కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ ఏదీ? ఒంటరిగా ఓడించలేమంటూ చేతులెత్తేసిన హస్తం పార్టీ
posted on Feb 27, 2023 @ 10:51PM
కాంగ్రెస్ పార్టీ, పూర్వ వైభవం పై ఆశలు వదిలేసుకుందా? పునర్జ్జీవనం పొందితే చాలానే దశకు చేరుకుందా? అధికారమే పరామావధి అనే ఆలోచనకు వచ్చిందా? సంకీర్ణ సారథ్యం దక్కితే చాలు అనుకుంటోందా? అంటే, పాత తరం కాంగ్రెస్ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.
ఛత్తీస్ గఢ్ రాజధని నయా రాయ్ పూర్ లో జరిగిన పార్టీ మూడు రోజుల ప్లీనరీ సమావేశాలలో పసంగించిన పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, 2004 నుంచి 2014 వరకు సాగిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సంకీర్ణ పాలన దగ్గరే ఆగిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవ స్థితికి ప్రామాణికం అన్నట్లుగా, మళ్ళీ మనం మరో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, బీజీపీ యేతర పార్టీలను కలుపుకుని ముందుకు పోదాం అని, సోనియా పిలుపు నిచ్చారు. అలాగే, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ ప్రారంభ ఉపన్యాసంలోనే... సంకీర్ణ ప్రభుత్వమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.
అలాగే, రాయపూర్ డిక్లరేషన్ లోనూ భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకుగాను ఉమ్మడి, నిర్మాణాత్మక కార్యక్రమం కింద భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేసింది. తెలంగాణ, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు క్రమశిక్షణతో కలిసి మెలిసి పనిచేయాలి. తప్పనిసరిగా పార్టీని గెలిపించాలి. 2024లో జరగనున్న కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ఈ విజయాలే ప్రాతిపదిక అని డిక్లరేషన్ పేర్కొంది.
అయితే మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ విధానం ఇదేనా అంటే, కాదని అంటున్నారు, పాతతరానికి చెందిన సీనియర్ నాయకులు. నిజానికి 2014 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు భావసారుప్యత పేరిట అనేక పార్టీలను వివిధ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతగా ప్రణబ్ ముఖర్జీ కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకీర్ణాలకు ఒడిగట్టడం అసలు గుర్తింపునకే ముసురు తెస్తుందని చేసిన సూచన ఇప్పటికీ అలోచింపచేసేదిలా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
1996-2012 మధ్యకాలంలో సాగిన సంకీర్ణ ప్రభుత్వాలపై రాసిన ఓ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ అనేక అంశాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సంకీర్ణ ప్రభుత్వాలపై తన ఆలోచన మారలేదన్నారు. 2004 ఎన్నికలకు ముందు బీజేపీని ఓడించేందుకు వివిధ పార్టీలతో చేతులు కలపాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలతో తాను ఏకీభవించలేదన్నారు. ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీ చేయడమే సరైన మార్గమని, దీని వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పదిలపరచుకోగలుగుతుందని ఉద్ఘాటించారు. బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక వాద పార్టీలతో చేతులు కలపాలంటూ 2003లో సిమ్లాలో జరిగిన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన ప్రణబ్ అది అంతకుముందు జరిగిన పంచమడి తీర్మానానికి విరుద్ధం. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంకీర్ణ కూటములను ఏర్పాటు చేసుకోవాలని ఆ సదస్సులో మేము తీర్మానించాం అని గుర్తు చేశారు.
సిమ్లా సదస్సులో అందరి అభిప్రాయాలను సేకరించారని, పంచమడి తీర్మానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సోనియా, మన్మోహన్ సహా అందరూ మొగ్గు చూపారని ప్రణబ్ తెలిపారు. కానీ తానొక్కడినే అందుకు భిన్నంగా మాట్లాడానని, ఇతర పార్టీలతో చేతులు కలపడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుందని విస్పష్టంగా తెలియజేశానన్నారు. ప్రత్యేకంగా 2004 సంవత్సరానికి సంబంధించి ఈ పుస్తకంలో అనేక ఆసక్తిరమైన అంశాల్ని ముఖర్జీ ప్రస్తావించారు. ‘ది ఇందిరా ఇయర్స్’, ‘ది టర్బ్యులెంట్ ఇయర్స్’ పేరుతో ఇప్పటివరకూ ప్రణబ్ రెండు పుస్తకాలు వెలువరించారు. సంకీర్ణ శకానికి సంబంధించిన అంశాలపై తన మూడో పుస్తకాన్ని వెలువరించారు. అధికార పీఠాన్ని ఎక్కాలన్న పట్టుదలకు పోయి కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోకూడదన్నది తన నిశ్చితాభిప్రాయమని పేర్కొన్న ప్రణబ్ ప్రతిపక్షంలో కూర్చున్నా తప్పులేదు కానీ.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ తన ఉనికిని మాత్రం కోల్పోకూడదు అని ఉద్ఘాటించారు.
అయితే ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ లేరు. ఆయన స్థాయి నాయకులూ లేరు. అదీ గాక అవునన్నా కాదన్నా, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బీజేపీని ఎదుర్కునే పరిస్థితిలో లేదు. అంతే బీజేపీయేతర పార్టీలలో సగానికి పైగా పార్టీలు, కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేందుకు కూడా సుముఖంగా లేరు... మరో వంక థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగ్తున్నాయి .. ఈ పరిస్థితిలో రాయపూర్ డిక్లరేషన్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.