కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
posted on Feb 28, 2023 9:15AM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో రాష్ట్రంలోని బ్యూరోక్రాట్లకు కోర్టు మెట్లు ఎక్కడం అన్నది రోజూ డ్యూటీకి హాజరైనట్లుగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరయ్యారు. పోలీసు ఇన్ స్పెక్టర్ బదలీ విషయంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన సోమవారం (ఫిబ్రవరి 27) కోర్టులో హాజరయ్యారు.
ఇన్ స్పెక్టర్ పదోన్నతి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా హాజరు కావాల్సి ఉండగా.. ఆయనకు మినహాయింపు కోరుతూ ప్రభుత్వ న్యాయవాది అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కు గతంలో అంటే 1999లో జారీ చేసిన జీవో ప్రకారం పదోన్నతి కల్పించాల్సి ఉందనీ, ఆ విషయాన్ని పరిగణనలోనికి తీసుకుని పదోన్నతి కల్పించాలని కోర్టు 2019 సెప్టెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇప్పటి వరకూ ఆ ఆదేశాలు అమలు కాలేదంటూ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పైవిచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతం సవాంగ్ లు స్వయంగా విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీజీపీ రాజేంద్రనాథ్ హాజరయ్యారు. కాగా, రాజశేఖర్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు బాగా లేనందునే ఆయన పదోన్నతి వ్యవహారాన్ని ప్రమోషనల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు.
పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరుపై డీజీపీకి మినహాయింపు ఇచ్చింది. ఇలా ఉండగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టు ధిక్కరణ కేసులలో న్యాయస్థానాల ఎదుట హాజరు కావడం ఇదే మొదటి సారి కాదు. జగన్ కు సన్నిహితంగా మెలుగుతూ, ఆయన అడుగులకు మడుగులొత్తే పలువురు ఐఏఎస్‌లు ఇప్పటికే పలు మార్లు కోర్టు మెట్లు ఎక్కారు. సిన్సియర్ అధికారిగా గుర్తింపు పొందిన పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకూ కోర్టు ముందు నిలుచోక తప్పలేదు. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదంటూ హర్టీకల్చర్, సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి.. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్యలు కోర్టు అభిశంసనను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
అలాగే గత ఏడాది ప్రభుత్వ స్థలాల్లో , పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయ భవనాలు నిర్మించడం పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ… వాటిని వెంటనే తొలగించాలని జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్ లకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఐఏఎస్ లు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని, అదేవిధంగా ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు విషయంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లనే తాము కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.