చల్లబడిన వాతావరణం.. జనాలకు ఉపశమనం!
posted on Apr 12, 2024 9:14AM
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత పక్షం రోజులుగా భుగభగలాడుతున్న భానుడు శాంతించాడు. భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వడగాడ్పుల తీవ్రత తగ్గి చల్లటి గాలులు వీస్తుండటంతో జనం శ్వాంతన పొందారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి.
ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఉక్కపోత.. ఇంకో వైపు వడగాడ్పుల ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు గత మూడు రోజులుగా వాతావరణం చల్లడటంతో ఉపశమనం కలిగింది. శుక్ర(ఏప్రిల్ 12), శని (ఏప్రిల్ 13) తేదీలలో కూడా వాతావరణం చల్లగానే ఉంటుందనీ, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ చల్లటి తొలకరిలాంటి కబురు చెప్పింది.
గురువారం (ఏప్రిల్ 11) నల్లగొండలో 39 డిగ్రీలు ఆదిలాబాద్ 20.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 9.6 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. రానున్న రెండు రోజులూ కూడా వాతావరణం చల్లగానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటం, మరోవైపు మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణశాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.