ఏపీలో జగన్మాయ.. బాధితులపైనే కేసులు!
posted on Feb 22, 2023 8:37AM
ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు.. నేను ఒకడికి ఎదురు వచ్చినా వాడికే రిస్కు.. తొక్కి పడేస్తా.. ఒక సినిమాలో డైలాగ్ ఇది. ఆ సినిమాలో హీరో మంచికి అండగా ఉంటానని చెబుతూ చెడును ఇసుమంతైనా సహించను అంటూ ఈ డైలాగ్ చెబుతాడు. కానీ ఏపీలో జగన్ పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. దౌర్జన్యంతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అరాచకత్వానికి ఎదురెళ్లినా, ప్రశ్నించినా తొక్కిపడేస్తా అంటూ రెచ్చిపోతోంది.
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం.. మరో సారి అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయిన తరుణంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తాం.. కేసులు పెడతాం, మాకు నచ్చకపోతే పోలీసు స్టేషన్లలో మ్యాన్ హ్యాండిల్ చేస్తామంటూ చేసి చూపిస్తోంది. పోలీసు లాకప్ లనూ అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కేసులు, దాడుల భయాన్ని తెలుగుదేశం శ్రేణుల్లో కలిగించడం. విపక్ష పార్టీకి మద్దతుగా నిలిచినా, మాట్లాడినా ఖబడ్దార్ అన్న వార్నింగ్ ను పరోక్షంగా ప్రజలకు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా మారుతోంది. గత ఏడాది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, ఆ తరువాత చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన విధ్వంసం, ఆ వెంటనే చంద్రబాబు రోడ్ షోలో ఆయనపై జరిగిన రాళ్ల దాడి... తొక్కిసలాట సాకు చూపి సభలూ, సమావేశాలపై నిషేధం.. అనపర్తిలో ఏకంగా పోలీసులే చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా కూర్చుని ఆయనను కదలనీయకుండా నిలవరించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాష్ట్రంలో అధికార అరాచకత్వానికి ఎన్నో ఎన్నెన్నోఉదాహరణలు కనిపిస్తాయి.
ఇక తాజాగా గన్నవరంలో జరిగిన ఘటన పరాకాష్టగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో లా అండ్ అర్డర్ కాపాడాల్సిన పోలీసులే అధికార అరచకత్వాన్ని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారా అనిపించేలా గన్నవరం ఘటన ఉంది. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయంపై అధికార పార్టీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు మూకుమ్ముడిగా దాడి చేస్తుంటే.. పోలీసులు వాళ్ల కాళ్లా వేళ్లాపడి బతిమలాడుకోవడాన్ని రాష్ట్రంలో అందరూ టీవీలలో చూశారు. దాడులను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారు, సరే తరువాతైనా అదనపు బలగాలను రప్పించి దాడికి పాల్పడిన వారిని అదుపులోనికి తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. పై పెచ్చు దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. హత్యా యత్నం నుంచి వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించారు.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథిని అదుపులోనికి తీసుకున్నారు. అంటే నిందితులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు అయ్యాయన్న మాట. నిందితులు దాడి చేయడానికి కారణం బాధితులు వారిని రెచ్చగొట్టారని పోలీసులు చెబుతున్నారు. రెచ్చగొట్టినందునే వారు దాడులు చేశారని టీడీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అసలు రెచ్చగొట్టడం అంటే ఏమిటో… దాడులు చేసిన వారిని వదిలిసే.. రెచ్చగొట్టడం పేరుతో కేసులు పెట్టడం ఏమిటో ఏపీ పోలీసులకే తెలియాలని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. గన్నవరంలో దాడి తమ పనేనని వల్లభనేని వంశీ స్వయంగా ప్రకటించారు. దాడి సమయంలో తాను అక్కడే ఉన్నానంటున్నారు.
తనను పిల్ల సైకో అన్నందుకే దాడులు చేశామని ఒప్పుకుంటున్నారు. కానీ ఇలా ఒప్పుకున్నందుకు ఆయనపై కనీసం కేసు కూడా లేదు. దాడులకు గురై వాహనాలు పోగొట్టుకున్న నేతలు మాత్రం జైల్లో ఉన్నారు. పిల్ల సైకో అన్నందుకే.. వల్లభనేని వంశీ రెచ్చిపోతే ఆయన గతంలో చంద్రబాబు, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఏమి చేయాలన్న ప్రశ్నకు మాత్రం పోలీసుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ సమాధానం రావడం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. కానీ జగన్ పాలనలో మాత్రం పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటే వారే నిందితులు, దోషులు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాడులు చేసినా, దాడులకు గురైనా రిస్కు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారే తొక్కి పడేస్తాం అన్నట్లు పోలీసుల తీరు ఉంది.