ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ వెల్!
posted on Feb 22, 2023 @ 5:05PM
కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడు, ఏ మలుపు తిరుగుతాయో ఉహించడం చాలా కష్టం. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మధ్య చాలా కాలంగా, ‘బ్లో హాట్ ..బ్లో కోల్డ్’ తరహాలో శత్రుమిత్ర సంవాదం నడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకు సీనియర్ నాయకులంతా ఏకమయ్యారు. ఆయన పై కత్తులు దుశారు. ఒక విధంగా వార్ డిక్లేర్ చేశారు.
ముఖ్యంగా మునుగోడు ఓటమి తర్వాత, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు మరింతగా మరింతగా ముదిరి బజారున పడ్డాయి. ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్ళాయి. రేవంత్ రెడ్డితో పాటుగా ఆయనకు మద్దతుగా నిలిచిన అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాక్కూర్ పైనా సీనియర్లు బహిరంగంగానే భగ్గుమన్నారు. జీ 23 లాగా, ఓ పది మందికి పైగా నేతలు అసమ్మతి గ్రూప్ గా ఏర్పడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ దూతగా వచ్చారు. ఆయన నివేదిక ఆధారంగా, అధిష్టానం ఠాక్కూర్ ను సాగనంపింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ రాష్ట వ్యవహారాల నూతన ఇంఛార్జ్ గా నియమించింది.
పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జ్ బాధ్యతలు మాణిక్‌రావు ఠాక్రేకు అప్ప గించాక.. సీనియర్ నేతలు గాడిలో పడినట్లుగా కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఠాక్రే పార్టీ నేతలు అందరితో సమావేశమయ్యారు. చర్చలు జరిపారు. అందరి అభిప్రాయలు తీసుకున్నారు. సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లోనే చర్చించి పరిష్కరించుకోవాలని, లేదంటే పార్టీ పరంగా క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పార్టీ నాయకుల్లో కూడా కొంత మేర మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికి ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరమైనామనే భావనతో కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఐక్యంగా ఉన్నా మనే సంకేతాలు ఇవ్వాలని లేదంటే .. పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీరని నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదలా ఉంటే, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలోనూ మొదలైన హాత్ సే హాత్ జోడో యాత్ర, మరోమారు కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచింది. అయితే ఆనవాయితీ ప్రకారంగా, పాదయాత్ర ఎవరు చేయాలనే విషయంగా కొంత వివాదం నడిచినా, ఠాక్రే సీనియర్లందరికీ నియోజక వర్గాలు పంచి సయోధ్య కుదిర్చారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 6 నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. అలాగే, ఇతర సీనియర్ నాయకులు కూడా ఎవరికి వారుగా తమ, తమ నియోజక వర్గాల్లో పాదయాత్రలు ప్రారంభించారు.
అందులో భాగంగా రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారకం చుట్టి..రెండు నెలల పాటు జనంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర సీనియర్లు కూడా హాజరై సంఘీభావం చెప్పారు. సీనియర్ నేతల్లో మార్పు రావడంతో పాటు పార్టీ కేడర్‌లో కూడా నూతన జోష్ వచ్చిందన్నఅభిప్రాయం వినిపిస్తోంది. అయితే, సీనియర్ నాయకుల ప్రస్తుతానికి సర్దుకున్నట్లు కనిపిస్తున్నా, ఎప్పుడు ఎవరు ఎలాంటి బాంబు పేలుస్తారో అనే భయం మాత్రం కార్యకర్తలను వెంటాడుతోంది.
ఇటీవల ఉన్నట్టుండి పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. అంతేకాదు, ‘హంగ్’ వస్తే అనివార్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోతాయని సంచలన ప్రకటన చేశారు. దుమారం సృష్టించారు. అయితే, ఆ తర్వాత ఆయన సర్దుకున్నారనుకోండి, అది వేరే విషయం. సో .. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో... ఎవరూ ఉహించలేరు. అయితే ప్రస్తుతానికి అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న అభిప్రాయమే వ్యక్త మవుతోంది.