కృత్రిమ మేథతో కోట్లాది మంది ఉపాధి గోవిందా?!
దేవుడిని మానవుడు ఆవిష్కరించినప్పుడు చరిత్ర మొదలైంది. ఇప్పుడు మానవుడే దేవుడిగా మారుతున్నాడా? ఇటీవలి వరకూ కంప్యూటర్లు మనతో భౌతిక నైపుణ్యాలు, ఉద్యోగాల విషయంలోనే పోటీ పడేవి. తొలిసారి అవి మేధో నైపుణ్యాల విషయంలోనూ పోటీ పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం జెట్ వేగంతో పరుగులు పెడుతోంది. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. అది మానవ జీవితంలో స్పృశించని పార్శ్వమంటూ లేకుండా పోతోంది. మనుషుల స్థానాన్నే ఆక్రమిస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఎదురయ్యే సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులపై సర్వత్రా ఆసక్తి, ఆందోళన వ్యక్తమౌతోంది.
టీవీలో మనం వార్తలు చూస్తూనే ఉంటాం. వివిధ కార్యక్రమాలు, షోలను హోస్ట్ చేసే యాంకర్లనూ చూస్తున్నాం. ఆ వార్తలు చదివే వారు, షోలను హోస్ట్ చేసే వాళ్లు నిజమైన మనుషులు కాకపోతే? కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే డిజిటల్ రూపాలైతే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(కృత్రిమ మేధస్సు) తీసుకొస్తున్న విప్లవం అనాలో, ప్రమాదం అనాలో తెలియదుగానీ.. క్రమంగా మానవ సామర్థ్యాన్ని పెరుగుతున్న సాంకేతికత మింగేస్తోంది. ఇప్పటి వరకూ రోబో ‘సోఫియా’ ఒక సంచలనం అనుకుంటుండగా.. తాజాగా ‘కృత్రిమ’ న్యూస్ యాంకర్ వచ్చేసింది!
చూడటం, వినడం, తాకడం మాత్రమే కాదు.. అవసరానికి తగ్గట్టు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో రోబో కూడా అలాగే ప్రవర్తించేట్లు, తనకు తాను కొత్తగా నేర్చుకునేట్లు అందులో ఒకరకమైన తెలివి తేటలను ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా అభివృద్ధి చేశారు. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ అంటారు. అలసట అన్నదే లేకుండా 24 గంటలూ పనిచేస్తుంది. కానీ.. ఇది జీవించి ఉన్న మహిళ కాదు. కంప్యూటర్ ప్రోగ్రామ్ అమర్చిన వర్చువల్ రోబోటిక్ న్యూస్ యాంకర్. ఇది టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ను ఉపయోగించి మాట్లాడే వీడియో. సాధారణ యాంకర్ మాదిరిగానే పెదవులను కదుపుతూ, గొంతు, ముఖ కవళికలు, హావభావాలను సహజంగా ప్రదర్శిస్తూ అనేక భాషల్లో తాజా వార్తలను మనకు అందజేస్తుంది. దీంతో మనం నిజమైన న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుంటే చూసిన అనుభూతిని పొందుతాం. అందుకే ఆ రోబో యాంకర్ ను వర్చువల్ యాంకర్ అని కూడా పిలుస్తారు. భవిష్యత్తులో ఈ రోబో న్యూస్ యాంకర్లు అన్ని దేశాలకూ విస్తరించినా ఆశ్చర్యం లేదు.
ప్రజలు అప్లికేషన్ ద్వారా విద్య, గృహాలు, ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై న్యూస్ యాంకర్‌తో మాట్లాడొచ్చు. ఇప్పుడు న్యూస్ యాంకర్ల స్థానాన్ని ఏఐ యాంకర్లు ఆక్రమించుకునే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఇండియా టుడే గ్రూప్ నకు చెందిన ‘ఆజ్ తక్’ న్యూస్ చానెల్ ‘సనా’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మహిళా న్యూస్ యాంకర్ ను ప్రవేశ పెట్టింది. ప్రముఖ జర్నలిస్టు సుధీర్ చౌదరి ఇటీవల నిర్వహించిన ‘బ్లాక్ అండ్ వైట్’ షో ద్వారా ‘సనా’ ప్రేక్షకులకు పరిచయమైంది. సుధీర్ చౌదరితో కలిసి షో నిర్వహించిన ‘సనా’ వార్తలు కూడా చదివింది. ఈమె దేశంలోనే తొలి ఏఐ న్యూస్ యాంకర్ గా రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో తొలి ఏఐ న్యూస్ యాంకర్ ను చైనా నాలుగేళ్ల క్రితమే ప్రారంభించింది. చైనా సెర్చ్ ఇంజిన్ కంపెనీ సోగో, చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా సంయుక్తంగా రూపొందించిన ఒక పురుష ఏఐ న్యూస్ రీడర్ చైనా భాషతో పాటు ఇంగ్లీషులో వార్తలు చదువుతున్నాడు. ఏడాది తర్వాత మహిళా ఏఐ న్యూస్ రీడర్ ‘షిన్ షియావోమెంగ్’ ను కూడా ఆవిష్కరించారు.
