జగన్ జాతకం తిరగబడిందా?
posted on Apr 17, 2023 @ 3:33PM
వైనాట్ 175 అంటూ రంకెలేసిన వైసీపీ సేన ప్రస్తుతం ఆత్మ పరిశీలనలో పడింది. నేనున్నాను.. నేను విన్నాను నుండి మా నమ్మకం నీవే జగన్ అనేంత వరకూ సాగిన జగన్సాలన ఏమీ సాధించకుండానే చరమాంకానికి చేరుకుంది. డజను సీబీఐ కేసులు, 16 నెలల జైలు జీవితం పెట్టుబడిగా సాధించుకున్నసీఎం పదవి జగన్ కు కష్టాలనే మిగిల్చింది. నోరు జారిన పాపానికి నవరత్నాలను మేనిఫెస్టోలో పెట్టి, గెలిచిన తరువాత అమలుకు అష్టకష్టాలూ పడుతున్నాడని రాజకీయ పండితులు అంటున్నారు.
దీంతో రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి రావడం, అప్పుల కోసం అన్ని అడ్డ దారులూ తొక్కడం జగన్ పదవీ కాలంలో ఆయనకు గుర్తుండిపోయే కొన్ని విషయాలు. డబ్బులు పంచడమే సంస్కరణ అన్న కొత్త సంస్కరణ అమలు చేయడం ఎంత కష్టమో జగన్ కు అర్ధం అయ్యింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా 97 వూల రెటకలే. ఇది62 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాటా. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఐదేళ్లూ పరిపాలన సాగించిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా లక్షా డెబ్భై వేల కోట్లు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో చేసిన అప్పు అక్షరాలా రెండు లక్షల ముఫై వేల కోట్లు. అన్నీ చేర్చుకుని ఈ రోజుకు ఏపీ అప్పు నాలుగు లక్షల ఎనభై మూడు వేల కోట్లుగా కేంద్రం నిర్ధారించింది.
అయితే తెలుగుదేశం హయాంలో ఐదేళ్ల అప్పుకంటే జగన్ నాలుగేళ్ల అప్పు యాభై వేల కోట్లు అధికం. మరో సంవత్సరం మిగిలి ఉన్నందున మరో 70 వేల కోట్ల అప్పుకు జగన్ పథకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో జగన్ కు తప్పనిసరి అనేది ఆర్థిక విశ్లేషకుల వాదన.
జగన్ ప్రభుత్వం స్విచ్ నొక్కిపంచిన డబ్బులే ఓట్లుగా మారి ఈవీఎమ్ చిప్ లను ఫ్యాన్ గుర్తుతో నింపేస్తాయని వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అలా అయితే 2024 ఎన్నికలలో అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది కొంత మంది సిట్టింగ్ లు, ఆశావహుల లాజిక్.
ఒక వేళ వైసీపీ అభ్యర్థులు అలా ఆలోచించి ఎన్నికలలో ఖాళీ జేబులతో తిరిగితే పార్టీ అధికారంలోకి రావడం సంగతి తరువాత, పరువు కూడా దక్కదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పులి మీద పుట్రలా వివేకా హత్య కేసు, పార్టీలో అసమ్మతి, మరో వైపు రోజు రోజుకీ పెరుగుతున్న తెలుగుదేశం గ్రాఫ్ వైసీపీ అధిష్ఠానానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. చర్చించుకుంటున్నారు. తాజాగా జగన్ జాతకాలు చెప్పే వారిని స్పెషల్ ఫ్లైట్లలో రప్పించుకుని చర్చించడం ఆ పార్టీలో అంతర్మథనాన్ని చెప్పకనే చెబుతోంది.