జగన్ రెడ్డి ఐదేళ్ల రివర్స్ పాలన.. వైసీపీకి 2019 ఫలితాలు రివర్స్!
posted on Apr 10, 2024 @ 5:40PM
ఐదేళ్ల జగన్ రెడ్డి రివర్స్ పాలనక సరైన ఫలితం దక్కనుంది. ఆ పార్టీకి గత ఎన్నికలలో వచ్చిన ఫలితాలు ఈ సారి ఎన్నికలలో రివర్స్ కానున్నాయి. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ వెలువరించిన సర్వే ఇదే చెప్పింది. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆ పార్టీ 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించింది. ఆ సందర్భంగా జగన్ ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సరే ఐదేళ్లు గిర్రున తిరిగిన తరువాత దేవుడు నాలుక కరుచుకుని తన స్క్రిప్ట్ ను కరెక్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోరాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలు ఈ సారి రివర్స్ కానున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు అన్ని అ సర్వేలూ తెలుగుదేశం కూటమికి భారీ విజయం ఖాయమనే పేర్కొన్నాయి. ప్రతిస్ఠాత్మక సంస్థలు వెలువరించిన సర్వేలలోనూ ఇదే ఫలితం వచ్చింది. ఇండియా టుడే వంటి సంస్థలైతే రెండు మూడు నెలల కిందట వెలువరించిన సర్వేలో వైసీపీ రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో 24 స్థానాలను కైవశం చేసుకుంటుందని పేర్కొంది. అప్పట్లోనే ఆ సర్వే ఫ్యాబ్రికేటెడ్ అని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రెండు మూడు నెలల వ్యవధిలోనే ఇండియా టుడే ప్లేట్ ఫిరాయించేసింది.
తాజాగా వెలువరించిన సర్వేలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి 17 స్థానాలలో విజయం సాధిస్తుందనీ, అధికార వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుందని పేర్కొంది. సరే ఎంతగా సమర్ధిద్దామని ప్రయత్నించినా వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో తన క్రెడిబులిటీని దెబ్బతీసుకోవడానికి ధైర్యం చేయలేక ఇండియా టుడే వాస్తవాలకు దగ్గరగా తన సర్వే ఫలితాన్ని తాజా పరిస్థితి ఇదంటూ సవరించుకుందని చెప్పుకోవచ్చు.
అది పక్కన పెడితే ఏపీలో రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికే జనం పట్టం కట్టడానికి ఫిక్స్ అయిపోయారని ఇప్పటి వరకూ వెలువడిన అన్ని సర్వేలూ తేల్చి చేప్పేశాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ వెలువరించిన సర్వేలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి 19 నుంచి 23 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది. ప్రముఖ సర్వే సంస్థ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వెల్లడించింది. నిజానికి అనేక జాతీయ సర్వే సంస్థలు, జాతీయ మీడి యా సంస్థలు ఎన్డీఏ కూటమి 18 సీట్లు సాధించటం పక్కా అని గత నెలలోనే ప్రకటించాయి. ఇప్పుడు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ తన తాజా సర్వేలో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సంఖ్య సరిగ్గా గత ఎన్నికలలో వైసీపీ సాధించిన లోక్ సభ స్థానాల సంఖ్య. అందుకే పరిశీలకులు వైసీపీకి ఈ సారి సీన్ రివర్స్ అవుతోందని విశ్లేషిస్తున్నాయి. రాజకీయవర్గాలలో అయితే ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటూ సెటైర్లు పేలుతున్నాయి.
వచ్చే ఎన్నికలలో వైసీపీ 2 నుంచి 3 లోక్ సభ స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే పేర్కొంది. యాక్చువల్గా ఆ సర్వే తెలుగుదేశం కూటమికి 19 నుంచి 23, వైసీపీ కూటమికి 2 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికలలో కూడా దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అంటే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమికి 133 నుంచి 151 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించే అవకాశాలుండగా, వైసీపీ 14 నుంచి 42 స్థానాలు లభించే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయవిహారం చేస్తుందని జాతీయ సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. కొన్ని సంస్థలు ఎన్డీఏకూటమి 135 సీట్లు సాధిస్తుందని వెల్లడించగా, మరికొన్ని 150 సీట్ల వరకూ సాధిస్తుందని పేర్కొన్నాయి. కూటమి ఏర్పడక ముందు.. తెలుగుదేశం ఒంటరిగా 100 సీట్లు సాధిస్తుందని పలు సర్వేలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేఅదే విషయం తెలిపింది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువరించిన ఫలితాలు దాదాపుగా నిజమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 59-67, బీఆర్‌ఎస్ 36-44, బీజేపీ 7-9, ఇతరులు 6-8 సీట్లు సాధిస్తాయని వెల్లడించగా, ఎన్నికల ఫలితాలు దాదాపు అలాగే వచ్చాయి. దీంతో ఇప్పుడు ఏపీలో ఈ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు నిజమవడం ఖాయమని విశ్లేషకులు నమ్ముతున్నారు. వైసీపీకి 2019లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు రివర్స్ అవుతాయనీ, జగన్ రెడ్డి రివర్స్ పాలనకు అదే సరైన రివర్స్ ఫలితంగా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.