జేడీయూలో అసమ్మతి భగ్గు.. నితీష్ ఐక్యతా రాగానికి చిక్కు!
posted on Feb 21, 2023 @ 10:50AM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతటితో ఆగకుండా రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేర వేరే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకూ రాజీనామా చేసిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జేడీయూ పార్లమెంటరీ బోర్డు చైర్ పర్సన్ సహా పార్టీలో పలు కీలక పదవులు నిర్వహిస్తున్న ఉపేంద్ర కుష్వారా పార్టీ నుంచి వైదొలగడం.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న నితీష్ కు గట్టి ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఉపేంద్ర కుష్వారా నితీష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కేవలం నితీష్ తీరు కారణంగానే జేడీయూ బలహీనపడిందని ఆయన ఆరోపించారు. 2005లో నితీష్ ముఖ్యమంత్రి అయిన సమయంలో ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి. అయితే సీఎం అయిన తరువాత నితీష్ పూర్తిగా మారిపోయారనీ, ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పార్టీని నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు.
పార్టీలో బీసీ, దళిత నాయకులను అణగదొక్కుతూ, తొలి నుంచీ పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆర్జేడీ నేతలను తన వారసులుగా ప్రకటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తన పదవి కాపాడుకోవడానికి పలు మార్లు మిత్రధర్మాన్ని ఉల్లంఘించిన నితీష్ కుమార్ ఇప్పుడు కేంద్రంలో అధికారపీఠంపై కన్నేసి సొంత పార్టీనే నిర్వీర్యం చేసేయత్నం చేస్తున్నారని విమర్శించారు. 63 ఏళ్ల కుహ్వాగా ఎంపీగా, ఎమ్మెల్సీసీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీలో నితీష్ తరువాత ఆ స్థాయి పలుకుబడి, ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. ఒక వైపు నితీష్ కుమార్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పార్టీల ఐక్యతకు సారథ్యం వహించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటే.. సోంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తుండటం కచ్చితంగా ఆయనను చిక్కుల్లో పడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ చేతులు కలపి పోరాడాలంటూ పిలుపునిచ్చారు.
యునైటెడ్ ఫ్రంట్ గా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీని మట్టి కరిపించి ఆ పార్టీ సంఖ్యాబలాన్ని 100కు కుదించవచ్చిన నితీష్ చెబుతున్నారు. అంతే కాకుండా విపక్షాలు ఐక్యం కాకుంటే.. మరో సారి మోడీయే ప్రధాని అవుతారంటూ ఆయన విపక్షాల ఐక్యత బీజేపీయేతర పక్షాలకు అనివార్యంగా అవసరమని కూడా చాటారు. ఈ మాటలను ఆయన పట్నాలో జరిగిన సీపీ ఎం 11వ జనరల్ కన్వెన్షన్ చెప్పారు. అంతే కాదు విపక్షాల ఐక్య కూటమికి సారథ్యం వహించాలన్న తన ఆకాంక్షను కూడా నితీష్ ఇటీవలి కాలంలో అన్యాపదేశంగానైనా సరే పదె పదే వ్యక్తం చేస్తున్నారు. అ
టువంటి తరుణంలో జేడీయూలో నంబర్ 2గా గుర్తింపు పొందిన కుష్వారా నితీష్ పై ధిక్కార స్వరం వినిపించడం, సొంత కుంపటి పెట్టుకోవడానికి సిద్ధపడటం, అదే సమయంలో నితీష్ కుమార్ తన అధికార దాహానికి పార్టీని ఫణంగా పెడుతున్నారంటూ విమర్శించడం చూస్తుంటే.. నితీష్ ఐక్యతా యత్నాలకు ఆదిలోనే హంసపాదు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.