పార్టీ కీలక నేతలతో జగన్ బేటీ.. ఏం చర్చించారంటే?
posted on Apr 17, 2023 @ 4:56PM
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు అనూహ్యంగా పెంచిన నేపథ్యంలో జగన్ కోటరీలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి మేనమామ అయిన వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు తరువాత ఈ భయం మరింత పెరిగింది. ఈ కేసులో పాత్ర ధారులు, సూత్ర ధారులెవరన్నది తేలిపోయే దశకు వచ్చిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సోమవారం (ఏప్రిల్ 17) సీబీఐ విచారణను తప్పించుకున్న అవినాష్ రెడ్డి మంగళవారం ( ఏప్రిల్ 18) అనివార్యంగా సీబీఐ ఎదుట హాజరు కాకతప్పదు.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్బంగా కోర్టు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందా అన్న కోర్టు ప్రశ్నకు సీబీఐ తరఫు న్యాయవాదులు అవసరం అయితే అరెస్టు చేస్తామని బదులిచ్చారు. అలాగే భాస్కరరెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందనీ, ఆయన పిటిషన్ కోర్టు విచారణలో ఉండగానే అరెస్టు చేయడం అక్రమమనీ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనను మధ్యలో అడ్డుకున్న కోర్టు.. పిటిషన్ విచారిస్తామన్నామే కానీ.. అరెస్టు చేయవద్దని ఆదేశించలేదుగా అని వ్యాఖ్యనించింది. ఈ నేపథ్యంలోనే గతంలో అవినాష్ రెడ్డి సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఏప్రిల్ 18) అవినాష్ రెడ్డిని విచారించిన అనంతరం ఆయనను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది.
సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదించిన మేరకు ఈ నెల 30 లోగా వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే సీబీఐ విచారణను వేగవంతం చేసింది. వరుస అరెస్టులతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్యనేతలతో సోమవారం (ఏప్రిల్ 17) అత్యవసరంగా సమావేశమయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివేకా హత్య చేసులో బాస్కరరెడ్డి అరెస్టుతో జగన్ ఆది, సోమవారాలలో తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. చివరాఖరికి జగనన్న విద్యా దీవెన పథకం కింద అనంత జిల్లాలో ఏర్పాటు చేసిన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని సైతం రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం ప్యాలెస్ లోనే పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ కేసులో బాధితుల తరఫు వారూ, నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారూ కూడా జగన్ ను సమీప బంధువులే కావడంతో ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు వైసీపీపై కూడా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వైపు జగన్ కు స్వయానా చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత.. మరో వైపు సీఎం సతీమణి మేనమావ, ఆయన కుమారుడు.. దీంతో ఈ కేసులో ఏ పరిణామమైనా నేరుగా జగన్ కుటుంబంపైనే ప్రభావం చూపుతోంది. అంతే కాకుండా వివేకా హత్య కేసులో వెలుగులోకి వస్తున్న అంశాలు సీమ రాజకీయాలలో కూడా ప్రభావం చూపుతున్నాయి. అజాత శత్రువుగా పేరుపడిన వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్న అంశాలు, జరుగుతున్న అరెస్టులు అధికార పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో పడేశాయి.
పైపెచ్చు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వివేకాపై ఇప్పుడు చేస్తున్న ఆరోపణలతో వారికి పులివెందులలోనే కాకుండా కడప వ్యాప్తంగా ప్రతికూత ఎదురౌతోంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? పార్టీపై ఈ కేసు ప్రభావం పడకుండా ఎం చేయాలి అన్న విషయాలపై చర్చించేందుకే జగన్ పార్టీకి చెందిన కీలక నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.