నిప్పుల కుంపటిలా ఎపి

ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. చాలావరకు జిల్లాల్లో నిన్న 42 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలివారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. నిప్పుల కుంపటిలా ఏపీ వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటినుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. నిన్న ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలలోని 31 మండలాలలో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. నేడు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. అలాగే, ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు దాటే వరకు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేసింది.

కూటమి అభ్యర్థుల విజయం కోసం ద్వారకా తిరుమలలో పురంధేశ్వరి ప్రత్యేక పూజలు

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన ఎన్నికల ప్రచారాన్ని ద్వారకా తిరుమల శుక్రవారం (ఏప్రిల్ 5)  ప్రారంభించారు. అంతకు ముందు ఆమె ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వెంకన్నదేవునికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆమె తెలిపారు. రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న పురంధేశ్వరి తన ప్రచారానికి ద్వారకా తిరుమల నుంచే శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ అభ్యర్థులనే కాకుండా రాష్ట్రంలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు.   కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో మార్పును ప్రజలందరూ కోరుకోవాలని పిలుపునిచ్చారు అలాగే దేవస్థానం సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగించకుండా కేవలం భక్తుల సౌకర్యార్థం వారిని ఆలయాలకే పరిమితం చేయాలని ఎన్నికల కమిషన్ ని ఈ సందర్భంగా కోరుతున్నట్లు ఆమె తెలిపారు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆలయమర్యాదలతో స్వాగతంపలికారు.  

కేసీఆర్ పొలంబాట.. రైతుల స్పందన ఏదంట?

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలంబాట కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరవైంది. కరీంనగర్ జిల్లా ముగ్ధుంపూర్ లో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు. భారీ కాన్వాయ్ తో ఆయన చేపట్టిన పొలంబాటకు రైతులు, ప్రజల నుంచి ఇసుమంతైనా స్పందన కానరాలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ఆయన బయటకు వస్తే చాలు జనం పోటెత్తేవారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో  స్వాగత ఏర్పాట్లు చేసే వారు. అయితే ఇప్పుడు అలాంటి హడావుడి ఏ మాత్రం కనిపించలేదు.  తెలంగాణ సాధకుడు, ఉద్యమ నాయకుడు, దశాబ్దం పాటు సీఎంగా రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నేత వస్తున్నాడన్న ఆసక్తి కూడా ప్రజలలో కనిపించలేదు.  బీఆర్ఎస్ నేతల హంగామా తప్ప స్థానికులు, రైతులు కేసీఆర్ పొలంబాట కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఆయన పొలాల వద్దకు వెళ్లే సరికి అక్కడ రైతులు కూడా చాలా స్వల్ప సంఖ్యలోనే ఉండటంతో కేసీఆర్ కూడా   ఎండిన పొలాల పరిశీలన కార్యక్రమాన్ని మమ అనిపించేశారు.   

కవితకు బిగ్ షాక్.. మద్యం కేసులో విచారించేందుకు సీబీఐ రెడీ!

మద్యం కుంభకోణం కేసులో కవితకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో కవితను విచారించేందుకు రెడీ అయ్యింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. అయితే, ఆమె మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆమెకు మధ్యంతర బెయిలు ఇవ్వవద్దుంటూ ఈడీ గట్టిగా వాదించింది. కవితకు బెయిలు ఇస్తే  ఆధారాలు ధ్వంసం చేసే అవకాశాలున్నాయనీ, అలాగే  సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈడీ కోర్టుకు తెలిపింది. అదలా ఉంటే ఇప్పుడు ఇదే కేసులో కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించడంతో కవిత మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. కవితను విచారించడానికి అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్ పై కోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

కడప కోటలో తెలుగుదేశం పాగా?

