విశాఖ ఉక్కు సెంటిమెంట్ తో జేడీ రాజకీయ పబ్బం!
posted on Apr 17, 2023 @ 12:35PM
విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వ్యవహారంలో సీబీఐ మాజీ జేడీ తన రాజకీయ ప్రయోజనాలను వెతుక్కుంటున్నారా? విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడానికి ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న బృహత్ ఉద్యమాన్నినీరుగార్చైనా సరే తాను రాజకీయంగా లబ్దిపొందాలని భావిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కావడాన్ని వ్యతిరేకించాల్సిన నేతలు.. తామే పెట్టుబడులు పెడతామంటూ ముందుకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
జనంలో పలుకుడి, పాపులారిటీ కోసం.. విశాఖ ఉక్కు రక్షకులుగా ముద్ర కోసం.. అసలు లక్ష్యాన్ని వదిలేసి.. అసలు లక్ష్మానికే ఎసరు పెట్టేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు విషయంలో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం విమర్శలకు గురి అవుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పరిశ్రమకు నిధులు వచ్చేలా చేయాల్సిన నాయకులు.. అందుకు భిన్నంగా బిడ్ వేస్తాం, పెట్టుబడులు పెడతాం అంటూ కేంద్రం నెత్తిన పాలు పోస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రజల తరఫున అంటూ దాఖలు చేసిన బిడ్ పై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటూ ఆయన వెన్స్ ప్రా ఇంపెక్స్ కంపెనీ ద్వారా దాఖలు చేసిన బిడ్ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పేరు మీదే బిడ్ దాఖలు చేస్తానని ప్రకటించిన లక్ష్మీనారయణ ఇప్పుడు కంపెనీ పేరుపై బిడ్ దాఖలు చేయడమేమిటని నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల ప్రమేయం లేకుండా దాఖలైన ఈ బిడ్ ద్వారా ఆయన ఆశిస్తున్నదేమిటి?
నిన్న మొన్నటి వరకూ వావిలాల గోపాలకృష్ణయ్య పైసా ఉద్యమం స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ. 100 ఇస్తే నెలలో రూ. 850 కోట్లు జమౌతాయని, అలా ఓ నాలుగు నెలలు జమ చేస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చిని చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హఠాత్తుగా మాట మార్చి కొత్త కంపెనీని తెరపైకి తీసుకురావడం వెనుక ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి సేకరించే కోట్లాది రూపాయల సొమ్మును ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటూ తాను ఏ కంపెనీ పేరుతో బిడ్ దాఖలు చేశారో ఆ కంపెనీలో జమ చేస్తారా? వచ్చే ఎన్నికలలో తాను విశాఖ నుంచి పోటీ చేస్తాననీ, ఒక వేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వక పోతే ఇండిపెడెంటుగానైనా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జేడీ.. విశాఖ ఉక్కును ఎన్నికలలో తన విజయానికి సోపానంగా ఉపయోగించుకోవడానికే ఫక్తు రాజకీయ వేత్తలా మాటలతో మాయ చేసి జనం చెవులలో పువ్వులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సీబీఐ డైరెక్టర్ గా పని చేసిన కాలంలో జనంలో తన పట్ల ఏర్పడిన నమ్మకాన్నే వారిని వంచించడానికి పెట్టుబడిగా వాడుకుని జనాన్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. తెలంగాణలో అధికారంలోఉన్నకేసీఆర్ సర్కార్ ‘బిడ్’లో పాల్గొంటున్నట్టు ప్రకటించగానే దాన్ని జేడీ స్వాగతించిన లక్ష్మీనారాయణ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు దోహదపడే విధంగానే వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం అంటున్నారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్ ను ఆలంబనగా చేసుకుని తన రాజకీయ బవిష్యత్ కు బాటలు వేసుకునేందుకు జేడీ చేస్తున్న ప్రయత్నంగా విశాఖ వాసులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.