కవిత అమాయకురాలు కాదు! మధ్యంతర బెయిలు తోసిపుచ్చుతూ న్యాయమూర్తి వ్యాఖ్య
posted on Apr 10, 2024 @ 11:44AM
కల్వకుంట్ల కవితకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత.. రెగ్యులర్ బెయిలు ఇప్పట్లో లభించే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చిన తరువాత మధ్యంతర బెయిలు కోసం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు స్పెషల్ జడ్జికి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో తన అమాయకత్వాన్ని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. తల్లిగా కుమారుడికి పరీక్షల సమయంలో తన అవసరం ఉందని సెంటిమెంట్ అస్త్రాన్నీ ప్రయోగించారు. అయితే అవేమీ ఆమెకు ఊరటనివ్వలేదు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత ఇప్పుడు తీహార్ జైలులో ఉన్నారు. ఆమె మధ్యంతర బెయిలు పిటిషన్ ను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. అలాగే ఆమె రిమాండ్ గడువును కూడా పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు ఆర్థికంగా పూచిక పుల్ల ఎత్తు ఆర్థిక లబ్ధి జరగలేదని పేర్కొంటూ కోర్టు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరీ భవేజాకు లేఖ రాశారు. చేతి రాతలో ఉన్న ఆ నాలుగు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో కవిత తాను నిర్దోషిననీ, మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదనీ పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కేసు విచారణ సందర్భంగా మనీ ట్రయల్ లేదు, అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవు అని పేర్కొంటూ ఇది నిలిచే కేసు కాదని వ్యాఖ్యానించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ గత రెండున్నరేళ్లుగా ఈ కేసు విషయంలో వేధించి చివరకు అరెస్టు చేశారని ఆ లేఖలో కవిత ఆరోపించారు. కేవలం స్టేట్ మెంట్ల ఆధారంగా తనను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు అంతం లేని కథలా సాగుతోందని ఆరోపించారు. ఈ కేసులో తాను బాధితురాలినని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. చివరాఖరికి తన మెబైల్ ఫోన్ నంబర్ కూడా మీడియా ప్రసారాలలో వెల్లడించేశారనీ, ఇది తన వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కాదా అని ఆ లేఖలో కవిత ప్రశ్నించారు. తాను ఈడీ, సీబీఐ అధికారులకు దర్యాప్తులో పూర్తిగా సహకరించానని పేర్కొన్నారు. తన బ్యాంకు లావాదేవీలు, వ్యాపార వివరాలు అన్నీ వారికి అందించినట్లు పేర్కొన్న కవిత.. తాను తన ఫోన్లను ధ్వంసం చేశాననీ, ఆధారాలను నాశనం చేశాననీ ఆ దర్యాప్తు సంస్థలు నిరాధారంగా తనపై నిందలు మోపాయని ఆరోపించారు.
నిజంగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్లైతే తెలంగాణలో తమ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఎందుకు అరెస్టు చేయాలేంటూ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు కేంద్ర దర్యాప్తు సంస్థల్లా కాకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లా పని చేస్తున్నాయనీ, అవి దర్యాప్తు చేస్తున్న కేసులలో 95శాతం పైన కేసులన్నీ దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఉన్నవేననీ కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆమె లేఖ సంగతి పక్కన పెడితే.. ఆమె లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశానికీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ జవేజా కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ వెలువరించిన 21 పేజీల ఉత్తర్వుల్లో సమాధానాలు ఇచ్చేశారు. ఉన్నత విద్యావంతురాలైన కవిత.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె ప్రమేయం లేకుండానే అమాయకంగా ఇరుక్కున్నారని విశ్వసించలేమని పేర్కొన్నారు. దేశ, విదేశాలలో ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతురాలు. భారత్ జాగృతి సంస్థకి అధ్యక్షురాలుగా మహిళలను చైతన్యపరిచిన కవిత ఒక ఎంపీగా పార్లమెంటులో పలు స్టాండింగ్ కమిటీలలో పని చేశారనీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనీ, కనుక ఆమెను అబల, అమాయకురాలు అని ఎలా అనుకుంటామని న్యాయమూర్తి ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అందుకే మద్యం కుంభకోణం కేసులో ఆమెను ఎవరో ఇరికించారని భావించజాలమన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిందనీ, విచారణకు ఆమె సహకరించలేదని ఈడీ ఆధారాలు సమర్పించిందనీ పేర్కొన్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలుగా భావిస్తున్న ఆమె మొబైల్ ఫోన్లను ఈడీకి స్వాధీనం చేసేటప్పుడు దానిలో డేటాని ఆమె తొలగించిన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుస్తోందని పేర్కొన్న న్యాయమూర్తి కవితకు మధ్యంతర బెయిలు మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. అంతకు ముందు న్యాయమూర్తితో తాను స్వయంగా మాట్లాడతానని కవిత చేసుకున్న అభ్యర్థనను కూడా తిరస్కరించారు.