పశ్చిమ గోదావరిలో 2014 సీన్ రిపీట్!
posted on Apr 10, 2024 @ 2:47PM
గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం కూటమి హవా నడుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో గత ఎన్నికలలో దుమ్మురేపిన వైసీపీకి ఈ సారి అంత సీన్ కనిపించడం లేదని అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గోదావరి జిల్లాల్లో 2014 నాటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసేందుకే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు.
2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికలలో వైసీపీ జిల్లాలో బోణీ కొట్టలేదు. ఆ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను తెలుగుదేశం పద్నాలుగు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేల ఫలితాలను తీసుకున్నా.. తెలుగుదేశం అంతర్గత సర్వేల ఫలితాలను బట్టి చూసినా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 నియోజవకర్గాలలో తెలుగుదేశం కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది.
అదే సమయంలో జిల్లా మొత్తంలో అటువంటి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వైసీపీకి లేదని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ ఏదో ఒక మేరకు బలంగా ఉందని చెప్పడానికి జిల్లా మొత్తంలో పోలవరం నియోజకవర్గం మాత్రమే కనిపిస్తోందంటున్నారు. ఆచంట, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, ఉండి, దెందులూరు, ఏలూరు స్థానాల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యత కనబరుస్తోందని చెబుతున్నారు. ఈ తొమ్మిది స్థానాలలోనూ తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న భీమవరం, నిడదవోలులో ఆ పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక గోపాలపురం, ఉంగుటూరు, చింతలపూడి నియోజకవర్గాలలో పోటాపోటీ పరిస్థితి ఉన్నప్పటికీ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం కూటమి వైపే అని చెబుతున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ గతంలో కంటే బాగా పుంజుకోవడంతో జిల్లాలో వైసీపీకి గెలుపు అవకాశాలు దాదాపు మృగ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంటే పశ్చిమలో 2014 నాటి సీన్ రిపీట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.