జీవమనేది ప్రకృతి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ప్రకృతి స్థానాన్ని ఇప్పుడు సైన్స్ ఆక్రమిస్తోంది. కంప్యూటర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు(ఏఐ)కు సంబంధించిన ఆల్గారిథమ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. వాటికి అభ్యాస, విశ్లేషణ సామర్థ్యాలు ఉంటున్నాయి. ఇన్ఫోటెక్, బయోటెక్‌ల కలయికతో మనల్ని మెరుగ్గా విశ్లేషించే, మనతో సంభాషించే సామర్థ్యమున్న ఆల్గారిథమ్‌లకు మార్గం సుగమమవుతోంది. ఈ కృత్రిమ మేధస్సు, బయో ఇంజినీరింగ్‌తో కొత్త జీవజాతి పుట్టుకొస్తోంది. వీటివల్ల అనేక సమస్యలూ తలెత్తుతాయి. సాంకేతిక ఆవిష్కరణల కారణంగా కొన్ని దేశాలు సంపన్నమవుతాయి. ఇతర దేశాలు పేదరికంలో కూరుకుపోతాయి.
ఇంతకీ ఆర్టిఫిషియల్ అంటే ‘కృత్రిమ’, ఇంటెలిజెన్స్ అంటే ఆలోచించే శక్తి ఉన్న ‘మేధస్సు’. ఏఐ అంటే మనిషి తయారు చేసిన కంప్యూటర్ ప్రోగ్రామ్ కు ఆలోచించే, నేర్చుకునే సామర్థ్యాన్ని అందించడమే. మానవ మేధస్సును అనుకరిస్తూ మనుషులు సాధారణంగా చేసే పనులను సొంతంగా చేసుకోగలిగే శక్తిని అందించే యంత్రాలను తయారు చేయడమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అనేది నేర్చుకునే మరియు ఆలోచించగల సామర్థ్యం ఉన్న ప్రోగ్రామ్. ఏఐ ప్రధానంగా మూడు రకాలు. (1) బలహీనమైన ఏఐ (2) బలమైన ఏఐ (3) అత్యంత బలమైన ఏఐ.
బలహీనమైన ఏఐ: ఒక పనిపైనే దృష్టి సారిస్తుంది. దాని పరిమితులను మించి పని చేయదు. ఉదాహరణకు ప్రస్తుతం మనం రోజువారీ ఉపయోగిస్తున్న యంత్రాలు.
బలమైన ఏఐ: మానవుడు చేయగలిగిన ఏదైనా మేధోపరమైన పనిని అర్ధం చేసుకోగలుగుతుంది. మనం ప్రోగ్రామింగ్ చేసి పెడితే నేర్చుకొని మన సూచనలకు అనుగుణంగానే సొంతంగా చేస్తుంది. ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు, ఏఐ న్యూస్ యాంకర్లు, ఏఐ లాయర్లు, చెస్ ఆడే యంత్రం. దానిలోని కృత్రిమ మేధను యాంత్రిక అనువాదం చేయడం సాధ్యం కాదు. పరిశోధకులు ప్రస్తుతం బలమైన ఏఐలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి మానవాళికి విరుద్ధంగా తయారయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే దాని పరిధి చాలా చిన్నది.
సూపర్ ఏఐ: ఇది మానవ మేధస్సును అధిగమిస్తుంది. అనేక రకాల పనులను మనుషుల కంటే మెరుగ్గా, చురుకుగా చేయగలిగే కృత్రిమ మేధ. పరిశోధకులు ఇప్పటికీ వీటిని తయారు చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. సూపర్ ఏఐ పరిశోధనలు ఫలప్రదమై మానవాళికి విరుద్ధంగా తయారయ్యే పరిస్థితి వస్తే..? నిజంగా అక్కడి దాకా వస్తే.. అది మానవాళికి విరుద్ధంగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదు.
