ఈ సారి హైదరాబాద్ లో.. తెలంగాణలో తెలుగుదేశం కు పూర్వ వైభవమే లక్ష్యంగా అడుగులు
posted on Feb 28, 2023 6:16AM
తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే ఆయన అధ్యక్షతన ఖమ్మం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అలాగే తాజాగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మరోవైపు మార్చి 29వ తేదీ..తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ గెడ్డ.. అదీ హైదరాబాద్ నడిబొడ్డు ఓల్డ్ ఎమ్మెల్యే కోర్టర్స్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ వేదికగా సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
2014లో ఓ వైపు రాష్ట్ర విభజన జరగగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. తెలంగాణలో మాత్రం తెరాస( ఇప్పుడు బీఆర్ఎస్) అధికారం చేజిక్కించుకుంది. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొంది. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలోతెలుగుదేశం టికెట్ పై గెలిచిన వారంతా వారంతా.. దాదాపుగా కేసీఆర్ నేతృత్వంలోని అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. దీంతో తెలంగాణలోని పసుపు పార్టీ శ్రేణుల్లో ఓ విధమైన నిశ్శబ్దం ఆవరించింది.
మరోవైపు తెలంగాణ నినాదంతో... ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకోవడమే కాదు.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న గులాబీ బాస్ కేసీఆర్, ఇటీవల టీఆర్ఎస్‌లో తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి.. ఆ స్థానంలో భారత్ అనే పదాన్ని ఆయన చేర్చారు. దీంతో టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. దీంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీ కాస్తా.. బీఆర్ఎస్ పార్టీగా మారి .. జాతీయ పార్టీగా మారిపోయింది. ఇక ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం నేతలు..వచ్చే ఎన్నికల్లో పసుపు పార్టీ సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో... గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పోల్చుతూ.. ప్రజల్లోకి వెడుతున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అదీ టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు, ఉద్యోగ కల్పన.. రాజధాని హైదరాబాద్ నగరాభివృద్ధి, ఐటీ పరిశ్రమ, సైబరాబాద్ నిర్మాణం తదితర అంశాలను సైతం ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయత్తం అయ్యాయి.
ఇక తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లు అత్యధికంగా ఉన్న పలు జిల్లాలు, ప్రాంతాలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే దిశగా తెలుగుదేశం అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. ఇక తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు, సాధ్యమైనంత త్వరలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. అందుకోసం ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే కాదు.. రాష్ట్ర నాయకత్వం సైతం ప్రణాళికలు సిద్దం చేసుకొంటూ.. ముందుకు సాగుతోంది. అలాంటి వేళ.. అటు బీఆర్ఎస్ కి, ఇటు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పోటీ ఇచ్చే దిశగా సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు.. తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించేందుకు సిద్దమవుతోన్నట్లు తెలుస్తోంది.