శివసేన పిట్ట పోరును ఈసీ తీర్చేసినట్లేనా?.. సుప్రీం కోర్టు ఏం చెబుతుంది?
posted on Feb 21, 2023 @ 11:26AM
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న సామెతగా మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన విషయంలో ఈసీ రంగంలోకి దిగి తగవు తీర్చింది. శివసేన పార్టీ పేరును, పార్టీ గుర్తును ఇద్దరికి కాకుండా తాత్కాలికంగా సీజ్ చేసి.. ఆ తరువాత తీరిగ్గా. పిడుక్కి, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా మెజారిటీ పేరు చెప్పి షిండే వర్గానికి దఖలు చేస్తూ తీర్పు ఇచ్చేసింది. పిల్లి అలాగే చేస్తుంది. ఏది చేసిన తన యజమానికి లాభం చేకూర్చే విధంగానే చేస్తుంది. అయితే ఆ తీర్పు ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యం కావాలన్న రూలేం లేదు.
సీఈసీ తాను తగవు తీర్చేశానని చేతులు దులిపేసుకున్నా.. తమ ఎన్నికల గుర్తును దొంగిలించారంటూ మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈసీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు గుర్తుల అంశం సుప్రీం కోర్టులో ఉండగా.. షిండే వర్గానికి వాటిని దఖలు చేసేందుకు ఈసీ ఎందుకు తొందరపడిందన్నది ఆయన ప్రశ్న. గతంలో అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సమయంలో కేంద్ర ఏన్నికల సంఘం శివసేన గుర్తును ఇరు పార్టీలకూ చెందకుండా సస్పెండ్ చేసింది. అప్పట్లో ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినా అప్పటికి అది సరైన నిర్ణయంగానే పరిశీలకులు పేర్కొన్నారు.
గత ఏడాది జూన్ లో శివసేన రెండుగా చీలి, షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వర్గం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం అసలు శివసేన తమదేనని తమ వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ వస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సమాచారం ఇచ్చేందుకు థాకరే వర్గంఅప్పట్లో పదే పదే గడవు పొడిగింపు కోరడంతో అప్పటికి అంటే అంధేరీ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల చిహ్నాన్ని స్తంబింప చేసింది. అప్పట్లో , కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి షిండే వర్గం స్వాగతించింది.
అయితే, మాజీ ముఖ్యమంత్రి థాకరే వర్గం మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాని తప్పు పట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అన్యాయమంటూ గగ్గోలు పెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న స్నేహం కారణంగానే షిండే వర్గానికి అనుకూలంగా ఈసీ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు గుప్పించింది. ఎవరెలా వ్యవహరించినా చివరకు సత్యమే గెలుస్తుందని థాకరే వర్గం అప్పట్లో విశ్వాసం వ్యక్తం చేసింది.
అదలా ఉంటే శివసేనలో చీలిక వచ్చిన అనంతరం జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో, అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక అప్పట్లో ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. సరే ఆ ఉప ఎన్నికలో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం విజయం సాధించింది. జనం మా వెంటనే ఉన్నారని ఈ ఫలితం రుజువు చేసిందని అప్పట్లో ఉద్ధవ్ థాక్రే విజయ హాసం చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేన ఎన్నికల గుర్తును.. షిండే వర్గానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్ధవ్ థాక్రే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సుప్రీంలో ఉన్న అంశంపై ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవలసిన అగత్యం ఏమొచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీం అత్యవసర విచారణకు నిరాకరించిందనుకోండి అది వేరే సంగతి.
ఉద్ధవ్ థాక్రే పిటిషన్ మంగళవారం ( ఫిబ్రవరి 21)న బెంచ్ మీదకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పిట్ట తగవు.. పిట్ట తగవు పిల్లి తీరిస్తే ఇరు పక్షాలకూ కూడా అన్యాయమే జరగాలి.. కానీ శివసేన గుర్తు విషయంలో మాత్రం ఈసీ నిర్ణయాలను షిండే వర్గం మాత్రమే స్వాగతిస్తోంది. అంటే ఈసీ పిల్లి వివక్ష చూపుతోందా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో మాత్రమే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.