విజయమ్మ విదేశాలకు.. జగన్ ఒత్తిడే కారణమా?
posted on Apr 12, 2024 @ 10:09AM
వైఎస్ విజయమ్మ.. అన్నా చెల్లెళ్ల రాజకీయ పోరులో ఆమె ఎవరి వైపు ఉంటారన్న ఆసక్తి, ఉత్కంఠకు తెరదించుతూ ఆమె విదేశాలకు వెళ్లిపోయారు. గత ఎన్నికల సమయంలో జగన్ విజయం కోసం వైఎస్ కుటుంబం అంతా ఏకతాటిపై నిలిచింది. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల విస్తృతంగా ప్రచారం చేసి మరీ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. వారి ప్రచారం ఫలించింది. ఆ ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనం హృదయాలను గెలుచుకున్నారు. అయితే గత ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తన విజయంలో కీలక పాత్ర పోషించిన షర్మిలను జగన్ పక్కన పెట్టేశారు. రాజకీయంగా ఆమె ఎదుగుదలకు బ్రేకులు వేశారు. దీంతో ఆమె అన్నతో విభేదించి తెలంగాణకు వలస వెళ్లిపోయారు. ఆమెతో పాటుగానే తల్లి విజయమ్మ కూడా తెలంగాణకు పరిమితమైపోయారు. వైఎస్సార్టీపీ పార్టీ పెట్టుకుని తెలంగాణలో తన రాజకీయం తాను చేసుకుంటున్న షర్మిలకు తోడుగా తల్లి కూడా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా కుమారుడికి దూరంగా జరిగారు. సరిగ్గా వైసీపీ ప్లీనరీ రోజునే అమ్మ (విజయమ్మ) కుమారుడి పార్టీకీ, పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాకూ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంటే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తల్లిని, చెల్లిని దూరం పెట్టారు.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి నేరుగా అన్న పాలనపైనే విమర్శలు సంధిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు జగన్ పైనా విమర్శల బాణాలను సంధిస్తున్నారు. దీంతో రాజకీయంగా అన్నా చెల్లెళ్లిద్దరూ పరస్పరం ఢీ కొంటున్న పురిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ విజయమ్మపైనే ఉంది. కుమారుడివైపా, కుమార్తె వైపా ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సరిగ్గా ఈ సమయంలో జగన్ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి మార్చి 27న ఆ సందర్భంగా యాత్ర ప్రారంభ కార్యక్రమానికి తల్లి విజయమ్మ హాజరయ్యారు. జగన్ ను ఆశీర్వదించారు. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది. ఎందుకంటే విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చాలా కాలం కిందటే రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ప్రకటించారు. వాస్తవానికి పార్టీ గౌరవాధ్యక్ష పదవి ఏమంత క్రియాశీల పదవి కాదు. అయినా విజయమ్మ ఆ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన కుమార్తె తెలంగాణలో తన భర్త పేరుమీదనే ఏర్పాటు చేసిన పార్టీ కోసం పని చేయడానికి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న రాజకీయ బంధం పుటుక్కుమని తెగిపోయినట్లే అప్పట్లో అంతా భావించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేశారు. పార్టీతో బంధం తెంచుకున్న తరువాత విజయమ్మ కూడా జగన్ తో ముభావంగానే ఉన్నారు. కుమార్తె తోడిదే లోకంగా సాగారు. ఆ మధ్యలో ఆమె ఏపీకి వచ్చినా జగన్ నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవు. షర్మిల కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు మాత్రమే షర్మిలతో కలిసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. అంతే. వాస్తవానికి తల్లి, చెల్లితో చాలా కాలంగా జగన్ కు ఎటువంటి సంబంధాలూ లేవు. ఇటు జగన్ కానీ, అటు విజయమ్మ, షర్మిల కానీ పరస్పరం ఎదురుపడిన దాఖలాలు లేవు. పలకరించుకున్న సందర్భమే లేదు. వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో జరిగే కార్యక్రమాలలో కూడా వీరు ఎడముఖం, పెడముఖంగానే మసిలారు. షర్మిల కుమారుడు, సొంత మేనల్లుడి వివాహానికి కూడా జగన్ రెడ్డి హాజరు కాలేదంటే ఇరువురి మధ్యా సంబంధాలు ఎంతగా బెడిశాయో అర్ధం చేసుకోవచ్చు. అయినా కూడా ఇప్పటి వరకూ ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడని తల్లి విజయమ్మ.. జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభ సమయానికి జగన్ పక్కన కనిపించడం రాజకీయవర్గాలలో విస్తృత చర్చకు దారి తీసింది. జగన్ వేడుకోవడం, లేదా ఒత్తిడి తేవడంతోనే విజయమ్మ ఆ కార్యక్రమానికి వచ్చి మొక్కుబడి తంతుగా ఆశీర్వదించి ఉంటారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఆ తరువాత షర్మిల తన ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంలోనూ విజయమ్మ కుమార్తెను ఆశీర్వదించారు. అయితే ఇరువురిలో ఆమె మద్దతు ఎవరికి అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో ఆమె ఎన్నికల సమయంలో దేశంలోనే ఉండకుండా విదేశాలకు వెళ్లిపోవడం సంచలనంగా మారింది.
అన్న పార్టీని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా షర్మిల జగన్ పైనా, జగన్ సర్కార్ పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిల స్వయంగా కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత షర్మిల జగన్ పైనా, ఆయన పాలనపైనా నిత్యం విరుచుకుపడుతున్నారు. ఆమె ప్రచారంలో కూడా జగన్ మరియు వైసీపీ కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన అవినాష్‌కు టికెట్ ఇవ్వడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయమ్మ విజయమ్మ ఎన్నికలు ముగిసే వరకూ దేశం విడిచి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ కు మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేకనే ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారని అంటున్నారు. షర్మిలకు తోడు విజయమ్మ కూడా తనకు వ్యతిరేకంగా గళం విప్పితే ఇబ్బందులు తప్పవన్న భయంతోనే జగన్ ఒత్తిడి చేసి ఆమెను విదేశీ పర్యటనకు వెళ్లేలా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.