భావసారూప్యత ఓ బ్రహ్మ పదార్ధం!
posted on Feb 27, 2023 @ 11:43PM
కాంగ్రెస్ పార్టీ చక్కటి నిర్ణయం తీసుకుంది. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పార్టీ 85వ ప్లీనరీ సందర్భంగా రూపొందించిన ‘రాయపూర్ డిక్లరేషన్’లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకుగాను ఉమ్మడి, నిర్మాణాత్మక కార్యక్రమం కింద భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేసింది.
నిజానికి, ప్లీనరీకి ముందు నుంచి కూడా బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు కాంగ్రెస్ దిగ్గజ నేతలు అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. ఖర్గే అయితే భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిదే విజయమని ప్లీనరీ ప్రారంభానికి ముందే ప్రకటించారు. నిజానికి, రాయపూర్ డిక్లరేషన్‌లోనే కాదు రాజకీయ తీర్మానంలోనూ, పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నాయకుల ప్రసగాలలోనూ కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి పోరాడేందుకు సన్నద్ధంగా ఉందని ఒకటి పది సార్లు ప్రకటించారు.
అయితే, ఇంతకీ ఈ భావసారూప్యత అంటే ఏమిటి? బీజేపీ నియంతృత్వ, మతతత్వ, క్రోనీ క్యాపిటలిజం దాడి నుంచి రాజకీయ విలువల్ని కాపాడేందుకు పోరాడతామని, అదే భావసారుప్యత కాంగ్రెస్ అంటోంది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తీవ్రమవుతున్న సామాజిక విద్వేషాలు, రాజకీయ నియంతృత్వం.. ఈ మూడు దేశానికి ప్రధాన సవాళ్లని కాంగ్రెస్ అభివర్ణించింది. వీటిని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగిన బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చింది. అయితే కాంగ్రెస్ ఒకటే కాదు, ఈ లక్షణాలు (నియంతృత్వ, మతతత్వం, క్రోనీ క్యాపిటలిజం) అంటని పార్టీ ఏదీ లేదు. నిజానికి, పద గాంభీర్యం కోసం ఎంత పదునైన పదాలను ప్రయోగించినా అసలు భావసారుప్యత అది కాదు. అసలు సిసలు భావసారూప్యతఅధికారమే. ఇది చరిత్ర చెపుతున్న సత్యం.
ఒకప్పుడు బీజేపీతో జట్టు కట్టిన పార్టీలు ఆ తర్వాత కాంగ్రెస్ తో చేతులు కలిపాయి. కాంగ్రెస్ తో చేతులు కలిపిన పార్టీలు మళ్ళీ ఎన్నికల నాటికీ కమలం గూటికి చేరాయి. తమిళనాడు విషయాన్నే తీసుకుంటే ఉభయ ద్రవిడ పార్టీలు ( డిఎంకే, అన్నా డిఎంకే) ఉభయ జాతీయ కూటములు (ఎన్డీఎ, యూపీఎ) లతో జట్టు కట్టాయి. విడిపోయాయి. కుండమార్పిడి పద్దతిలో పొత్తులు మార్చుకున్నాయి. ఒక సారి కమలంతో చేతులు కలిపిన పార్టీ మళ్ళీ ఎన్నికల నాటికీ హస్తం చెయ్యందుకుంది. హస్తం చెయ్యందుకున్న పార్టీ మళ్ళీ ఎన్నికల ఆనాటికి కమలం గూటికి చేరింది. చిత్రం, ఏమంటే ఒక్క ఓటు తేడాతో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూల్చి వేయడంలో కీలక పాత్ర పోషించిన జయలలిత( ఎఐఎడిఎంకే) తదనంతర కాలంలో బీజేపీ మిత్ర పక్షమయ్యింది. అలాగే, మహారాష్టంలో సుదీర్ఘ కాలంపాటు బీజేపీతో కలిసి సాగిన శివసేన ముఖ్యమంత్రి పీఠంకోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టింది.
ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తో కలిసింది. అలాగే బీహార్ లో నితీష్ కుమార్, బీజేపీతో కలిసి పోటీచేసి గెలిచి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు. జమ్మూ కశ్మీర్ లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి, అంతకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్ వాజపేయి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా వుంది. అలాగే వామ పక్ష పార్టీలు (సిపిఐ, సిపిఎం)బెంగాల్లో కాంగ్రెస్’ పార్టీతో భావసారూప్యత ఉన్న మిత్ర పక్షాలు, కేరళలో భావ వైరుధ్య శత్రు పక్షాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే... అదో రామాయణమే అవుతుంది. అధికార ఆకాంక్షకు అదొక ముసుగు. అందుకే భావసారూప్యత అన్నది.. అదొక బ్రహ్మ పదార్ధం అంటారు.