కడప రాజకీయాలపై వైఎస్ కుటుంబం ముద్ర బలంగా ఉంది. అందుకే  వైసీపీ ఆవిర్భావం నుంచీ కడప ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. అంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటే నడిచిన జిల్లా ఆయన తరువాత జగన్ వెంట నడుస్తూ వస్తోంది. వైఎస్ మరణం వరకూ కడప జిల్లా మొత్తం వైఎస్ వెనుకే నిలబడిందని చెప్పవచ్చు. ఆయన మరణం తరువాత అంతటి మద్దతు జిల్లాలో వైసీపీకి లభించింది. ఇందుకు జగన్ వైఎస్ రాజకీయవారసుడిగా కడప జిల్లా వాసులు భావించడమే కారణం. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క రాజం పేట స్థానం నుంచే విజయం సాధించింది.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఆ ఒక్క స్థానం కూడా దక్కలేదు. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరి 2024 ఎన్నికలలో పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నకు 2019 ఎన్నికల కంటే తెలుగుదేశం బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా జిల్లాపై పట్టు మాత్రం వైసీపీదేనని పరిశీలకులు అంటున్నారు. కడప మినహా మిగిలిన రాయలసీమ జిల్లాలన్నిటిలో తెలుగుదేశం గట్టిగా పుంజుకుంటే కడప జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించదు. గత ఎన్నికలలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించడంలో విఫలమైన తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో ఒకటి రెండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పదగ్గ నియోజకవర్గం ఒక్క మైదుకూరు మాత్రమేనని సర్వేలు చెబుతున్నాయి. అలాగే రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  అయితే  కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుండటంతో జిల్లాలో వైసీపీ ఏదో ఒక మేరకు నష్టపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగడంతో రాష్ట్రంలోనే ఈ సీటు హాట్ సీట్ గా మారిపోయింది. జగన్ కు స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకా హత్య విషయంలో వివేకా కుమార్తె సునీత, జగన్ కు సొంత చెల్లెలు అయిన షర్మిలను ముక్తకంఠంతో అవినాష్ దోషి అని ఆరోపిస్తూ, అటువంటి వ్యక్తికి జగన్ అండగా నిలబడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయ్ ను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులకు వత్తాసుగా నిలబడిన జగన్ కు, ఆయన పార్టీకీ ఓట్లు వేయవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా షర్మిలే అవినాష్ కు ప్రత్యర్థిగా కడప బరిలో దిగడంతో.. ఆమె వైసీపీ ఓట్లను ఏ మేరకు చీల్చుతారన్నదానిపై కడప లోక్ సభ నియోజకవర్గ ఫలితం ఆధారపడి ఉంటుంది.  మొత్తం మీద గత ఎన్నికలలో లా జీరో స్థానంతో సరిపెట్టుకోవడం కాకుండా తెలుగుదేశం బలంగా పుంజుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.  

వైసీపీ కంచుకోటకు బీటలు.. నెల్లూరులో వైసీపీ ఫినిష్షేనా?

నెల్లూరు జిల్లా వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి కంచుకోట. అంతకు ముందు ఆ జిల్లా కాంగ్రెస్ కు పెట్టని కోట. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఆదరణ కనిపించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఏడు స్థానాలలో విజయం సాధించింది. మిగిలిన మూడు స్థానాలనూ తెలుగుదేశం గెలుచుకుంది. అంటే తెలుగుదేశంకు సానుకూలంగా ఉన్న సమయంలో కూడా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం హవా పెద్దగా కనిపించలేదు. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికలలో వైసీపీ జిల్లాలో పదికి పది స్థానాలలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అయితే 2024 ఎన్నికల సమయానికి వచ్చేసిరి ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. వైసీపీకి పెట్టని కోట లాంటి నెల్లూరు జిల్లాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై వ్యతిరేకత రావడం అన్నది నెల్లూరు జిల్లాతోనే మొదలైందని చెప్పవచ్చు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నెల్లూరులో వైసీపీకి వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న విషయం ఏడాది కిందటి నుంచే అందరికీ అవగతం కావడం మొదలైంది. మొదటిగా ఆ జిల్లా నుంచే  ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. ఆ తరువాత ఇటీవలే ఇంత కాలం వైసీపీకి జిల్లాలో బలమైన నేతగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వైఖరితో విభేదించి వైసీపీని వీడి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  దీంతో జిల్లాలో తొలి సారిగా తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలంతో కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ బాగా  బలహీనపడటంతో జగన్ విశాఖ నుంచి విజయసాయిరెడ్డిని ఈ జిల్లాకు దిగుమతి చేశారు. ఆయనను నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అయితే విజయసాయిరెడ్డి రాక తో జిల్లాలో వైసీపీ బలం పెరిగిన దాఖలాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం ఎనిమిదింటిలో విజయం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా ఇటీవలి కాలంలో వెలువడిన పలు సర్వేల ప్రకారం జిల్లాలో ఆరుస్థానాలలో తెలుగుదేశం విజయం ఖాయం. మరో రెండు స్థానాలలో తెలుగుదేశం కూటమికే ఎడ్జ్ ఉంది. ఇక మిగిలిన నాలుగు స్థానాలలో రెండు చోట్ల పోటీ నువ్వా నేనా అనేటట్లుగా ఉన్న అంతిమంగా  ఆ రెండు స్థానాలూ కూడా తెలుగుదేశం ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి. ఇక  సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ విజయం ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా మంత్రి కాకాణి గోవర్థన్ పోటీ చేస్తున్నారు.  ఇక జగన్ ఎన్నో అంచనాలతో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టిన విజయసాయి రెడ్డి పరాజయం ఖాయమని సర్వేలే కాదు, పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు.   మొత్తం మీద వైసీపీ కోటలాంటి నెల్లూరులో ఈ సారి తెలుగుదేశం పాగా వేయడం తథ్యమని చెబుతున్నారు. 

