బాల బాబాయ్.. తారకరత్న పిలుపు తలచుకుని కన్నీరు పెట్టిన బాలయ్య
posted on Feb 19, 2023 7:17AM
నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబీకులు, ఆ కుటుంబ అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు, తెలుగుసినీ పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారందరూ ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ.. బాల బాబాయ్ అంటూ అప్యాయంగా పిలిచేవాడని తలచుకుని తలచుకుని కన్నీరు పెడుతున్నారు. ఆ పిలుపు ఇక వినబడదన్నఊహే తట్టుకోలేకపోతున్నానని బాలయ్య అన్నారు.
తారకరత్న మరణం తమ కుటుంబానికీ, తెలుగుదేశం ఫ్యామిలీకి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకున్నతారకరత్న.. రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసేందుకు సమాయత్తమౌతున్న తరుణంలో గుండెపోటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమన్నారు. గుండెపోటుకు గురై మూడు వారాలకు పైగా మృత్యువుతో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని అన్నారు. మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించిన తమనందరినీ శోక సంద్రంలో ముంచేశాడని విలపించారు. తారకరత్న ప్రేమ, అనురాగం ఎప్పటికీ మనతోనే ఉంటాయని ఆయన మరో బాబాయ్ నందమూరి రామకృష్ణ అన్నారు.
తారకరత్న మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పుడు కలిసినా బావా అంటూ ఆప్యాయంగా పలుకరించే వారని గుర్తు చేసుకున్నారు. బావా అన్న పిలుపు తారకరత్న నోటి వెంట ఇక వినపడదన్న ఊహే తట్టుకోలేకపోతున్నానని లోకేష్ పేర్కొన్నారు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు ఆగిపోయాయంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటుని లోకేష్ పేర్కొన్నారు. తారకరత్న నిష్కల్మషమైన ప్రేమ, స్నేహ బంధం ఎప్పుడూ తన హృదయంలో సజీవంగా ఉంటాయనీ పేర్కొంటూ, తారకరత్నతో ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తారకరత్న మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శనివారం రాత్రి బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తారకరత్న భౌతిక కాయాన్ని ఆదివారం (ఫిబ్రవరి 19) ఉదయం ఆ మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం ఉదయం నుంచీ ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఫిలింఛాంబర్ లో ఉంచుతారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.