మేధస్సు కలిగిన కంప్యూటర్లు ఉద్యోగ మార్కెట్ నుంచి మానవులను గెంటివేస్తాయి. ఏఐ రోబో ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వర్ గానే కాకుండా టీవీ ఛానెళ్లలో వార్తలు చదివే యాంకర్ గా, లాయర్ గా న్యాయ సలహాలు అందించేందుకూ సిద్ధమైంది. త్వరలో కోడింగ్, సాఫ్ట్ వేర్ డెవలపింగ్, కంటెంట్ రైటింగ్, పారా లీగల్, న్యాయ సహాయం, మార్కెట్ రీసెర్చ్ విశ్లేషకులు, ఉపాధ్యాయులు, ఫైనాన్స్ పరిశ్రమలో కార్మికులు, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో, ఆడియో ఎడిటింగ్, అకౌంటింగ్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్టులు, వైద్యులు, డ్రైవర్లు, సైనికులు, బ్యాక్-ఆఫీస్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, మార్ట్‌గేజ్.. ఇలా అన్ని రంగాల్లో ఏఐ రోబోలు పాగా వేయనున్నాయి. నటులు, సంగీతకారులు, గాయకులు, నిర్మాతలుగానూ ఏఐ రోబోలు అవతరిస్తారు. ఆయా రంగాల్లో 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర నుంచి 37న్నర కోట్ల మంది తమ ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని ఉద్యోగులకు ఎక్కువ నష్టం కలుగుతుంది.
ఆటోమేషన్ వల్ల కొత్త ఉద్యోగాలకూ కొదవ ఉండదు. సాంకేతిక పరంగా ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ యంత్రాల వెనుక, యంత్రాలతో పాటు మనుషులు ఉండాల్సిందే. తోటపని, ప్లంబింగ్, చిన్నపిల్లలు-వృద్ధుల సంరక్షణ తదితర పనులు రోబోలు చేయలేవు. ఇంధన పొదుపు తదితర విభాగాల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే.. కృత్రిమ మేధో ప్రపంచంలో 40% మందికి పని దొరికినా మిగిలిన 60% మంది పరిస్థితి దుర్భరంగా ఉంటుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఏఐతో వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి కొత్త ఉద్యోగాలను సృష్టించడమే సరైన వ్యూహం. సాంకేతిక మార్పులకు అనుగుణంగా మానవ శక్తిని సన్నద్ధం చేయడం, అందుకు ముందస్తు సన్నాహాలు చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి.
చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీతో భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో సహా 1344 మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కోట్లాది ఉద్యోగాలు పోవడంతో పాటు మానవాళి ఉనికికే ముప్పు తీసుకొచ్చే ఏఐను వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందంటూ బహిరంగ లేఖ రాశారు. చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ ఇటీవల జీపీటీ-4 పేరుతో అత్యాధునిక వ్యవస్థను పరిచయం చేసింది. జీపీటీ-4 కంటే శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సమాజానికి, మానవాళికి ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని, ప్రతికూల ప్రభావాలు తలెత్తితే నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా ముందుకెళ్లాలని సూచించారు.
మరోవైపు ఏఐతో వచ్చే కుదుపులను తగ్గించుకోవడానికి, సర్దుబాట్ల సమయం తీసుకోవడానికి ఆటోమేషన్ వేగాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు భావించే వీలుంది. అయితే దీన్ని పూర్తిగా నిరోధించడం అసాధ్యం, అవాంఛనీయం. నేడు కారు ప్రమాదాల్లో ఏటా 12.5 లక్షల మంది చనిపోతున్నారు. వీటిలో మానవ తప్పిదాల వాటా 90% కన్నా ఎక్కువే. స్వయం చోదిత వాహనాలతో ఆ ముప్పు తగ్గిపోతుంది. ఆటోమేషన్‌పై ఆధారపడే సమాజంలో ప్రపంచ శక్తి సమతౌల్యమనే ప్రభుత్వాల నుంచి టెక్ కంపెనీల వైపు మొగ్గుతుంది. అందువల్ల ఈ కంపెనీలే ప్రభుత్వ అవతారం ఎత్తవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రభుత్వాలు గుత్తాధిపత్యం చెలాయించే అవకాశమూ లేకపోలేదు.