కాంగ్రెస్ గూటికి కిళ్లి కృపారాణి.. షర్మిలలో వైఎస్సార్ ను చూస్తున్నానని వ్యాఖ్య

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ కిల్లి కృపారాణి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసిపి లో తనకు అన్యాయం కన్నా.. అవమానాలు ఎక్కువ జరిగాయని చెప్తూ కన్నీటి పర్యంతం అయ్యారు ఈ కేంద్ర  మాజీ మంత్రి.. అసలు కృపారాణిని వైసిపి ఎలా ట్రీట్ చేసింది.. ఇప్పుడు ఆమె రాజీనామా ఎంత మేర ప్రభావం చూపనుంది..? కిల్లి కృపారాణి.. ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా కు చెందిన సీనియర్ పొలిటీషియన్.. శ్రీకాకుళం ఎంపిగా అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న అప్పటి  తెలుగుదేశం నేత, కేంద్ర మాజీ  మంత్రి కింజరాపు ఎర్రంనాయుడుపై కాంగ్రెస్ నుండి పోటీ చేసి భారి మెజారిటి తో ఓడించి అప్పట్లో పెను సంచలనమే సృష్టించారు కృపారాణి.. అదిమొదలు.. ఆమె రాజకీయ ప్రస్థానం అప్రతిహాతంగా దూసుకుపోయింది. కృపారాణి క్యాపబిలిటి గుర్తించిన సోనియా గాంధీకి కృపారాణి మరింత దగ్గరయ్యారు.. అందుకే కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కృపారాణి కి చేరువ చేశారు. అయితే రాష్ట్ర విభజన అంశంలో పాపాన్ని మూటగట్టుకుని ఒక్కసారి పతన దశకు చేరుకున్న ఎపి కాంగ్రెస్ లో అందరు నేతలు బయటకు వెళ్ళినా కృపారాణి చాలా కాలం ఆ  పార్టీ లో ఉన్నారు. ఓ వైపు కృపారాణి కాంగ్రెస్ లో కొనసాగినా.. అప్పట్లో వై.ఎస్.జగన్మోహనరెడ్డి  వైసిపి స్థాపించిన తొలినాళ్ళలో చేపట్టిన ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సైతం కృపారాణి భర్త రామ్మోహన్ అన్నీ తానై చూసుకున్నారు. అలా వైకాపా కు ముందు నుండి దన్నుగా నిలిచిన కుటుంబంగా కిల్లి ఫ్యామిలి పేరు సంపాదించుకుంది. కానీ వైసిపి లో చేరడానికి మాత్రం కృపారాణి చాలా కాలం టైం తీసుకుంది. జగన్ నుండి పిలుపు వస్తుందని 2014 నుండి 2019 వరకూ ఎదురుచూసిన కృపారాణి ఎంతకూ అటువైపుగా ఎలాంటి కబురు లేకపోవడంతో అనూహ్య పరిణామాల మధ్య 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు వైసిపి కండువా కప్పుకున్నారు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టి అధిష్టాన నిర్ణయం కాదని వైసిపి సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న తమకు పార్టీలో రెడ్ కార్పెట్ ఉంటుందని భావించి జాయిన్ అయిన కృపారాణికి.. ఇన్నేళ్ళు అయినా.. సాధారణ కార్యకర్త లానే ట్రీట్ చేసింది తప్ప చెప్పుకోతగ్గ పోస్టింగ్ ఒక్కటి కూడా వైసిపి ఇవ్వలేదు.. మధ్యలో జిల్లా పార్టీ అధ్యక్షురాలి పదవి ఇచ్చినా.. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే పరిమితం చేసి.. తరువాత ఆమెకు తెలియకుండానే ధర్మాన కృష్ణదాస్ కు ఆ పదవిని బదిలీ చేసేశారు.  పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా భాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సైతం కృపారాణి మాటకు పార్టీలో విలువ  అంతంతమాత్రమే అని చెప్పాలి.. జిల్లా అధ్యక్షురాలి పదవిని వేరొకరికి ఇచ్చేసిన తరువాత.. పార్టీ నామినేటెడ్ పదవుల్లోనూ, నూతన రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల  ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్రంలోని మీడియా అంతా కూడా ముందు కృపారాణి పేరే ఉంటుందని వార్తల కనిపించేవి.. అయితే అప్పుడు కూడా చివరికి కృపారాణి కి మొండి చెయ్యే మిగిలేది. అప్పట్లో జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డిని కలిసే వి.ఐ.పి లిస్టు లో కూడా కృపారాణి పేరు లేకపోవడం, జగన్ కలిసేందుకు వచ్చిన సమయంలో కృపారాణి ని జిల్లా పోలీసులు అడ్డుకోవడం, అవమాన భారంతో ఏడుస్తూనే ఆమె అక్కడి నుండి వెనుతిరగడం పెద్ద సంచలనంగా మారింది.   