స్వలింగ సంపర్క వివాహాలపై సుప్రీం విచారణ
posted on Apr 17, 2023 @ 3:15PM
స్వలింగ సంపర్క వివాహాలకు చట్ట బద్దత విషయంలో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ ప్రారంభించనుంది. అయితే ఈ విచారణ ప్రారంభించడానికి ఒక రోజు ముందే కేంద్ర ప్రభుత్వం స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకించింది. ఈ పిటిషన్ కొట్టి వేయాలని కేంద్ర ప్రభుత్వం మరో సారి సుప్రీంను అభ్యర్థించింది. స్వలింగ సంపర్క వివాహాలకు సంబంధించిన అన్ని పిటిషన్లను కొట్టి వియాలని కేంద్రం కోరింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ ఎస్ కె కౌల్ ,జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 18 నుంచి దీనిపై విచారణ చేపట్టనుంది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు సహా వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
అంతకుముందు నవంబర్ 25న, రెండు వేర్వేరు స్వలింగ జంటల పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సమయంలో, స్వలింగ సంపర్కులకు సాధారణ పౌరుడితో సమానమైన ప్రాథమిక హక్కులు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు మంగళవారం తుది వాదనలు విననుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కొన్నేళ్లుగా భారతదేశంలో స్వలింగ సంపర్కానికి ఆమోదం కూడా పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా 28 దేశాల్లో స్వలింగ సంపర్క వివాహాలకు చట్ట బద్దత లభించింది. భారత దేశంలో మాత్రం చాలాకాలంగా ఈ అంశం మరుగున పడింది. గే, లెస్బియన్స్ అనే స్వలింగ సంపర్కులు చాలా కాలంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వివాహాల విషయంలో ఇంకా చట్ట బద్దత లభించలేదు.