ప్రత్యర్థికి డిఎల్ రవీంద్రారెడ్డి మద్దత్తు .. అధికారంలో వచ్చేది ఎన్డీఏ కూటమి అని జోస్యం
posted on Apr 10, 2024 @ 12:38PM
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎపిలో రాజకీయ సమీకరణాలు చక చకా మారిపోతున్నాయి.ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నాయకులు తమ గళం విప్పుతున్నారు. కడపజిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఆ జిల్లా నుంచి చాలామంది నేతలు ఉమ్మడి రాష్ల్రంలో చక్రం తిప్పిన వారే . దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి కీలక నేతగా పని చేశారు. వైఎస్ ఆర్ మరణం తర్వాత చాలామంది నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ముక్కుసూటి తనం ఆయన సొంతం. ఏది మనసులో దాచుకోరు....ఏది అనిపిస్తే అది అనేయడం ఆయన స్టైల్. కేబినేట్ లో ఉండి ముఖ్యమంత్రిని తిట్టిన ఘనుడు బహుశా ఆయనే కావచ్చు..సీఎంపై విమర్శలు చేసి చేసి చివరకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి 2014 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో స్థబ్ధుగా ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
గతంలో టీడీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిది. కానీ డీఎల్ ఎటు వెళ్లలేదు.2014 ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చెయ్యలేదు. కానీ మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ తో వచ్చిన విభేధాలతో డీఎల్ రవీంద్రారెడ్డి స్తబ్ధుగా ఉన్నారు. వాస్తవంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్త బహీనంగా ఉంది. ఉన్న కొద్దిమంది నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పార్టీలోని సమస్యలను చక్కదిద్దుతూనే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని మాజీ సీఎం చంద్రబాబు అన్వేషణలో పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఇలాకాలో ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అనూహ్యంగా డిఎల్ తెలుగుదేశం పార్టీకి మద్దత్తు వహించడం చంద్రబాబుకు ప్లస్ అయ్యింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలోని విభేధాలను పక్కనపెట్టి గెలుపుగుర్రాలపై చంద్రబాబు నాయుడు కాన్ సన్ ట్రేట్ చేయాలని దేశం శ్రేణులకు పిలుపునిస్తున్నారు. కడపలో వైసీపీకి గండికొట్టాలంటే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటించిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు.
భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం....ఆ తర్వాత జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో ఆ సమయంలోనే డీఎల్ సైకిలెక్కుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కూడా డీఎల్ మౌనంగానే ఉండిపోయారు.
ఇకపోతే తెలుగుదేశం పార్టీ తనకు టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతనే డీఎల్ ఎటూ తేల్చుకోలేకపోయారని టాక్. ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎల్ అదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించారు.. అయితే టీడీపీ మాత్రం మైదుకూరు నియోజకవర్గం పుట్టా సుధాకర్ యాదవ్ కు కేటాయించింది. ఈ నిర్ణయం డీఎల్ కు రుచించలేదని సమాచారం.
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీఎల్ రవీంద్రారెడ్డితో తరచూ చర్చలు జరిపారు. 2019లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన డిఎల్ కొంతకాలంగా స్థబ్దుగా ఉంటున్నారు. డీఎల్ రాజకీయంగా సీనియర్ నేత కావడం వల్ల ఆయన మద్దతిచ్చే అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది.
‘వివేకం’ సినిమా చూశాక ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. తాను వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని బాహాటంగానే చెబుతున్నారు.
మంగళవారం వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని తన నివాసంలో డిఎల్ విలేకర్లతో ముచ్చటించారు. వివేకం సినిమా చూసి ఓటేయాలని తన వద్దకు వచ్చిన వారికి చెబుతున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాబు పద్ధతి గల నాయకుడని, ప్రజలకు ఆయన మాత్రమే మేలు చేస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. ‘‘మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి ఓటు వేయొద్దు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కే నా మద్దతు’’ అని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఎల్ టిడిపి మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ కు మద్దతునిస్తూ కడప వైఎస్ ఆర్ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిని ఓడించాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.