వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ఎక్స్ పోజ్ అయిపోయినట్లేనా?
posted on Feb 20, 2023 @ 11:23AM
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించిందా.. అంటే వైసీపీ శ్రేణుల నుంచే ఔనన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఒక సారి వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు పిలిచింది. ఈ సారి ఫిబ్రవరి 25న హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు రావాలని సీబీఐ ఆ నోటీసులలో ఆదేశించింది. అదే సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన ఎక్కడ విచారణకు హాజరౌతారో చెప్పాలని ఆయనకే ఛాయిస్ ఇచ్చింది. భాస్కరరెడ్డికి నోటీసుల విషయం పక్కన పెడితే.. నెల రోజులు కూడా పూర్తి కాకుండా అవినాష్ రెడ్డిని రెండో సారి విచారణకు పిలవడంతో అవినాష్ ను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తం అవుతుంది. తొలి సారి ఆయనను విచారణకు పిలిచిన సందర్భంలోనే అవినాష్ అరెస్టు పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎంపి కనుక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి లోక్ సభ స్పీకర్ అనుమతి కూడా సీబీఐ తీసుకుందని అప్పట్లోనే గట్టిగా వినిపించింది. పైగా ఆనవాయితీకి భిన్నంగా అప్పట్లో ఆయనను సాయంత్రం నాలుగు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించడంతో.. అదే రోజు రాత్రి అయనను అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. అయితే అప్పట్లో సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదు.. కానీ కీలక విషయాలను ఆయన నుంచి రాబట్టిందని అంటున్నారు. ముఖ్యంగా దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ చేరుకునేందుకు అవసరమైన కీలక సమాచారం అవినాష్ రెడ్డి నుంచి రాబట్టిన సీబీఐ.. సీఎం జగన్ ఓఎస్డీ, జగన్ సతీమణి భారతి పిఎలను విచారణకు పిలిచి ప్రశ్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వివేకా హత్య ఘటన సాక్ష్యాలు మాయం చేయడం దగ్గర నుంచీ, ఆయన గుండెపోటుతో మరణించారన్న ప్రచారం వరకూ అన్నిటా అవినాష్ రెడ్డి పాత్రే కీలకమనీ సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు.
వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారిన క్షణం నుంచీ సీబీఐ దూకుడు పెంచింది. ఏపీలో విచారణ సందర్భంగా ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్నో అవరోధాలను ఎదుర్కొనడమే కాకుండా.. పలు అపవాదులనూ ఎదుర్కొంది. స్వయంగా దర్యాప్తు సంస్థ అధికారులపైనే కేసులు నమోదయ్యాయి. బెదరింపులూ వచ్చాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డే నని సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు. అందుకే కేసును ఏపీ నుంచి మార్చాలంటూ.. వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంను ఆశ్రయించిన సందర్బంగా, సీబీఐ కూడా ఏపీ నుంచి కేసు విచారణను మార్చాలనే పేర్కొంది. ఆ సందర్బంగా సుప్రీం కోర్టుకు కేసు దర్యాప్తులో అవరోధాలకు సునీత చెప్పిన ప్రతి కారణమూ అక్షరసత్యమని వాగ్మూంలం కూడా ఇచ్చింది.
వివేకా హత్య కేసు దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనీ, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కేసును తెలంగాణకు బదలీ చేసింది. అంతే అప్పటి వరకూ మందగమనంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తు ఒక్కసారిగా జోరందుకుంది.
కేసు హైదరాబాద్ కు మారిన తరువాత వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు జోరందుకోవడమే కాకుండా.. అంతకు మందు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందన్న అభిప్రాయాలు కూడా బలపడ్డాయి. ఇక గత జనవరిలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన తరువాత ఈ హత్య కేసు పాత్ర ధారులే కాకుండా, వెనుక ఉన్న సూత్ర ధారుల విషయం కూడా వెలుగులోనికి వస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.