మళ్లీ జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. ఈ సారి అసమ్మతిని తట్టుకోగలరా?
posted on Feb 19, 2023 8:37AM
ఏపీ సీఎం జగన్ మరో సారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారా? ఇటీవల ఆయన ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవరికైనా ఔననే అనిపించకమానదు. మునిగిపోతున్న వైసీపీ నావను వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గట్టెక్కించాలన్న పట్టుదలతో ఉన్న జగన్.. అందు కోసం ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు స్పష్టంగానే తెలుస్తోంది. మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తి, అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వడంతో కేబినెట్ సహచరులు విఫలం అవుతున్నారన్న ఆగ్రహం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
నేరుగా హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో.. మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మోస్ట్లీ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత ఏ క్షణంలోనైనా జగన్ తన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలున్నాయనీ వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన హింట్ ఇచ్చారు. పని తీరు మెరుగు పరచుకోకుండా ఉద్వాసన తప్పదని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓ నలుగురు మంత్రులకు హెచ్చరిక కూడా చేశారు. అప్పట్లో లిక్కర్ కుంభకోణంలో సీఎం జగన్ సతీమణి భారతిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిని మంత్రులు స్పందించడం లేదంటూ.. కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులను తప్పిస్తానని హెచ్చరించినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన వార్తలు పెద్దగా వినిపించలేదు. ఆరు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో మగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన అని ప్రచారం జరిగితే.. ఇప్పుడా మంత్రుల సంఖ్య ఆరడజనుకు పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణగా కనీసం అరడజను మంతి మంత్రులకు ఉద్వాసన తప్పదని పార్టీ శ్రేణుల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ సారి వైఎస్ వివేకా హత్య కేసులో నేరుగా తన కుటుంబం వైపే వేలెత్తి చూపుతూ విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. మంత్రుల స్పందన తూతూ మంత్రంగానే ఉందన్న ఆగ్రహం జగన్ లో ఉందని అంటున్నారు. ఈ సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గరయ్యే వారిలో ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కిన రోజా, అలాగే తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా గత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజనిల పేర్లు ఉన్నాయని అంటున్నారు.
అయితే గత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వైసీపీలో పెద్ద ఎత్తున ఆగ్రహ, అసమ్మతి జ్వాలలు ఎగసి పడ్డాయి. అప్పటితో పోలిస్తే వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు, శ్రేణులు, కార్యకర్తలలో కూడా అసమ్మతి చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమాయత్తం కావడం పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఎన్నికల వేళ మరో సారి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వంపై అసమ్మతి భగ్గుమనడానికి ఇది దారి తీస్తుందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. గత పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కొందరు పాతవారిని కొనసాగిస్తూ కొందరిని తప్పించడంతో అసంతృప్తి భగ్గు మంది. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొందరు మౌనం దాల్చి తన నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే మళ్లీ గతంలో జరిగిన నట్లుగానే అసంతృప్తి భగ్గుమనడం తథ్యమని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడిన తరుణంలో ఈ సారి ఆ వ్యక్తమయ్య అసంతృప్తి, అసమ్మతి తాటాకు మంటలా కాకుండా బడబాగ్నిగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడు కట్టుకుందనీ, కొందరు బహిరంగంగానే పార్టీ అధినాయత్వాన్ని, ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారనీ, ఇటువంటి తరుణంలో మరోసారి జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే.. వెల్లువెత్తే అసమ్మతి, అసంతృప్తిని తట్టుకోవడం అంత సులభ సాధ్యం కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి.