బీజేపీ మీద కేసీఆర్ ఫోకస్
posted on Apr 17, 2023 @ 4:55PM
తెలంగాణా ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలని చూస్తున్నారు. బిజేపీకి ఒక్క స్థానం దక్కకుండా పూర్తి ఫోకస్ పెట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తీవ్రంగా యత్నిస్తూనే బీజేపీ అడ్రస్ గల్లంతు చేయాలని చూస్తున్నారు. బీజేపీ నామరూపాలు లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నట్లు కనబడుతుంది. కనీసం 100 సీట్లు బీఆర్ఎస్ గెలుపొందాలని కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
గోషామహల్, హుజూరాబాద్, దుబ్బాక నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈ మూడు స్థానాల్లో కాషాయ జెండాకు బదులు పింక్ జెండా ఎగరేయాలని ఉవ్వీళూరుతున్నారు.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త మీద విద్వేష ప్రసంగ ఆరోపణపై పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. అయితే నేటి వరకు అతని సస్పెండ్ ఉపసంహరణ కాలేదు.
పోలీసులు అతన్ని పీడీ యాక్ట్ క్రింద అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే కోర్టు అతనికి కండిషన్ బెయిల్ మంజూరు చేసింది.
రాజా సింగ్ ను ఓడించడానికి బీఆర్ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్ పోటీ చేసే అవకాశాలున్నాయి. దాదాపు అతనికి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
2018లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటి చేసి 44 వేల వోట్లు సాధించి రాజాసింగ్ పై ఓడిపోయారు.
హుజూరాబాద్ లో ఎంఎల్సీ కౌశిక్ రెడ్డి తో పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఈటెల రాజేందర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డిని రంగంలో దించే అవకాశముంది.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఓడించడానికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త కోట ప్రకాశ్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దుబ్బాక మీద ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఇప్పటికే ప్రకాశ్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.