జరగాల్సిన అవమానాలు అన్నీ జరిగిపోయాయి..  సార్వత్రిక ఎన్నికలకు సమయం అసన్నమైన సమయంలో.. ఇక అన్నీ సర్దుకుంటాయని కృపారాణి భావించారు. తనకు పార్టీ అందిస్తుంది అనుకున్న పదవులు అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి.. ఇక మిగిలించి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానమే కదా.. ఆల్రేడి శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో పలుమార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన అనుభవం ఉన్న తనకే ఈ టికెట్ అని గంపెడాశలు పెట్టుకున్న కృపారాణికి చివరికి అదికూడా దక్కలేదు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్ధిగా పేరాడ తిలక్ పేరు ప్రకటించినప్పటికీ కృపారాణి గడచిన కొద్ది రోజులుగా సైలెంట్ గానే ఉన్నారు. జిల్లా లో నేతలు అందరూ ఎవరికీ వారు ఎన్నికల పనుల్లో నిమఘ్నమయిపోతు.. కనీసం తన సపోర్ట్ కూడా ఎవరూ అడగకపోవడం కృపారాణిని, ఆమె క్యాడర్ ను మరింత నీరు గార్చింది. జగన్ మోహన రెడ్డి తన తమ్ముడు.. ఇది తన తమ్ముడి పార్టీ అని ఎప్పుడూ చెప్పుకునే కృపారాణి.. పార్టీ లో జరుగుతున్న వరుస అవమానాలు, అన్యాయాలు చూసి సహించలేకపోయారు.. ఇన్ని జరుగుతున్నా జగన్మోహన రెడ్డి నుండి కాని, అధిష్టానం లోని పెద్దల నుండి కానీ కనీస ఓదార్పు, భరోసా లేకపోవడంతో తన విధేయతకు ఉన్న వీరతాడును తీసేశారు..    రాజీనామా చేసేశారు... రాజీనామా ప్రకటిస్తూ కృపా రాణి ప్రెస్ మీట్ లో కన్నీరు కార్చడం.. ఆమెకు జరిగిన అవమానాలు అన్నీ మీడియా ముందు ఏకరువు పెట్టడం.. ఇప్పుడు ఇవే రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటాను అని చెప్పిన కృపారాణి తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  కడప జిల్లాలో ప్రచారంలో భాగంగా కిళ్ళి కృపారాణికి కండువా కప్పి షర్మిల కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల వద్దకు చేరుకున్న కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందదర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ కోసం ఎంతో కష్టపడ్డానని, ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని చెప్పారు. అలాంటి తనను జగన్ పక్కన పెట్టారన్న కృపారాణి కష్టపడ్డా తనకు గుర్తింపు లేదని చెప్పారు. తమకు వైఎస్సార్ దేవుడు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది అని అన్నారు. వైఎస్సార్ ను వైఎస్ షర్మిల లో చూస్తున్నామని అన్నారు. షర్మిలమ్మ న్యాయకత్వం లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్నారు. జగన్ ఒక నియంత అని, ఈ నియంత ను గద్దె దించాలని, షర్మిలమ్మ కి కడప ఎంపీగా ఇక్కడ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.   ఈసారి అసెంబ్లీ కి పోటీ చేస్తానని గతంలో తెలుగు వన్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో స్పష్టం చేసిన కృపారాణి.. టెక్కలి అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. టెక్కలి లో అభ్యర్ధి ప్రకటించకపోవడం వెనుక మతలబు ఇదే అయ్యే అవకాశం ఉంది. టెక్కలిలో కృపారాణి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తే కనుక.. అది వైసిపి కి పెద్ద ఎఫెక్ట్ లానే కనిపిస్తోంది. ఇన్నాళ్ళు వైసిపి తరపున తన కోటరీని పెంచుకున్న కృపారాణి.. తన వర్గం ఓట్లను ఇప్పుడు కాంగ్రెస్ కు బదిలీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. టెక్కలి లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలుపును అడ్డుకోవడానికి అనేక వ్యూహాలు రచిస్తున్న వైకాపా అధిష్టానానికి ఇప్పుడు కృపారాణి రూపంలో స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న ఈ తరుణంలో ఈ స్పీడ్ బ్రేకర్ ను దాటి మళ్ళీ వేగం పుంజుకోవాలి అంటే వైసిపి చాలానే కష్టపడాలి..

