బీబీసీ డాక్యుమెంటరీ వెనుక రాజకీయ ప్రోద్బలం
posted on Feb 22, 2023 6:35AM
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ ప్రసారం చేసిన ఇండియా: ద మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై బీజేపీ వర్గాలు బీబీసీపై భగ్గుమంటున్నాయి. అదే సమయంలో ఈ డాక్యుమెంటరీని నిషేధించడంపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు ముందు అంటే 2002 గుజరాత్ లో చోటు చేసుకున్నా హింసాత్మక సంఘటనలు కథావస్తువుగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇండియా: ది మోడీ క్వశ్చన్ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను యూట్యూబ్ (ఇండియా)లో బీబీసీ అప్‌లోడ్ చేసింది. అయితే అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఐటీ శాఖ ఈ వీడియోను తొలగించింది. డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ధ్వజమెత్తారు.
నిజానికి, ఆ డాక్యుమెంటరీ లో ఏముంది? అందులో ఉన్నదంతా ఉన్నదంతా నిజమేనా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ డాక్యుమెంటరీ రాజకీయ దుమారాన్ని అయితే సృష్టిస్తోంది. గోద్రా దుర్ఘటన (గుజారత్ అల్లర్లకు అగ్గిరాజేసిన 59 మంది కరసేవకుల సజీవ దహనం సంఘటన) నేపధ్యంలో జరిగిన గుజరాత్ లో అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని మాత్రమే కాదు, ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన క్లిప్పింగ్ లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సహజంగానే లౌకికవాద వ్యక్తులు, శక్తులు, బీజేపీయేతర రాజకీయ పార్టీలు ప్రభ్తువ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అంతే కాదు, నిషేధం ఉన్నా ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆసక్తి చూపడం కాదు, ప్రభుత ఉత్తర్వులను ధిక్కరించి అయినా, ప్రదర్శించి తీరుతామని, కొన్ని వామపక్ష అనుబంధ విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి. మరోవంక ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం సహా అనేక పార్టీలు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలనే డిమాండ్ తో గొంతు కలుపుతున్నాయి.
డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటున్నాయి. డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం.. మోడీ ప్రభుత్వం దాన్ని ఎలా నిషేధిస్తుంది.. అని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ ప్రశ్నించింది. ప్రజలే ఈ డాక్యుమెంటరీని చూసి వాస్తవమేమిటన్నది నిర్ణయించుకుంటారని పేర్కొంది.
ఈ అంశంపై బీజేపీకి ఇది భారతదేశాన్ని విభజించడానికి పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్ర అనీ ,. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతోందని పేర్కొంది. ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేయాలని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల బృందాన్ని కోరింది. అయితే ఈ డాక్యుమెంటరీ కచ్చితంగా ప్రదర్శిస్తామని జేఎన్ యుఎస్’యు సభ్యుడు ఒకరు తెలిపారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. కాగా.. హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది.
ఈ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు భారతదేశంలోని కొంతమంది ఇప్పటికీ వలసరాజ్యాల మత్తు నుండి ఇంకా బయటపడలేదని అన్నారు. అలాంటి వ్యక్తులు బీబీసీని భారత సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా పరిగణిస్తారని, తమ నైతిక గురువులను సంతోషపెట్టడానికి దేశం గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలోనైనా తగ్గించేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు. అయితే ఎన్నికల సంవత్సరంలో బీబీసీ సృష్టించిన వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, అనే భయం అయితే అందరిలో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ బీబీసీ డాక్యుమెంటరీపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఇది యాధృచ్ఛికంగా చేసింది కాదనీ, ఈ సమయంలో అది ప్రసారం కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందనీ పేర్కొన్నారు. రాజకీయ ప్రోద్బలమే ఈ డాక్యుమెంటరీకి కారణమని అన్నారు. రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా జరుగుతుంటాయని అందుకు ఈ డాక్యుమెంటరీయే నిదర్శనమని పేర్కొన్నారు.