ఢిల్లీలో బీజేపీకి బిగ్ షాక్! ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్ విజయం
posted on Feb 22, 2023 @ 4:49PM
ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. ఈ గెలుపు గెలుపు ఓటములనే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య సౌందర్యం అనీ అభివర్ణిస్తారు. అయితే, రాజకీయ పార్టీలు, నాయకులు గెలుపును ఆస్వాదించినంతగా, ఓటమిని అంగీకరించలేరు. అధికారం కోసం అడ్డదారులు తొక్కేందుకు ఏ మాత్రం వెనకాడరు. అందునా, ఇక దేశంలో తమకు తిరుగే లేదన్న భావనలో ఉన్న బీజేపీ అయితే, ఓటమిని హుందాగా స్వీకరించడం అనేది ఎప్పుడో మరిచి పోయింది. అందుకే, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అనేక ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చి వేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలల్లోనూ అదే అభిప్రాయం రోజు రోజుకూ బల పడుతోంది. ఇప్పటికే గోవా మొదలు, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర సహా ఏడెనిమిది రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అండతో కూల్చి వేసిందనే ఆరోపణలున్నాయి.
కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ అదే ప్రయత్నం చేసింది. అయితే, ప్రజల తీర్పును కాదని గద్దెనెక్కేందుకు కమల దళం చేసిన ప్రయత్నాలు సుప్రీం కోర్టు తీర్పుతో విఫల మయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజీపీ నాయకత్వానికి వ్రతమూ చెడింది. ఫలితమూ దక్కలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ ప్రతిష్ట మరింతగా మసకబారింది.
నిజానికి గత ఏడాది చివర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆప్ కు అనుకూలంగా విస్పష్ట తీర్పునిచ్చారు. కార్పోరేషన్ లోని 274 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఆప్ కు 135 సీట్లు రాగా.. బీజేపీ 113కు పరిమితమైంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయంతో పది మంది నామినేటెడ్ సభ్యుల్ని నియమించుకున్న బీజేపీ, తన బలాన్ని పెంచుకుంది. అలాగే కార్పోరేషన్లో కోఆప్షన్ సభ్యులుగా ఉన్న ఢిల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేల సాయంతో ఆప్ ను వెనక్కి నెట్టి మేయర్ స్దానం కైవసం చేసుకునేందుకు కాషాయ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.
దీంతో మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆప్ నిరసనలకు దిగడం, ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరిగా మేయర్ ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కును కల్పించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాన్ని ఆప్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నామినేట్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఎంసీడీ (ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్) మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది.
చివరకు ఢిల్లీ మేయర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, షెల్లీ ఒబెరాయ్‌కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.