తూర్పులో తెలుగుదేశం కూటమిదే జేగంట!

రాష్ట్ర రాజకీయాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాది ఒక విశిష్ఠ స్థానం. ఈ జిల్లాలో ఆధిక్యత సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని రాజకీయవర్గాలలో ఒక గట్టి నమ్మకం వచ్చింది. స్వాతంత్రానంతరం ఎన్నికలు జరిగిన ప్రతి సారీ ఆ నమ్మకం నిజమని రుజువు అవుతూనే వస్తోంది.  తూర్పుగోదావరి ఫలితాలే  రాష్ట్రంలో అధికార పార్టీని నిర్ణయిస్తాయన్నది ఒక నమ్మకం. అందుకే  తూర్పు ఏటైతే రాష్ట్రం కూడా అటే’ అంటారు రాజకీయ పండితులు. తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ  నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఇదే.  ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ వచ్చిందో అది పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తున్నది.   రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గానూ 14 నియోజకవర్గాలలో విజయం సాధించింది.  ఆ ఎన్నికలలో తెలుగుదేశం రాష్ట్రంలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అదే విధంగా  2019 ఎన్నికల్లో  వైసీపీ  పద్నాలుగు నియోజకవర్గాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని కైవశం చేసుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికలలో పరిస్థితి తెలుగుదేశం కూటమికే అనుకూలంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేలలో కూడా అదే తేలింది.  రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్న దానికి రాజకీయ పండితులు కూడా తూర్పు గోదావరి ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ ప్రకారంగా చూస్తo ఈ సారి తూర్పులో తెలుగుదేశం కూటమి హవా కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జిల్లాలో  తుని, అనపర్తిలో  అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రమే వైసీపీకి ఒకింత సానుకూల పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  తునిలో యనమల కుటుంబంలో  విభేదాల కారణంగా   తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వాస్తవానికి  తుని  తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచీ 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో  తెలుగుదేశం తునిలో విజయం సాధించింది.  ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికలలోనూ ఓడిపోతూ వస్తోంది. ఇక అనపర్తి విషయానికి వస్తే..  పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి వెళ్లడం కూటమికి ఒకింత ఇబ్బందికరంగా మారింది. అదే  వైసీపీకి  అనుకూలంగా మారింది.   ఇక్కడ తెలుగుదేశం తరఫున బలమైన అభ్యర్థి  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికీ, మిత్ర ధర్మంలో భాగంగా తెలుగుదేశం ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో నియోజకవర్గ తెలుగుదేశం కేడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెబల్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనపర్తి విషయంలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతోందని అంటున్నారు. ఆ చర్చలు ఫలించి అనపర్తి నుంచి తెలుగుదేశం అభ్యర్థే పోటీలోకి దిగితే.. కూటమి విజయానికి తిరుగు ఉండదు కానీ..ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూటమి వెనుకబాటులోనే ఉందని చెప్పాలి.  ఈ రెండు నియోజకవర్గాలూ మినహాయిస్తే జిల్లాలో తెలుగుదేశం కూటమి ముందంజలో ఉందని సర్వేలు చెబుతున్నాయి.  దీనిని బట్టి రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రిజ‌ర్వుడ్ స్థానాల్లో తెలుగుదేశం కూట‌మిదే హ‌వా!

