎస్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో పొత్తులో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆవిర్బావ సభతో కేసీఆర్ సాధించిందేమిటన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.