ఈశాన్యంలో ముగిసింది.. ఇక కర్నాటకలో మొదలు.. మోడీ ప్రచారం
posted on Feb 28, 2023 9:29AM
ఈశాన్య రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మార్చి 2 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే, రెండు రోజుల కిందటి వరకూ ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ .. ఇప్పుడు మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నిజానికి కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో కమల దళం కర్ణాటకపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురురు కేంద్ర మంత్రులు కర్ణాటకకు క్యూ కడుతున్నారు.
అదలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ‘రైతు సంక్షేమం’ ప్రధాన నినాదంగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా రైతుల సంక్షేమాన్నే, ప్రచార అస్త్రం చేసుకున్నారు. సోమవారం(ఫిబ్రవరి 27) బెళగావి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సన్నకారు రైతుల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. 2014లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కోసం రూ.25 వేల కోట్లు కేటాయించామన్న మోడీ ప్రస్తుతం అది రూ. 1.25 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ 13వ విడత కింద రూ.16,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు.
వాతావరణ మార్పుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కోగల సత్తా తృణధాన్యాలకు ఉంటుందన్న మోడీ.. వాటిని ‘ సూపర్ ఫుడ్ ’గా అభివర్ణించారు . కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంత మేర దోహదం చేస్తుందనే విషయం ప్రతిఏటా వ్యవసాయం కోసం కేటాయిస్తున్న బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతుందని చెప్పారు.
పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా అభివృద్ధి చేసిన బెళగావి రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యాలు కల్పించేలా దాదాపు రూ.190 కోట్లతో రైల్వేస్టేషన్ నవీకరించారు. అంతేకాకుండా లొండా-బెళగావి-ఘటప్రభ మధ్య ఏర్పాటు చేసిన రైల్వే డబుల్ లైన్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ.930 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. దాదాపు రూ.1,585 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆరు బహుళ గ్రామీణాభివృధ్ధి పథకాలకూ మోదీ శంకుస్థాపన చేశారు. తద్వారా 315 గ్రామాల్లోని 8.8 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ కర్ణాటకలో మోదీ సుడిగాలి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పీఎం కిసాన్ నిధులను విడుదల చేయకముందు గ్రీన్‌ఫీల్డ్ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెళగావి చేరుకునే మార్గంలో మాలిని నగరం నుంచి దాదాపు 10.5 కి.మీ మేర మోదీ రోడ్ షో చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ముందుకు సాగారు. దాదాపు లక్ష మంది మహిళలు కాషాయ వస్త్రాలు ధరించి మోదీకి స్వగతం పలికారు.‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు