కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైందా?
posted on Mar 9, 2023 @ 11:54AM
ఈ ప్రశ్న బీఆర్ఎస్ వర్గాలలోనే కాదు.. సర్వత్రా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచకపోవడమే కారణం అని చెప్పవచ్చు. ఆ కారణంగానే ఇప్పుడు బీఆర్ఎస్ లో సీనియర్లు కూడా తరచుగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే వారి ఈ ప్రకటనల వెనుక కేసీఆర్ అనుమతి కచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇకపై తన ఫుల్ కాన్ సన్ ట్రేషన్ అంతా జాతీయ రాజకీయాలపైనే అని అయన స్వయంగా ప్రకటించేశారు కూడా. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడు? ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాతనా, లేక ఎన్నికలకు ముందుగానే ఆ తంతు పూర్తి చేసి.. వచ్చే ఎన్నికలను కేటీఆర్ సారథ్యంలోనే పార్టీ ఎదుర్కొటుందా అన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు, పొలిటికల్ సర్కిల్స్ లో కూడా జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. అయినా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత మాత్రం నోరు మెదపడం లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెడదాం అన్న దోరణినే ప్రదర్శిస్తున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ ను సన్నద్ధం చేయాల్సిన బృహత్తర బాధ్యత కూడా ఆయన భుజస్కంధాలపై ఉంది. ఉంది అనడం కంటే ఆయనంతట ఆయనే ఈ బాధ్యతను తలకెత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లి జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టలేని పరిస్థితిని స్వయంగా కొని తెచ్చుకుంటారని భావించలేమని పరిశీలకులు అంటున్నారు. అలాగని ముందస్తుకు వెళ్లకుండా ఎన్నికలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యతను తనయుడికి అప్పగించి తాను జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ బాధ్యతలను చేపట్టాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే చెబుతున్నారు. ఇందుకు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేసినా కూడా జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుండటాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ విస్తరణ ఇంకా తొలి అడుగులోనే ఉంది.. అక్కడక్కడా ఒకటి రెండు రాష్ట్రాలలో బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగినప్పటికీ.. ఏపీ మినమా మరే రాష్ట్రంలోనే బీఆర్ఎస్ అధ్యక్షుల నియామకం జరగలేదు. ఇందుకు తెలంగాణ కూడా మినహాయింపు కాదు. కేటీఆర్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా, అది పార్టీ రాష్ట్ర శాఖ కు ఆయన పూర్తి స్థాయి అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లు ఎంతమాత్రం కాదు. మరి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరణ పనులు ఆరంభించాల్సిన తరుణంలో రాష్ట్ర పార్టీలో అసంతృప్తులు, అలకలను పరిష్కరిస్తూ సమయం వృధా చేసే సాహసం కేసీఆర్ చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
అందుకే జాతీయ రాజకీయాల పేరిట కేసీఆర్ కావాలనే తన ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకుంటున్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తాను సీఎం బాధ్యతల నుంచి తప్పించుకుని రాష్ట్ర పగ్గాలను తనయుడు, మంత్రి కేటీఆర్ కు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ నోటీసులపై కేసీఆర్ కాకుండా కేటీఆర్ గురువారం ( మార్చి 9)న మీడియా ముందుకు కేటీఆర్ వచ్చి మాట్లాడారని అంటున్నారు. ఈ మీడియా సమావేశంలో కూడా కవితకు నోటీసులపై కంటే.. గత కొద్ది కాలంగా తెరాస నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన నోటీసులు, చేసిన దాడులన్నిటినీ వివరించారు. అదే సమయంలో గతంలో తెలుగుదేశంలో ఉన్న సుజనా చౌదరి వంటి వారపై ఈడీ కేసులు వారు బీజేపీలో చేరిన వెంటనే వాటి ప్రస్తావనే లేని విషయాన్ని ప్రస్తావించారు. మోడీ సర్కార్ తీరంతా హమ్లా, జుమ్లా వ్యవహారమని విమర్శించారు. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మోడీ కనుసన్నలలోనే పని చేస్తున్నది అని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయత్నించారు. ఇదే సమయంలో ఆయన అదానీ, మోడీ వ్యవహారంపై కూడా విమర్శలు గుప్పించారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులన్నీ విపక్షాలపైనేనని కేసీఆర్ విమర్శించారు. మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ విపక్షాలపై 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతాయన్న సంకేతాన్ని ఇచ్చారని అన్నారు. మొత్తంగా కవితను మద్యం కుంభకోణం కేసులో వెనకేసుకురావడం కంటే.. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మోడీ ఆదేశాలపై విపక్షాల నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నాయని ఎస్టాబ్లిష్ చేయడమే పొలిటికల్ మైలేజీ ఇస్తుందని కేటీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.