ఏపీలో ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. అధికార వైసీపీ, కూట‌మి అభ్య‌ర్థులు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, ప్ర‌చారానికి వెళ్తున్న వైసీపీ అభ్య‌ర్థుల‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. స‌మ‌స్య‌ల‌పై వైసీపీ అభ్య‌ర్థుల‌ను నిల‌దీస్తున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డిన విష‌యం తెలిసిందే. ఐదేళ్ల‌లో కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు, భూక‌బ్జాలు, ఇసుక‌, మ‌ట్టి, మ‌ద్యం దోపిడీతో వేలాది కోట్ల రూపాయ‌లు దోచుకునేందుకే జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు ప్రాధాన్య‌తనిచ్చారు. దీంతో ఐదేళ్ల‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కాక‌పోగా.. అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. రాష్ట్రానికి కొత్త ప‌రిశ్ర‌మ‌లు తీసుకురాక‌పోగా.. చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టిన కంపెనీల‌ను జ‌గ‌న్ త‌రిమేశారు. యువ‌త‌కు ఉపాధి దొర‌క‌ని ప‌రిస్థితి. ఏపీలో ర‌హ‌దారుల సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌ధాన ర‌హ‌దారులుసైతం అద్వాన్నంగా త‌యార‌య్యాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా జ‌గ‌న్ స‌ర్కార్ ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్లేదు. దీంతో రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.  ఏపీలో ప్ర‌ముఖ సంస్థ‌లు నిర్వ‌హించిన‌ స‌ర్వేల్లో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తేలింది. ఇప్ప‌టికే దాదాపు ప‌దికిపైగా ప్ర‌ముఖ సంస్థ‌లు త‌మ స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాయి. అన్ని స‌ర్వే ఫ‌లితాల్లోనూ ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థులే అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధిస్తార‌ని తేలింది.  తాజాగా పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే  ఆసక్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఏపీలో వైసీపీ జ‌గ‌న్ స‌ర్కార్ ప‌డిపోవ‌టం ఖాయ‌మ‌ని, సీఎంగా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఖాయ‌మ‌ని స‌ర్వే తేల్చింది.  ఇందుకు కార‌ణాల‌ను కూడా స‌ర్వే సంస్థ వెల్ల‌డించింది. ఏపీ అసెంబ్లీ ఫలితాలను డిసైడ్ చేసే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ఈసారి కూట‌మిదే హ‌వాఅని పీపుల్స్ పల్స్ సర్వే ప్రకటించింది.   రాష్ట్రంలో మొత్తం 36 రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. వాటిలో 29 ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వాటిల్లో చేసిన సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి.  2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఈ ఎస్సీ నియోజకవర్గాల మొగ్గు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నాయి.  అటువంటి రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతున్న‌ట్లు స‌ర్వే తేల్చింది. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల ప్ర‌జ‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌ని చెప్పిన స‌ర్వే సంస్థ‌.. ఎందుకో కార‌ణాల‌నుసైతం వెల్ల‌డించింది.  మాటకు ముందు మాటకు తరువాత నా ఎస్టీలు, నా ఎస్సీలు అనే జగన్ వారికి చేసిందేమీ లేదన్న సంగతి వారిలో జగన్ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాలే తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. ఏపీలో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌ ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉన్నార‌ని, గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా ఈసారికూడా వైసీపీకే వారి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు స‌భ‌ల్లో పేర్కొంటూ వ‌స్తున్నారు. కానీ, పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వేలో జ‌గ‌న్ పై ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తేలింది. రాష్ట్రంలో మొత్తం 36 రిజర్వుడు స్థానాల్లో 29ఎస్సీ నియోజకవర్గాలు, ఏడు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌త కొన్నేళ్లుగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వ‌స్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తున్నది. ఉదాహ‌ర‌ణ‌కు.. 2014 ఎన్నిక‌ల్లో 29 ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం కూట‌మికి 16, వైసీపీకి 13 స్థానాలు వ‌చ్చాయి.  అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చింది. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఒక‌టి, జ‌న‌సేన పార్టీకి ఒక‌టి,  వైసీపీకి 27 స్థానాలు వ‌చ్చాయి. దీంతో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. పీపుల్స్ ప‌ల్స్ సంస్థ తాజాగా చేసిన సర్వే ప్రకారం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమికి 19 సీట్లు (51.81%), వైసీపీకి 10 సీట్లు (42.83%) లభించే అవకాశాలున్నాయని  అని తేలింది. దీంతో  ఆన‌వాయితీ ప్ర‌కారం.. తెలుగుదేం కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని స‌ర్వే సంస్థ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల ప్ర‌జలు వైసీపీ ప్ర‌భుత్వంపై ఎందుకు వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌నే కార‌ణాల‌ను కూడా పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే పేర్కొంది. ఎస్సీ నియోజకవర్గాల్లో చదువుకున్న దళిత వర్గాల్లో పెద్దఎత్తున ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండటం.  సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు. ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ద‌ళిత వ‌ర్గాల్లోని యువ‌త‌కు ఉద్యోగాలు దొర‌క్క‌పోగా.. స్థానికంగా ప‌ని చేసుకునేందుకు ఉపాధి అవ‌కాశాలు క‌రువ‌య్యాయి.  స్వయం ఉపాధి రుణాలు సరిగా అంద‌లేదు. జ‌గ‌న్ హ‌యాంలో దళితులపై దాడులు పెరిగాయి. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన ద‌ళితుల‌ను పోలీసుల స‌హ‌కారంతో చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ద‌ళితులు చ‌నిపోయారు. ఈ కారణంగా  ద‌ళితులంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నీస గౌర‌వంకూడా ఇవ్వ‌డం లేద‌న్న వాద‌న ద‌ళిత వ‌ర్గాల్లో బలంగా ఏర్పడింది. చంద్ర‌బాబు హ‌యాంలో ద‌ళితుల‌కు ప్ర‌త్యేకంగా నిధులు ఇచ్చి  అభివృద్ధికి స‌హ‌కారం అందించార‌ని, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దళితుల అభివృద్ధి కుంటుప‌డిపోవ‌టంతోపాటు, వారిపై  దాడులు పెరిగార‌ని ఏపీలోని ద‌ళిత వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో ఓటు ద్వారా వైసీపీకి  గుణ‌పాఠం చెప్పేందుకు ద‌ళిత వ‌ర్గాల ప్ర‌జ‌లు సిద్ధ‌మై న్న‌ట్లు స‌ర్వే పేర్కొంది. రిజ‌ర్వుడ్‌ నియోజకవర్గాల్లోని ప్ర‌జ‌లేకాక‌.. మిగిలిన 139 నియోజకవర్గాల్లోని ప్ర‌జ‌లుసైతం వైసీపీ ప్ర‌భుత్వానికి ఓటు ద్వారా గుణ‌పాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.

