సర్వేలపైనే భారం.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. సిట్టింగులకు గ్యారంటీ లేదు!
posted on Feb 22, 2023 @ 2:38PM
ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలూ కసరత్తులు ప్రారంభించేశాయి. అధికార పార్టీని మినహాయిస్తే మిగిలిన ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. అధికార బీఆర్ఎస్ మాత్రం ప్రజలలోకి వెళ్లి వారి ఆదరణను చూరగొనడం కంటే.. సర్వేలపైనే భారం వేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు.
ఆ సర్వేల ఫలితాలను పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఎవరికి పార్టీ టికెట్లు ఇస్తే విజయం సాధిస్తారు అన్న విషయంపై తాజాగా మరో సర్వే చేయిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఆయన సిట్టింగులకందరికీ టికెట్లు అని ప్రకటించిన సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు మాత్రం సిట్టింగులకు టికెట్ గ్యారంటీ కాదు అన్న సంకేతాలను పంపిస్తున్నారు. తాజాగా నిర్వహించనున్నసర్వేలో గెలుపు గుర్రాలెవరన్నది తేలుతుందని, ఆ సర్వే ప్రకారం గెలిచే వారికే వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. గతంలో పలు సందర్భాలలో సిట్టింగ్‌లందరికీ పార్టీ టికెట్లు ఇస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ గ్యారంటీ లేదని చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ గతంలో సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించిన సందర్భంలో టికెట్లు ఇస్తామని ప్రకటించిన సందర్భాలలో పార్టీలో ఒక్క సారిగా ఉవ్వెత్తున అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి.
ఎందుకంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరిట 2019 ఎన్నికలలో వేరే పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. దాంతో తొలి నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసి.. ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు.. ఇప్పుడు గత ఎన్నికలలో తమ ప్రత్యర్థులకే పార్టీ టికెట్ ఇస్తామనీ, వారి విజయం కోసం పని చేయాలని అధినేత ఆదేశించడంతో పార్టీ శ్రేణుల్లోనే కాదు.. నాయకులలో కూడా అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ కారణంగానే సందర్భాల్లో హామీ ఇచ్చిన ఆయన.. తాజాగా క్షేత్రస్థాయి పరిస్థితిని తెప్పించుకుంటున్నారు. అదీ కాక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వంటి మంత్రులు సిట్టింగులలో అత్యథికులు టికెట్లు ఇచ్చినా గెలవలేరని బహిరంగంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. ముఖ్యంగా పాతిక మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి మీడియా ముఖంగా చెప్పడం, అదీ కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించిన తరువాత చెప్పడం అప్పట్లో బీఆర్ఎస్ లో సంచలనం సృష్టించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చాలా చక్కని, దగ్గరి సంబంధాలే ఉన్నాయి. అవును ఒక్కప్పుడు తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు. దుర్భాష లాడారు. అయినా ఎర్రబెల్లి తనను ఎంత లేసి మాటలన్నా ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అంటే అది మామూలు బంధం కాదు. చాలా గట్టి బంధం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎర్రబెల్లి దయాకరరావు చేత కేసీఆరే ఆ మాట అనిపించారా అన్న అనుమానాలు కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. సరే కారణాలేమైతేనేం సిట్టింగులందరికీ టికెట్లు అన్న విషయంలో కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారనీ, అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న నిర్ణయానికి వచ్చారనీ అంటున్నారు.
సిట్టింగులలో గెలిచే వారెవరు అన్న విషయంపైనే ఆయన రానున్న రెండు మూడు రోజుల్లో సర్వే చేయించనున్నారనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఈ సారి విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి, ఒక వేళ ప్రజలలో వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్ అన్న అంశాలపై ఈ సర్వే ఉంటుందని చెబుతున్నారు.