హౌ టూ డిఫీట్ మోడీ? కేసీఆర్ స్కెచ్ రెడీ!
posted on Apr 16, 2023 @ 10:40PM
నిజానికి ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారమే అంతిమ లక్ష్యం. అలాగే ఏ రాజకీయ నాయకుడికి అయినా పదవే పరమావధి. సో 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కూడా. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యకం చశారు. అలాగే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని దేశం అంతటా అమలు చేస్తామని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా వాగ్దానం చేశారు. అవును అంబేడ్కర్ జయంతి నాడు అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ వేదిక నుంచి కేసీఆర్ దేశ ప్రజలకు ఈ వాగ్దానం చేశారు.
నిజానికి 2024 ఎన్నికల్లో ఏదో విధంగా బీజేపీ మోడీలను ఓడించి ప్రధాని పదవిని అలంకరించాలని ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, రాహుల్ గాంధీ మొదలు చాలా మంది మహా నాయకులు ఆశ పడుతున్నారు. రేసులో పరుగులు తీస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కేసేఆర్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయానికి కొద్ది గంటలు అటూ ఇటుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో 2024 ఎన్నికల్లో బీజేపీ, మోదీలని ఓడించడం ఎలా? అనే విషయంపై మంతనాలు సాగిస్తున్నారు.
అంతకు ముందు ఇదే విషయంపై నితీష్ కుమార్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తోకలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపారు. అలాగే ఇటీవల జాతీయ హోదా కోల్పోయిన సిపిఐ జాతీయ నేత డి.రాజా, సిపిఎం నేత సీతారాం ఏచూరితోనూ.. హౌ టూ డిఫీట్’ బీజేపీ అండ్ మోడీ’ అనే విషయంపై ‘శాస్త్రీయ’ చర్చలు సాగించారు. నిజానికి, వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించి, అ కుర్చీలో తాము కూర్చోవాలని ఆశపడని విపక్ష నేత బహుశా ఎవరూ ఉండరేమో.. అయితే, అది అయ్యే పనేనా? అన్నదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసమే ప్రాంతీయ పార్టీల జాతీయ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. మల్లగుల్లాలు పడుతున్నారు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా అటూ ఇటూ పరుగులు తీస్తునారు.
అయితే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చింది మొదలు, జాతీయ రాజకీయాలపై దృష్టి నిలిపిన కేసీఆర్ ఇతరుల కంటే ఒకడుగు ముందుకేసి, ఏకంగా హామీలు కురిపించే వరకు వెళ్లారు. నిజానికి, నిన్నమొన్న ఢిల్లీలో కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు అందరినీ కలిసిన నితీష్ కుమార్ కు ఇతర పార్టీల నుంచి కొంత సానుకూల స్పందన వచ్చింది. ప్రతి నియోజక వర్గంలో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని నిలిపాలనే ఆయన ప్రతిపాదనను దాదాపు అన్ని పార్టీలూ కనీసం సూత్ర ప్రాయంగా అయినా అంగీకరించాయి.
కానీ, గతంలో కేసీఆర్ ఇలాగే అనేక పార్టీల నాయకులను కలిసినా నితీష్ సహా ఏ ఒక్కరు కుడా సానుకూలంగా స్పందించలేదు. అయినా కేసీఆర్ ప్రగతి భవన్ గడప దాటకుండానే, ఢిల్లీ పీఠానికి నిచ్చెనలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్‌దే అంటున్నారు. మహారాష్ట్రలో ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేసిన కింది స్థాయి నేతల్ని చేర్చుకుంటూ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే కలలు కంటున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్ చెప్పేదానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదని, బీఆర్ఎస్ నాయకులే పెదవి విరుస్తున్నారు.