ఏపీలో కాంగి‘రేసు’.. పలు నియోజకవర్గాల్లో మూడో స్థానంలోకి వైసీపీ?
posted on Apr 10, 2024 @ 2:18PM
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ వైసీపీ ఓటు బ్యాంకుకు భారీగా గండి పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు వెలువడటం మొదలైన తరువాత ఆ విశ్లేషణలు అక్షరసత్యాలని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు మొత్తం వైసీపీకి వెళ్లి పోయింది. ఈ పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి మాత్రంగా మిగిలిపోవడానికి అదే ప్రధాన కారణం. అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత ఆ ఓటు అంతా మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లి పోతుందంటూ విశ్లేషణలు వెలువడ్డాయి.
షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో ఆ పార్టీలో ఆ జోష్ కనిపించినా ఆ తరువాత ఆ ప్రభావం పెద్దగా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అనుకున్న స్థాయిలో వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు లేకపోవడం కూడా అందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా షర్మిల నేరుగా జనగ్ ను ఉద్దేశించి, పేరు పెట్టి మరీ విమర్శలు చేయడంతో వైసీపీలో గుబులు మొదలైంది. ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తరువాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఆమె ప్రజెన్స్ ఒక్క కడప లోక్ సభ నియోజకవర్గాన్ని, కడప జిల్లానే కాదు మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, మాజీ మంత్రి శమంతకమణి వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీకి ఆయా జిల్లాలలో, ప్రాంతాలలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా వీరు వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ నుంచి తమ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి పార్టీకి బదలాయించుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతోందన్న సంకేతాలను పంపించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా వ్యూహాత్మకంగా, వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. కీలకమైన నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా సంప్రదాయ ఓటు బ్యాంకు మళ్లీ పార్టీకి చేరువకావడానికి ఢోకా లేని పరిస్థితులు ఆయా నియోజకవర్గాలలో నెలకొన్నాయి. కడప లోక్ సభ నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయగా షర్మిల నిలబడటంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడి హంతకుడికి పార్టీ టికెట్ ఇచ్చిన సీఎం జగన్ వైఎస్సార్ వారసుడెలా అవుతారంటూ షర్మిల సూటిగా సంధిస్తున్న ప్రశ్న కడప వాసులను కదిలిస్తోంది. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ ఖరారై ఆమె ప్రచారం ప్రారంభించిన తరువాత నుంచీ స్థానికంగా వెలువడిన పలు సర్వేలు అక్కడ షర్మిల దూసుకుపోతున్నట్లు తేల్చేశాయి. ఆమెకు దాదాపు 50శాతం మంది జనం మద్దతుగా నిలుస్తున్నారంటూ అంచనాలు వెలువడ్డాయి.
అలాగే తిరుపతి నుంచి చింతా మోహన్, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ నుంచి మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు వంటి అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఆయా లోక్ సభ నియోజకవర్గాలలోనే కాకుండా ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ బలంగా పుంజుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా కాంగ్రెస్ అత్యంత వ్యూహాత్మకంగా వైసీపీ అవకాశాలను గండి కొట్టిందని అంటున్నారు. గతంలో వైపీపీ అభ్యర్థిగా పూతలపట్టు నుంచి విజయం సాధించిన ఎంఎస్ బాబుకు అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం ద్వారా.. ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఆశలను కాంగ్రెస్ ఆవిరి చేసేసింొదని అంటున్నారు. వైఎసీపీ పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబును కాదని సునీల్‌కుమార్‌ను బరిలోకి దించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకూ రెండు జాబితాలను విడుదల చేసింది. రానున్న రోజులలో మిగిలిన నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయనుంది. మొత్తం మీద కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం అంటే వైసీపీ బలహీనం కావడమేనన్న పరిశీలకుల విశ్లేషణలకు అనుగుణంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ బలంగా పుంజుకున్న పలు నియోజకవర్గాలలో ప్రధాన పోటీ తెలుగుదేశం కూటమి, కాంగ్రెస్ మధ్యే అన్నట్లుగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ కాంగ్రెస్ కారణంగా భారీగా నష్టపోవడం ఖాయమని అంటున్నారు.