మరో సారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసు.. ఇక అరెస్టే?
posted on Apr 16, 2023 @ 11:25PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముగింపు దశకు వచ్చేసినట్లేనా అంటే ఔననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. క్షణం ఆలస్యం చేయకుండా అవినాష్ రెడ్డికి మరో సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది.
ఆ నోటీసులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా సోమవారం (ఏప్రిల్ 17) నాడే విచారణకు రావాలని పేర్కొంటూ ఆదివారం (ఏప్రిల్ 16) ఆయనకు నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా ముహుర్తం ఖరారైనట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు ఆదివారం పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అవినాష్ లేరు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాత్రమే ఉన్నారు.
దీంతో ఆయన ఒక్కరినే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఒక వేళ అవినాష్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లో ఉండి ఉంటే ఆయనను కూడా అరెస్టు చేసి ఉండేవారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని అవినాష్ నివాసానికి కూడా సీబీఐ అధికారులు ఆదివారం వెళ్లారు. అయితే ఆయన అప్పటికే తన తండ్రి అరెస్టు వార్త తెలుసుకుని పులివెందులకు బయలు దేరడంతో హైదరాబాద్ నివాసంలో కూడా సీబీఐ అధికారులకు ఆయన దొరకలేదని అంటున్నారు.దీంతో ఆదివారం సాయంత్రం (ఏప్రిల్ 16) సాయంత్రం అనివాష్ రెడ్డికి సీబీఐ సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. అసలు ఇప్పటికే నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఆయనను అరెస్టు చేయనున్నట్లు కూడా కోర్టుకు తెలిపింది.
ఈ నేపథ్యంలో గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి ఆ తరువాత కారణాలేమైతేనేం దానిని ఉపసంహరించుకున్నారు.అంతకు ముందే సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో సోమవారం విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెలాఖరులోపు .. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలియజేసిన సంగతి విదితమే. అందుకే వేగం పెంచి అరెస్టుల పర్వానికి తెరలేపింది.
ఇప్పటికే ఈ కేసులో వరుస అరెస్టులు చేసింది. అవినాష్ సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ తరువాతి టార్గెట్ అవినాష్ రెడ్డే అంటున్నారు. తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డిలో కూడా ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన పులివెందులలోని సీఎం కార్యాలయం వద్ద ఆదివారం (ఏప్రిల్ 16) విలేకరులతో మాట్లాడుతూ మళ్లీ పాతకథనే వినిపించారు. సీబీఐ దర్యాప్తు సవ్యదిశలో సాగడం లేదని ఆరోపణలు గుప్పించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను సీబీఐ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు కురిపించారు. దీనిపై న్యాయనిపుణులు నిందితుల ఆరోపణలు, అభ్యంతరాలను దర్యాప్తు సంస్థలు పట్టించుకోవలసిన అవసరం లేదని చెబుతున్నారు.