ఓ వైపు మండే ఎండలు.. మరో వైపు చిరు జల్లులు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. ఓ వైపు భానుడి ప్రతాపంతో ఎండ నిప్పులు చెరుగుతుంటే.. మరో వైపు చిరు జల్లులతో చిరు ఉపశమనం కలిగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో రెండ్రోజులపాటు నిప్పుల కొలిమిలా వాతావరణం ఉంటుందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో అత్యధికంగా 42.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, అనంతపురం, తాడిపత్రి, పొద్దుటూరు, పాణ్యంలో 42.70, ఒంటిమిట్ట, సూళ్లూరుపేట, గుంతకల్‌లో 42, కర్నూలు, మంత్రాలయం, నెల్లూరు, నంది కొట్కూరులో 41, ఎన్టీఆర్, పల్నాడు, సత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, ఏలూరు, ప.గోదావరి జిల్లాల్లో 37, శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాల్లో సోమవారం(ఏప్రిల్ 8) వడగాల్పులు వీచాయి. మంగళవారం (ఏప్రిల్ 9) ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలుతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.