నాడు సెంటి మెంట్.. నేడు యాంటీ సెంటిమెంట్!
posted on Apr 17, 2023 @ 12:59PM
అధికారం అందుకోవాలంటే.. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలి... అలా అయితేనే.. అందలం ఎక్కగలమని వైసీపీ అధినేత జగన్ విపక్ష నేతగా గత ఎన్నికల వేళ భావించారు. అందుకోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్నే కాదు.. తనకు తాను సృష్టించుకున్న అవకాశాలనూ యథేచ్ఛగా వాడుకున్నారు. అందులో భాగంగానే ఆయన సెంటిమెంట్‌ను.. అయింట్‌మెంట్‌లా ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలోనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై జరిగిన కోడికత్తి దాడిని... అలాగే తన సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తదితర అంశాలను జగన్ గత ఎన్నికల ప్రచార వేళ.. చాలా చాలా పద్దతిగా వాడుకొని... అధికారాన్ని దక్కించుకోవాలన్న తన లక్ష్యానికి చేరుకొన్నారు. ఈ విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయనకు అప్పుడు అక్కరకు వచ్చిన సెంటిమెంట్ ఇప్పుడు యాంటీ సెంటిమెంట్ గా మారుతోందంటున్నారు పరిశీలకులు.
2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడికత్తి దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు.. ప్రజలను నిర్ఘాంత పరిచాయి. వైయస్ జగన్‌పై కోడికత్తి దాడిలో ఎటువంటి కుట్ర కోణం లేదని దర్యాప్తులో తేలిందని కోర్టుకు ఎన్‌ఐఏ తెలిపింది. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన జనిపల్లి శ్రీనివాసరావు.. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని కూడా ఎన్ఐఏ తేల్చేసింది.
అలాగే 2019, జనవరి 17న ఎన్ఐఏకి నిందితుడు శ్రీనివాసరావు.. ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో సైతం సంచలన నిజాలు వెలుగు చూశాయి. కోడికత్తితో పోడిస్తే.. జగన్‌కు ప్రజల్లో సానుభూతి వస్తుందని... దీంతో ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తారని ఎన్ఐఏ ముందు శ్రీను చెప్పారు. అలాగే ఈ కోడి కత్తి దాడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ దాడి జరిగిన వెంటనే జగన్ హైదరాబాద్‌కు విమానంలో వెళ్లడం... అనంతరం స్థానిక సిటీ న్యూరో సెంటర్‌లో చేరడం.. ఆయనకు రెండు రోజులు విశ్రాంతి అవసరమని ఆ ఆసుపత్రి వైద్యుడు చెప్పడం చకచకా జరిగిపోయాయి.
ఇంకోవైపు వైయస్ జగన్‌పై దాడి చేసిన వెంటనే శ్రీను వద్ద నుంచి 11 పేజీల ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం.. అందులో పేర్కొన్న అంశాలు.. రేషన్ షాపులకు వెళ్లి రేషన్ తీసుకోనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ నేపథ్యంలో వారి... ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ అందించాలంటూ సదరు లేఖలో శ్రీను పేర్కొనడం.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవే అంశాలు అమలు కావడం ఒక ఎత్తు అయితే.. కోడికత్తి దాడిలో జగన్‌కి వైద్యం అందించిన వైద్యుడు.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటంపై పలు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్‌లో .. పలు సందేహాలకు తెరలేచిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
మరో వైపు గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అంటే 2019, మార్చి 15న వైయస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఈ హత్య చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందంటూ.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో తన చిన్నాన్నను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశారు? వారు ఏం ప్రయోజనం ఆశించి ఈ దారుణానికి ఒడిగట్టారు? ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. నిజానిజాలు బయటకురావంటూ మీడియా ముందుకు వచ్చి జగన్ డిమాండ్ చేశారు.
అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. వివేకా హత్య కేసు మాత్రం ముందుకు కదల్లేదు. విపక్ష నేతగా ఉండగా సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేసిన జగన్ సీఎం అయ్యాకా.. అబ్బే సీబీఐ దర్యాప్తు ఎందుకు అంటూ మాటమార్చారు. దీంతో హతుడువివేకా కుమార్తె డాక్టర్ సునీత.. ఒంటరిగా న్యాయపోరాటానికి దిగి.. తన తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ పోరాడుతున్నారు. ఆమె పోరాటం ఫలితంగా కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారింది. ఒక తార్కిక ముగింపు దిశగాసాగుతోంది. అదలా ఉంటే.. అటు కోడి కత్తి దాడి కానీ.. ఇటు సొంత బాబాయి వివేకా హత్యను కానీ... జగన్ అండ్ కోకు అనుకూలంగా సెంటిమెంట్‌ని పండించి అధికారం కట్టబెట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. నాడు అదికారానికి దోహదపడేలా సెంటిమెంట్ ను పండించిన ఘటనలే ఇప్పుడు రివర్స్ లో జగన్ కు వ్యతిరేకంగా యాంటీ సెంటిమెంట్ గా మారుతున్నాయి.