తెలుగుదేశం నాయకుడు పట్టాభికి రెండు వారాల రిమాండ్
posted on Feb 22, 2023 6:20AM
గన్నవరంలో ఘర్షణలపై టీడీపీ నేత పట్టాభిరామ్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం(ఫిబ్రవరి 20) గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 21)గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.
పట్టాభి, తదితరులు తనకు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఏ1గా పట్టాభి, ఏ2గా దొంతు చిన్నా, ఇంకా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి.
ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. కాగా పట్టాభి తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపారు. తోట్లవల్లూరు పీఎస్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడించారు. పీఎస్ లో అడుగుపెట్టేసరికి అక్కడంతా చీకటిగా ఉందని తెలిపారు.
ముసుగువేసుకుని ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి, తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని పట్టాభి వివరించారు. అరికాళ్లు, అరచేతులపై తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న అనంతరం పట్టాభి, తదితరులకు రెండు వారాల రిమాండ్ విధించిన న్యాయమూర్తి పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.