గన్నవరంలో వంశీకి ఎదురీతే!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయంపాలై ప్రతిపక్షానికి పరిమితం కాగానే ఆయన పార్టీ ఫిరాయించేశారు. అక్కడ నుంచీ ఆయన తెలుగుదేశం పార్టీ పైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఇష్టారీతిగా చేసిన విమర్శలు ఆయనను నియోజకవర్గ ప్రజలకు దూరం చేశాయి. దీనికి తోడు వైసీపీలో వర్గ విభేదాలు ఆయనకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వల్లభనేని వంశీకి గన్నవరంలో ఎదురీత తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాజకీయ జీవితం ఇచ్చి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిన వల్లభనేని వంశీ.. ఆ పార్టీ అధినేత జగన్ మెప్పు కోసం ఎంత చేయాలో అంతా చేశారు. అయినా వైసీపీలో వంశీకి ఏమైనా గుర్తింపు దక్కిందా? ఆయన మాట ఎక్కడైనా చెల్లుబాటు అయ్యిందా అంటే ఆ పరిస్థితి ఎక్కడా లేదు.  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును సీఎం జగన్ వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చినప్పుడు వంశీ ట్విట్టర్ వేదికగా ఆ నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన సందర్భంలో జగన్ నుంచి కనీస స్పందన లేదు.    2019 ఎన్నికల్లో   జగన్ హావా   తట్టుకొని వల్లభనేని వంశీ.. గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.   ఆ తర్వాత  వైసీపీ గూటికి చేరారు... అక్కడితో ఆగకుండా   టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై వంశీ విమర్శలు గుప్పించారు.. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోని వారంతా మీడియా ముందుకు వచ్చి ఆ విమర్శలను ఖండించారు.. ఆ తరువాత వల్లభనేని వంశీ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో చంద్రబాబు ఫ్యామిలీకి క్షమాపణలు కూడా చెప్పారు.  అయితే అప్పటికే వల్లభనేని వంశీకి పూడ్చలేని నష్టం జరిగింది. ఇటు నమ్ముకున్న వైసీపీలో కూడా వర్గ రాజకీయాల కారణంగా ఆయనకు ఉక్కపోత ఆరంభమైంది.  గన్నవరం నియోజకవర్గంలో అధికార ఫ్యాన్ పార్టీలో గ్రూప్‌ల రాజకీయం వంశీ కి పొమ్మనకుండా పొగపెట్టేసింది.  వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ కోసం ఆయన నేల విడిచి సాము చేయాల్సి వచ్చింది.   ఇక వల్లభనేని వంశీని ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వంశీపై పోటీ చేసి పరాజయం పాలైన యార్లగడ్డకు ఈ సారి తెలుగుదేశం అభ్యర్థిగా టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు.  మరో వైపు వైసీపీలో దుట్టా వర్గం వంశీకి సహాయనిరాకరణ చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో గన్నవరంలో వంశీ విజయం ఎంత మాత్రం సునాయాసం కాదని అంటున్నారు.    మొత్తం మీద నియోజకవర్గంలో సొంత పార్టీ వ్యతరేకతను తట్టుకుని పార్టీ టికెట్ సంపాదించగలిగినా వంశీకి ఇంటి పోరు తప్పడం లేదు. సొంత పార్టీ కేడర్ నుంచే మద్దతు కరవైంది. గన్నవరంలో ఆ సారి ప్రత్యేకత ఏమిటంటే.. గత ఎన్నికలలో  ఎవరైతే ప్రత్యర్థులుగా తలపడ్డారో వారే ఇప్పుడు కూడా ప్రత్యర్థులు. అయితే పార్టీలు మారాయి.  వల్లభనేని వంశీకి వైసీపీలో పలు వర్గాలు వ్యతిరేకంగా ఉంటే… తెలుగుదేశం క్యాడర్ మొత్తం  యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా నిలిచింది.  వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు.. వంశీకి ఇసుమంతైనా సహకరించడం లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక నియోజకవర్గంలో    ఓటర్లు  సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు అండతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన కుటుంబాన్నే దూషించడం వంశీకి పెద్ద  మైనస్‌గా మారింది.  ఇన్ని ప్రతికూలతల మధ్య నియోజకవర్గం నుంచి మరో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న వంశీ ఆశలు నెరవేరే అవకాశాలు అంతంత మాత్రమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కొడాలి నాని ఇలాకాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న చీరలు సీజ్

