విపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ చెక్
posted on Feb 27, 2023 @ 2:36PM
విపక్షాల ఐక్యతా యత్నాలకు కాంగ్రెస్ ప్లీనరీ గండి కొట్టిందా? వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీల ఐక్యతే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు రాయ్ పూర్ లో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా గండి పడిందా? విభేదాలను పక్కన పెట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకు పోయే దిశగా అడుగులు వేయాల్సిన కాంగ్రెస్.. అతి విశ్వాసంతో కొన్ని పార్టీలను ఐక్యత విషయంలో తమతో కలిసి అడుగువేయాలన్న ఆలోచన కూడా చేయకుండా నిరోధించిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా వచ్చిన సానుకూల స్పందన.. పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి పెరిగిన జనాదరణ కారణంగా కాంగ్రెస్ మళ్లీ తన సహజ లక్ష్యమైన ఒంటెత్తు పోకడలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా పలు మార్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ఉప సంహరించుకున్న చరిత్ర కాంగ్రెస్ ఉంది. అయితే మన్మోహన్ సారథ్యంలో రెండు పర్యాయాలు అంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపింది. అయితే అప్పట్లో ఆ పార్టీ మిత్రధర్మాన్ని పాటించిందా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల పాటు కేంద్రంలో ప్రధాన విపక్ష పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్.. ఈ పదేళ్ల కాలంలోనూ ఉమ్మడి పోరాటాలకు నేతృత్వం వహించిన సందర్భాలు బహుస్వల్పం అనడంలో సందేహం లేదు.
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనలకు సారథ్యం వహించే విషయంలో కాంగ్రెస్ వెనుకబడింది. మొత్తంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2019 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ వైదొలగిన తరువాత ఆ పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. జాతీయ పార్టీగా శతాధిక వత్సరాల అనుభవం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పొలిటికల్ పార్టీ విపక్ష పాత్రను పోషించడంలో సందేహాలకు అతీతంగా విఫలమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ లేకుండా కూటమిని ఊహించడం అసాధ్యం. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం కేసీఆర్, మమత, నితీష్ వంటి నేతలు చేసిన ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే సాగాయి.
చివరాఖరికి శరద్ పవార్ వంటి దిగ్గజన నేతలు, స్టాలిన్ వంటి వ్యూహ చతురులు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత నీటి మీద రాతలాంటిదేనని పలు సందర్బాలలో విస్పష్టంగా చెప్పేశారు. అంటే కాంగ్రెస్ నేతృత్వంలోనే జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొనగలమని బీజేపీయేతర పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి. అటువంటి తరుణంలో సంయమనంతో వ్యవహరించి.. విపక్షాల ఐక్యతకు నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్ ఏకపక్షంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాము కలుపుకునే పార్టీలు ఇవి మాత్రమేనన్న విధంగా ప్లీనరీ వేదికగా ప్రకటన చేయడం.. ఇక మూడో ఫ్రంట్ ప్రయత్నాలపై సెటైర్లు వేస్తూ, వాటిని బీజేపీకి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలుగా అభివర్ణించడం ఏ విధంగా చూసినా తొందరపాటుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే, రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ సారథ్యంలో మాత్రమే ప్రతిపక్షాల ప్రంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై కొన్ని బీజేపీయేతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అంటే బీజేపీయేతర ఫ్రంట్ కాంగ్రెస్ సారథ్యంలో మాత్రమే సాధ్యమౌతుందనీ, ఆ ఫ్రంట్ లో చేరగోరే వారు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించి తీరాల్సిందేనన్నది కాంగ్రెస్ కండీషన్ గా పెట్టిందని అర్ధం అవుతోంది. అయితే ఆ కండీషన్ ను అదీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే విధించడమంటే.. ఆలూ లేదు.. చూలూ లేదన్న సమెతను గుర్తుకు తేవడమేననడంలో సందేహం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది జరగననున్న సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తొమ్మది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. వాటి ఫలితాలు వచ్చే నెల మొదటి వారంలో వెలువడనున్నాయి. వీటన్నిటి ఫలితాల తరువాత రాజెవరు, మంత్రెవరు.. అసలు రాహుల్ సారథ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారా? లేదా అన్న విషయం వెల్లడి అవుతుంది.
అప్పటి వరకూ ఆగకుండా తన సారథ్యంలో మాత్రమే బీజేపీ వ్యతిరేక కూటమి పని చేయాలన్న షరతు విధించడం ద్వారా కాంగ్రెస్ విపక్షాల ఐక్యతకు స్వయంగా అవరోధంగా మారిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ముందు ఎన్నికలలో ఐక్యంగా పోటీ చేసి ఆ తరువాత గెలిచిన స్థానాల ఆధారంగా సారథ్యం, ప్రధాని వంటి అంశాలపై చర్చల ప్రక్రియ అని ఉంటే ఐక్యతా యత్నాలు అడ్డంకులు లేకుండా సజావుగా సాగి ఉండేవని అంటున్నారు.