ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది.. బొప్పరాజు
posted on Mar 9, 2023 @ 4:26PM
కొంచం ఆలస్యంగానైనా ఉద్యోగ సంఘం నాయకులు, అందరూ కాకపోయినా కొందరు జగన్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని అంగీకరిస్తున్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి జడిసి వారిలా చెబుతున్నారా? లేక వారిలో నిజంగానే జ్ణానోదయం అయ్యిందా అన్న విషయం పక్కన పెడితే.. ఇప్పటికైనా ప్రభుత్వం మోసం చేసిందని బహిరంగంగా ప్రకటించడం ఉద్యోగులలో జగన్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్ధం అయ్యేలా చేసింది.
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో ఉద్యోగుల డబ్బును ప్రభుత్వంఇతర అవసరాలకు వాడుకుందని, ఆ సొమ్మును ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని చెబుతోందదన్నారు. ఉద్యమ కార్యాచరణలోకి వెళ్లిన ఉద్యోగులను మభ్యపెట్టడానికి ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి కబుర్లను తాము విశ్వసించబోమని స్పష్టం చేశారు. పీఆర్సీ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలన్నారు.
మొక్కుబడికి చర్చలకు పిలిచారనీ, ఏ ఒక్క విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదనీ బొప్పరాజు ఆరోపించారు. పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ అందే పరిస్థితి లేదని అన్నారు. ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదనీ, అది సాధ్యపడదనీ ప్రభుత్వం చెబుతోందన్నారు. మరి మంత్రులకూ, సలహాదారులకూ ఠంచనుగా మొదటి తేదీన జీతాలెలా చెల్లిస్తోందంటూ ఆయన నిలదీశారు.
సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి 2,600 కోట్ల రూపాయలు చెల్లించలేదన్నారు. సీపీఎస్ వినా మరే ప్రత్యామ్నాయాన్నీ తాము అంగీకరించే ప్రశక్తే లేదని బొప్పరాజు తేల్చి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను జగన్ సర్కార్ గాలికొదిలేసిందన్నారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూమోసం చేసిందన్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా హామీలు ఇస్తుందని అందుకే తమ కార్యాచరణ అమలుకు తీర్మానించామని బొప్పరాజు ప్రకటించారు