అవినాష్ కు సీబీఐ నోటీసు.. జగన్ పర్యటన రద్దుకూ లింకేమిటో?
posted on Apr 16, 2023 @ 11:43PM
గదిలో ఉన్న స్విచ్చి నొక్కితే వరండాలో లైటు వెలుగుతుంది. అలాగే సీబీఐ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తే చాలు ఏపీ సీఎం జగన్ తన పర్యటనలను, కార్యక్రమాలను రద్దు చేసేసుకుంటారు. గతంలో రెండు సార్లు ఇలాగే జరిగింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా అదే జరిగింది.
గతంలో ఆయన తన పర్యటనలను రద్దు చేసుకున్న రెండు సార్లూ సిరికిం జెప్పడు.. అన్నట్లుగా హఠాత్తుగా హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ సీబీఐ దర్యాప్తులో వేగం మందగించిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు సీబీఐ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఆదివారం (ఏప్రిల్ 16) అరెస్టు చేసింది. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీబీఐ పది రోజుల కస్టడీకి పిటిషన్ దాఖలు చేసింది. అలాగే సోమవారం (ఏప్రిల్ 17) విచారణకు హాజరు కవాల్సిందిగా అవినాష్ రెడ్డికి నోటీసు పంపింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జగన్ సోమవారం (ఏప్రిల్ 17)న అనంతపురం జిల్లాలోని శింగనమలలో వసతి దీవెన పథకం కింద బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేయాలి. అయితే ఆ పర్యటన రద్దైంది. కారణాలేమిటన్నదానిపై స్పష్టత లేదు. అనివార్య కారణాల వల్ల జగన్ సింగనమల పర్యటన రద్దైందనీ, ఈ నెల 26న ఆయన విద్యాదీవెన పథకానికి బటన్ నొక్కుతారని సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో రెండు సార్లు చేసిన విధంగానే ఈ సారి కూడా ఆయన సోమవారం హుటాహుటిన హస్తిన బయలుదేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ ఆయన హస్తిన వెళ్లి కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపినా.. గతంలోలా ఈ సారి వర్కౌట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు.
సుప్రీం కోర్టుకు సీబీఐ చెప్పిన మేరకు వివేకా హత్య కేసు దర్యాప్తు ఈ నెల 30లోగా పూర్తి చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది కనుక సీబీఐ దర్యాప్తు నెమ్మదించే అవకాశాలు అంతంతమాత్రమేనని అంటున్నారు. మరి ఇంతకీ జగన్ శింగనమల పర్యటన రద్దు కావడానికి కారణమైన ఆ అనివార్య కారణాలేమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.