ఏపీలో కేసీఆర్ క్యాస్ట్ కార్డ్.. వైసీపీకి మద్దతుగా వ్యూహ రచన?
posted on Feb 20, 2023 @ 1:33PM
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో చావో రేవో పరిస్థితి ఉంది. పార్టీ జాతీయ పార్టీగా మార్చిన తరువాత నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటుండటం, మరో వైపు తెలుగుదేశం కూడా తన ఉనికిని బలంగా చాటుతుండటంతో ఆయనకు ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం సంగతి అటుంచి తెలంగాణలో అధికారాన్ని కాపాడుకోవడమే ముఖ్యంగా మారిపోయిన పరిస్థితి.
అయినా కూడా కేసీఆర్ దృష్టి అంతా తెలంగాణపై కంటే.. ఏపీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ కు మద్దతుపైనే ఉంది. తద్వారా తెలంగాణలో ఏపీ సెటిలర్స్ అండ తనకు దక్కేలా చూసుకోవాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఏ విధంగా అయితే ఏపీలో జగన్ అధికారానికి రావడానికి తోడ్పాటు అందించారో, అదే విధంగా వచ్చే ఎన్నికలలో కూడా సహకారం అందించాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల ఆందోళనలు, ఆగ్రహం రూపంలో విస్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. మరో సారి అధికారం అన్న వ్యూహంతోనే పావులు కదుపుతూ పరస్పర సహకారం కోసం ఎత్తులు వేస్తున్నారు.
అందులో భాగంగానే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు సమూలంగా మార్చేసే తెలుగుదేశం- జనసేన పొత్తును మొదట్లోనే విచ్ఛిన్నం చేయడంపైనే దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే కేసీఆర్ క్యాస్ట్ కార్డును ప్రయోగించాలని నిర్ణయించారు. ఏపీలో జనసేన తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళితే.. జగన్ మరోసారి అధికారం సాధ్యం కాదన్న అవగాహనతో ఉన్న కేసీఆర్.. అదే జరిగితే.. ఆ పొత్తు ప్రభావం బీఆర్ఎస్ పై కూడా తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పటికీ పటిష్టమైన, బలమైన క్యాడర్ బేస్ ఉండటం, అలాగే జనసేనానికీ తెలంగాణలో అభిమానుల అండతో పాటు కాపు సామాజిక వర్గం కూడా అండగా నిలుస్తుందన్న అంచనాలతో ఉన్న కేసీఆర్.. ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవ కుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఒక వేళ ఆ రెండు పార్టీలూ పొత్తు కుదుర్చుకుంటే.. ఆ కూటమికి కీలకం కానున్న కాపు సామాజిక ఓట్లలో చీలికకు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తొలుత ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరకూ తోట చంద్రశేఖర్ జనసేనలో ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గాన్ని గంపగుత్తగా తనవైపు తిప్పుకోగలిగే సత్తా, సామార్ధ్యం ఆయనకు ఉన్నాయా అన్న విషయంలో కేసీఆర్ కు అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన కన్నా ను కూడా సంప్రదించారు. కన్నా కమలం పార్టీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారు.
అయితే కన్నా ఆ ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తనను అడ్డుపెట్టుకుని కాపు సామాజిక ఓట్లు చీల్చాలన్న వ్యూహంలో భాగస్వామ్యం కాలేనని సున్నితంగా చెప్పారు. ఇక ఆ తరువాత కేసీఆర్ పవన్ కల్యాణ్ తో కూడా తెలంగాణలో పొత్తు విషయమై సంప్రదించారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ కూడా ఈ సంగతి అన్యాపదేశంగానైనా చెప్పారు. తెలంగాణలో జనసేన, బీఆర్ఎస్ పొత్తు ద్వారా ఇటు తెలంగాణలో లబ్ధి పొందడమే కాకుండా.. అటు ఏపీలో తన మిత్రుడు జగన్ కు కూడా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావించారు. అయితే అందుకు జనసేనాని సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు.
మొత్తంగా జనసేన- తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొసగకుండా చేయడం, అది కుదరకపోతే.. కాపు సామాజిక వర్గంలో చీలక ద్వారా లబ్ధి పొందడం అన్న లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకే తెలుగుదేశం, జనసేనల పొత్తు కుదిరితే.. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నను పదే పదే తెరమీదకు తీసుకురావడం ద్వారా జనసేన శ్రేణుల్లో.. ఆ డిమాండ్ బలంగా వినిపించేలా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ పని మొదలెట్టేసింది. ఫర్ సపోజ్ కలిసి పోటీ చేసి ఏపీలో అత్యధిక స్థానాలను తెలుగుదేశం, జనసేన కూటమి గెలుచుకుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబా? పవన్ కల్యాణా అని ప్రశ్నిస్తూ.. జనసేన శ్రేణుల్లో ఆశ, ఆశక్తి రేకెత్తించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే డిమాండ్ జనసేన శ్రేణుల నుంచి వస్తే.. ఇరు పార్టీల మధ్యా పొత్తు కుదిరినా క్షేత్ర స్థాయిలో ఓట్ల బదలీ జరిగే అవకాశం ఉండదన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
మరో వైపు తెలంగాణలో కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక వచ్చి.. ఆ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న కీలక నియోజకవర్గాలలో బీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నది బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో తెలుగుదేశం- జనసేనల మధ్య పొత్తు అన్న మాటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీల అధినేతలను కలవరపాటుకు గురి చేస్తోందనడంలో సందేహం లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.