ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ తీరును తప్పుపట్టిన సుప్రీం.. క్షమాపణ చెప్పిన ప్రభుత్వ న్యాయవాది
posted on Feb 27, 2023 @ 3:21PM
ఫామ్ హౌమ్ కేసు లో బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు ఇరుక్కుందా? తాజాగా కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ కేసులో వీడియో, ఆడియో క్లిప్పింగ్ లను తెలంగాణ ముఖ్యమంత్రి న్యాయమూర్తులకు పంపడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం నేరుగా పెన్ డ్రైవ్ లు తమకు పంపడాన్ని ఎత్తి చూపుతూ, రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చేయాల్సిన పనేనా అని వ్యాఖ్యానించారు.
అలాగే మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయన్న వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే.. సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నట్లే కదా అని జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ న్యాయమూర్తులకు పెన్ డ్రైవ్ లు పంపడం పట్ల తెలంగాణ న్యాయవాది దవే తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. మొత్తంగా ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ వ్యవహరించిన తీరు, పన్నిన వ్యూహాలు అన్నీ బూమరాంగ్ అయ్యాయన్న అభిప్రాయం రాజకీయ సర్కిల్స్ లోనే కాదు, బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతోంది. ఈ కేసు సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఓకే చెబితే చిక్కుల్లో పడేది కేసీఆర్ సర్కారేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కేసీఆర్ సర్కార్ అన్నీ తప్పుటడుగులే వేసిందన్న అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. తాజాగా సుప్రీం కోర్టు కేసీఆర్ తీరునే తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలతో పార్టీ వర్గాలలో ఆందోళన వ్యక్తమౌతోంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడం.. మళ్లీ డివిజన్ బెంచ్ సూచన మేరకు సింగిల్ బెంచ్ కు వెళ్లడం.. అక్కడితో ఆగకుండా సుప్రీంను ఆశ్రయించడంతో ఈ కేసు విషయంలో ఇక ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
సింగిల్ బెంచ్ సుప్రీం కోర్టులోనే తేల్చుకోండని చెప్పేసినా.. సుప్రీం కోర్టు ప్రభుత్వం కోరిన విధంగా వెంటనే అత్యవసరంగా ఈ కేసు విచారణకు స్వీకరించడానికి సుప్రీం కోర్టు నిరాకరించడం, అదే సమయంలో స్టేటస్ కో ఉత్తర్వులను ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను సైతం తోసి పుచ్చడంతో ఇక సుప్రీం ఏం చేబుతుందో వేచి చూడడం తప్ప మరేం చేయలేని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది.