జగన్నాటకం గుట్టువిప్పిన చంద్రబాబు
రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తుండాలి. ప్రత్యర్థుల వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఆ మేరకు పావులు కదపాలి. ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయ జూదంలో అడుగున పడిపోయినట్లే.. ఒక్కోసారి పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం, ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం అధినేతలు గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా చంద్రబాబు, తెలుగుదేశం నేతలు జాగ్రత్త పడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను పసిగట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ప్రజాదరణ కలిగిన చంద్రబాబును ఎదుర్కోవాలంటే నేరుగా ప్రజల వద్దకు వెళ్తే సాధ్యం కాదని గుర్తించిన జగన్ సానుభూతి అస్త్రాన్ని ఏపీ ప్రజలపై ప్రయోగించి అధికారంలోకి వచ్చారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే వివేకానంద రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకొని జగన్ లబ్ధిపొందారు. వివేకాను హత్యచేసింది చంద్రబాబు వర్గీయులేనని ప్రజలను నమ్మించడంలో జగన్, ఆయన వర్గీయులు సఫలమయ్యారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత వివేకా హత్యకు కారణం వైసీపీ నేతలేనని తేలింది. మోసపోయామని ప్రజలు తెలుసుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఐదేళ్ల కాలంలో ఏపీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు జగన్ పాలనతో సంతోషంగా లేరు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలు సంస్థల సర్వేలు కూడా వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి ఢోకాలేదని సర్వేల ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అయితే క్రిమినల్ మైండ్ కలిగిన జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి పోలింగ్ రోజు వరకు ఏ చిన్న అవకాశం దొరికినా సానుభూతితో ప్రజల మనస్సులను మార్చేయగల సత్తా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి అవకాశాలు వైసీపీకి ఇవ్వకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో అరాచకాలు, వివేకానంద రెడ్డి హత్యకేసు వ్యవహారంపై చంద్రబాబు ఫోకస్ పెట్టి బహిరంగ సభల్లో ప్రస్తావిస్తున్నారు. అయితే గతంలో ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకుంటున్న చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలతో సానుభూతి ఏ విధంగా పొందాలని చూస్తారో ప్రజలకు వివరిస్తున్నారు. తద్వారా, గత ఎన్నికల్లోలా జగన్ సానుభూతి మాయలో ప్రజలు పడిపోకుండా చంద్రబాబు ముందస్తుగానే వారిని సన్నద్ధం చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం గుట్టును రట్టు చేశారు.
వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన నిందితుడు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సునీతారెడ్డిలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అవినాశ్ రెడ్డి వివేకా హత్యకేసులో హంతకుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. అరెస్టు కాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా జగనన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దని షర్మిల, సునీతారెడ్డిలు ప్రజలను కోరుతున్నారు. అంతేకాక షర్మిల కడప ఎంపీగా అవినాశ్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలు తాజా ఎన్నికల్లో కూటమికి కలిసొస్తాయని అందరూ భావిస్తున్నారు. కానీ, కూటమి అభ్యర్థులకు వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు జగన్, షర్మిల నాటకం ఆడుతున్నారని చంద్రబాబు ప్రజలకు వివరించారు. వారి మాయలో పడి మరోసారి మోసపోవద్దని, కూటమి అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు సక్రమంగా సద్వినియోగం అయ్యి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ప్రజలకు చంద్రబాబు వివరించారు.
ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం జగన్, షర్మిలు ఆడుతున్న నాటకాన్ని, అందుకు దివంగత వైఎస్ సతీమణి విజయమ్మ సహకరిస్తున్న తీరును చంద్రబాబు విమర్శించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని, కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పారు. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు. రాష్ట్రానికి ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోంది.. ఆడ పిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలి.. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చాలని వాళ్లు నాటకం ఆడుతున్నారంటూ అన్నాచెల్లెళ్ల గట్టును చంద్రబాబు ప్రజలకు వివరించారు. కూటమి పార్టీల శ్రేణులు ఈ విషయంపై పోలింగ్ సమయం నాటికి ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకివెళ్తే ఆ ప్రభావం కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.