కూటమి సభలు అదుర్స్.. జగన్ బెదుర్స్!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలవేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన బీజేపీ,కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలతో పాటు అభ్యర్ధుల ప్రకటన పూర్తయింది. దీంతో కూటమి అభ్యర్థుల విజయాన్నికాంక్షిస్తూ చంద్రబాబు, పవన్ రోడ్ షోలు, సభల్లో పాల్గొన్నారు. ఇద్దరు అగ్రనేతలు కలిసి తణుకు, నిడదవోలు, పి. గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో చంద్రబాబు, పవన్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే బేధాలు లేకుండా మెలిగారు, మెసిలారు. అంతేకాక.. జెండాలు వేరయినా అజెండా ఒక్కటేనని, రాష్ట్రంకోసం సీట్ల పంపకం విషయంలో త్యాగాలు చేసి.. కలిసికట్టుగా ముందుకొచ్చామని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా ఉండాలని, కూటమి అభ్యర్థులు ఏ పార్టీ వారైనా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మూడు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ఏపీలో కొనసాగించిన అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీతో కలిసి చంద్రబాబు, పవన్ ఏకతాటిపైకి వచ్చారు. సీట్ల పంపకం విషయంలో ఒకరినొకరు సహకరించుకొని పార్టీలు కాదు.. రాష్ట్రం అభివృద్ధే ధ్యేయం అని చాటారు. అయితే అధికార వైసీపీ టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నాలు చేసింది. చేస్తోంది. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వెంట కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ కాపు సామాజికవర్గం పవన్‌కే జైకొడుతున్నది. కాపు సామాజికవర్గంలో చీలక తెచ్చేందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను సీఎం జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు. ఆయన వైసీపీలో చేరడంతోపాటు పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల కింద పెట్టాడంటూ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నాలు వైసీపీ చేస్తోంది. తాజాగా ప్రజాగళం సభల్లో పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఇచ్చిన గౌరవాన్ని చూసి జనసేన శ్రేణులు, పవన్‌కు మద్దతుగా ఉన్న కాపులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు అనుభవం ఉంది.. పవన్ కు పవర్ ఉంది అంటూ చంద్రబాబు కార్యకర్తల్లో జోష్ నింపారు. పవన్ మంచి నాయకుడు.. రాష్ట్రాన్ని మేమిద్దరం కలిసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు.. మేమిద్దరం కలిసే ఉన్నాం. క్షేత్ర స్థాయిలో జనసే, టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు ఇరు పార్టీలకు శ్రేణులకు సూచించారు. ఈ ప్రకటన జనసేన, తెలుగుదేశం శ్రేణుల్లో ఏమూలనైనా ఇంకా శంకలు మిగిలి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి.
దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలకు అర్థమైంది. దీంతో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని అనేక కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్ల వ్యవహారాన్ని జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చారు. వారిని ఎన్నికల్లో వాడుకొని మళ్లీ అధికారంలోకి రావాలని భావించారు. కానీ, కోడ్ పూర్తయ్యే వరకు ఎన్నికల విధులు, ప్రభుత్వ కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని జగన్.. ఇదంతా చంద్రబాబు, పవన్ కుట్ర.. వారు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారు.. తద్వారా మీకు ఇంటివద్దకు పెన్షన్ రాదు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారు. దీనికితోడు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చి వారితో వైసీపీ నేతలు రాజీనామాలు చేపిస్తున్నారు. జగన్ తప్పుడు ప్రచారాలకు, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ఆడుతున్న నాటకాలకు ప్రజాగళం సభల్లో చంద్రబాబు,పవన్ చెక్ పెట్టారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, కూటమి అధికారంలోకి రాగానే వారికి రూ. 10వేల వేతనం ఇస్తామని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు, పవన్ సూచించారు. వైసీపీ నేతలు చెప్పారని రాజీనామా చేస్తే మళ్లీ ఉద్యోగం రాదు.. అధికారంలోకి వచ్చేది కూటమి.. ఇప్పుడు రాజీనామా చేస్తే పోయేది మీ ఉద్యోగాలు. జగన్ అధికారంలోకి రావడానికి మీ ఉద్యోగాలను పోగొట్టుకోవద్దని, కూటమి అధికారంలోకి రాగానే మీకు అన్నివిధాల అండగా ఉండి.. మీకు మరింత మేలు జరిగేలా చూస్తామని చంద్రబాబు, పవన్ వాలంటీర్లకు హామీ ఇచ్చారు. దీంతో.. వాలంటీర్లతో రాజీనామాలు చేయించి చంద్రబాబు, పవన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని చూసిన వైసీపీ నేతల కుట్రలకు చెక్ పడినట్లయింది.
తణుకు, నిడదవోలు, పి. గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొన్న ప్రజాగళం సభలకు భారీ స్పందన లభించింది. కిలోమీటర్ల కొద్ది ఇసుకేస్తే రాలనంత రీతిలో ప్రజలు చంద్రబాబు, పవన్ పాల్గొన్న సభలకు హాజరయ్యారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజాదరణ కరువైంది. గతంలో జగన్ సభలకు భారీగా ప్రజలు తరలివచ్చేవారు.. కానీ, ఎన్నికల వేళ జగన్ కు ప్రజలు షాకిస్తున్నారు. కొందరు వైసీపీ కార్యకర్తలుసైతం జగన్ బస్సు యాత్రలో పాల్గొనకుండా ముఖం చాటేస్తున్నారు. దీంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైనుంచి గర్జన చేస్తుండటంతోపాటు.. ఇద్దరు నేతలు అన్నదమ్ముల్లా కలిసిపోయి ప్రచారంలో పాల్గొంటుండటంతో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో జోష్ ను నింపింది. భారీ మెజార్టీతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కూటమి పార్టీల శ్రేణులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ శిబిరం బెదిరిపోతోంది.