పిఠాపురంలో చేతులెత్తేసిన వైసీపీ.. పవన్ కల్యాణ్ రూట్ క్లియర్!
posted on Apr 10, 2024 @ 3:33PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎత్తులు వేస్తున్నది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా ఆ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించింది. వైసీపీ అనుకూల సోషల్ మీడియా సంస్థలు పిఠాపురంలోనే తిష్ఠవేసి వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కు ప్రత్యర్థిగా కాకినాడ ఎంపీ వంగాగీతను బరిలోని దించిన జగన్ ఆమె విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతం గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాను స్వయంగా పోటీలో లేకపోయినా.. పవన్ కల్యాణ్ పై విమర్శలు, విసుర్లతో ఆయన చెలరేగిపోతున్నారు. కాపు సంఘాల సమావేశాలలో పాల్గొంటూ ఆయన వైసీపీ విజయం కోసం పని చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా వైసీపీ పిఠాపురాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఆ పార్టీ క్యాడర్ లో మాత్రం గెలుపు సాధిస్తామన్న నమ్మకం కానీ, విశ్వాసం కానీ కనిపించడం లేదు. వంగా గీత ప్రచారం నామ్ కే వాస్తేగా జరుగుతున్నది. ఆమె తన ప్రచారానికి కనీస వ్యయం చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో క్యాడర్ ఆమె తరఫున ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. ఇక జగన్ ఓటమే ధ్యేయం అంటూ అధినేత ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన మిథున్ రెడ్డి మొదట్లో కొద్దిగా హడావుడి చేసినా ఇప్పుుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు. సొంత నియోజకవర్గం రాజంపేటలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయన పిఠాపురాన్ని గాలికి వదిలేసి తన విజయం కోసం రాజంపేటలోనే పని చేసుకుంటున్నారు.
దీంతో సమన్వయం లేకుండా పిఠాపురంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వంగాగీతకు పార్టీ టికెట్ కేటాయించడంతో అక్కడి సిట్టింగ్ ఎం్మెల్యే పందెం దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ స్వయంగా ఆయనను తాడేపల్లికి పిలిపించుకుని మరీ బుజ్జగించినా ఫలితం లేకపోయింది. మరో వైపు దొరబాబు అనుచరగణం అంతా జనసేన తరఫున సీరియస్ గా పని చేస్తున్నారు. స్వయంగా దొరబాబే వారిని జనసేనకు మద్దుతుగా నిలవమని ఆదేశించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. త్వరలో ఆయన కూడా జనసేన గూటికి చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇక జనసేన పిఠాపురం ఇన్ చార్జ్ మకినీడి శేషు కుమారి వైసీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది. గత ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన ఆమెకు 28 వేల ఓట్లు వచ్చాయి. అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత శేషు కుమారి ఎన్నడూ పార్టీ కార్యక్రమాల్లో కానీ, రాజకీయంగా కానీ క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. ఇటీవల వైసీపీ గూటికి చేరిన తరువాత ఆమె పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. మొత్తం మీద దిశ, దశ లేని ప్రచార వ్యూహాలతో, సమన్వయ లోపంతో పిఠాపురంలో వైసీపీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కు రూట్ క్లియర్ అయిపోయినట్లేనని అంటున్నారు.