డీఎల్ ఓపెన్ అయిపోయారు.. కూటమికే జై కొట్టారు!
posted on Apr 10, 2024 @ 12:20PM
డీఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. వైఎస్ రాజశేఖరరెడ్డికి సమకాలీనుడైన డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. కడప జిల్లాకు చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. వైఎస్సార్ తో విభేదాలున్నా కడప జిల్లాలో ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించారు.
ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న గుర్తింపు ఉన్న డీఎల్ రాయల సీమ సమస్యలపై గట్టిగా నిలబడి పోరాడిన వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. వైఎస్ మరణం తరువాత జగన్ ను ఎదుర్కొనే విషయంలో రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీఎల్ పైనే అధారపడింది. రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న డీఎల్.. రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఆయన అప్పట్లో వైఎస్ జగన్ ను కలిశారు. అంతకు ముందు జగన్ దూతగా సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన వైసీపీ గూటికి చేరారు.
అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన ఆ పార్టీకి దూరం జరిగారు. అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయకపోయినా పార్టలో క్రియాశీలంగా లేరు. జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేస్తూ వచ్చారు. సామాజికవర్గ కోణంలో తనపై ఒత్తిడి తెచ్చి వైసీపీలో చేరేలా ప్రోత్సహించారనీ, కానీ తాను వైసీపీలో చేరి ఎంత తప్పు చేశానో తరువాత కానీ అర్ధం కాలేదంటూ డీఎల్ రవీంద్రారెడ్డి ఆ తరువాత పలు సందర్భాలలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయనీ, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందనీ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదనీ చెబుతూ పరోక్షంగా సజ్జలపైనా విమర్శలు గుప్పించారు.
అయితే ఆ తరువాత కారణాలేమైనా సైలెంట్ అయిపోయారు. అయినా మైదుకూరు నియోజకవర్గంలో ఆయన పట్టు ఇసుమంతైనా సడలలేదనే చెప్పాలి. అదును చూసి దెబ్బకొట్టిన చందంగా ఇంత కాలం వైసీపీకే కాదు, అసలు రాజకీయాలకే దూరంగా ఉన్న రవీంద్రారెడ్డి సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు బయటకు వచ్చి తాను తెలుగుదేశం కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎలా చూసుకున్నా ఇది ఇప్పటికే అంతంత మాత్రం గెలుపు అవకాశాలతో ఎదురీదుతున్న వైసీపీకి గట్టి షాక్ అనడంలో సందేహం లేదు. ఆయన మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ప్రకటించి ఊరుకోకుండా రాష్ట్రంలో రాబోయే సర్కార్ తెలుగుదేశం కూటమిదేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అలాగే కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డిని గెలిపించాలా? వైఎస్ బిడ్డ షర్మిలను గెలిపించాలా అన్నది నిర్ణయించుకోవలసింది ప్రజలేనన్న డీఎల్ రవీంద్రారెడ్డి.. ఆ నిర్ణయం తీసుకునేముందు మాత్రం వివేకం సినిమా చూడాలని అన్నారు. ఆన్ లైన్ లో విడుదలై సంచలనం సృష్టిస్తున్న వివేకం సినిమాలో వైఎస్ హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని నేరస్థుడిగా చూపారు. ఆ సినిమా చూసి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండంటూ పిలుపు నివ్వడం ద్వారా డీఎల్.. అవినాష్ ను గెలిపించవద్దని ప్రజలకు పరోక్షంగా సూచించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.