వివేకా హత్య కేసులో అవినాష్ కు అరెస్టు భయం.. అందుకేనా కోర్టుకు?
posted on Mar 9, 2023 @ 3:45PM
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడం ఖాయమన్న నిర్ణయానికి కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి వచ్చేశారా? అరెస్టును తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నారా? అంటే ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడాన్ని బట్టి చూస్తే ఔననే అనిపిస్తుంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు.
అంతే కాకుండా తన న్యాయవాది సమక్షంలోనే తనను విచారించేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. వివేకా హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ విచారించలేదని తన పిటిషన్ లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే దస్తగిరి ముందస్తు బెయిలు పిటిషన్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదనీ, అప్రూవర్ గా మారానంటూ దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే విచారణ చేస్తోందని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలూ, ఆధారాలూ ల లేకపోయినప్పటికీ తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పాదర్శకంగా లేదని అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు కనుక అరెస్టు చేయకుండాసీబీఐని ఆదేశించాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. ఇలా ఉండగా ఈ నెల 10న అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి విచారణకు పిలిచింది.
తొలి సారి విచారణ అనంతరం అవినాష్ రెడ్డి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ ఓఎస్ డీని, అలాగే జగన్ సతీమణి వ్యక్తిగత కార్యదర్శి నవీన్ ను సీబీఐ విచారించింది. నవీన్ కు అయితే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందన్న సమాచారం ఇచ్చింది. ఇక అవినాష్ రెడ్డి రెండో సారి సీబీఐ విచారణను ఎదుర్కొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో ఆయనలో ఆందోళన కనిపించింది. సీబీఐ విచారణ సవ్య దిశలో సాగటం లేదని అప్పట్లో విమర్శించారు. అంతే కాకుండా తనను మూడో సిరి విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదనీ, సీబీఐ ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు చెప్పానని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా ఆయనను సీబీఐ విచారణకు పిలిచింది. సీబీఐ సోమవారం (మార్చి 6)విచారణకురావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి ఆ రోజు విచారణకు హాజరు కావడం వీలుపడదని సమాధానం ఇచ్చారు.
తొలిసారి విచారణకు నోటీసు ఇచ్చిన సమయంలోనూ ఆయన ఇదే సమాధానం ఇచ్చిన సంగతి విదితమే. దీంతో పెద్దగా కారణాలు వివరించాల్సిన అవసరం లేకుండా విచారణకు సహకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అయినా కూడా అవినాష్ రెడ్డి విజ్ణప్తి మేరకు సీబీఐ అధికారులు ఈ నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సింది ఆదేశిస్తూ ఆదివారం (మార్చి 5)న పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నోటీసు ఇచ్చి వచ్చారు. ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం ఇచ్చినట్లుగా కూడా చెబుతున్నారు. వరుస పరిణామాలను గమనిస్తే వివాక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇక వరుస అరెస్టులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.