వైసీపీ బరితెగించేసింది. నియమ నిబంధనలను గాలికొదిలేసి.. ప్రజలను ప్రలోభాలకు గురి చేసైనా సరే ఎన్నికలలో విజయం సాధించాలని చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైసీపీ ముఖ్య నేతల నివాసాలూ గోడౌన్లలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కానుకల పందేరానికి అవసరమైన సామగ్రిని డంప్ చేసి పెట్టుకున్నారు. పలు చోట్ల అటువంటి డంప్ లను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. మొన్న చెవిరెడ్డి గోడౌన్లలో, నిన్న కొడాలి నాని ముఖ్య అనుచరుడి నివాసంలో.. గుడివాడలో కొడాలి నాని ముఖ్య అనుచరుడి నివాసంలో పెద్ద ఎత్తున చీరల బండిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉ:చిన  చీరల బండిల్స్‌ను పోలీసులు గురువారం (ఏప్రిల్ 4)న గుర్తించి సీజ్ చేశారు.  పోలీసులకు సమాచారం రావడంతో  సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్‌ సుమారు రూ.30 లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ శ్రీకాంత్‌, పామర్రు ఎస్‌ఐ, సీఐలకు అందిన సమాచారంతోనే ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. మొత్తం 46 బండిల్స్‌ సీజ్‌ చేసిన పోలీసులు ఇవి విజయవాడకు బుకింగ్‌ ద్వారా వచ్చిన ట్లు గుర్తించారు. 175 నియోజకవర్గాలలో చీరలు పంపిణీ జరిగేందుకు వాటిని ఇక్కడ డంప్‌ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తం మీద నిన్న మొన్నటి వరకూ వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసలు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్వేచ్ఛగా పని చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. పోలీసులంటే తాము ఆడించినట్లల్లా ఆడతారని ఇంత కాలం భావించిన వైసీపీ నేతలకు ఇప్పుడీ పరిణామాలు మింగుడుపడటం లేదు. 

ఇక అవినాష్ అరెస్టే తరువాయా?

 ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దమైందా?అంటే పోలిటికల్ సర్కిల్‌లో ఔననే సమాధానమే వినిపిస్తోంది.  వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి విచారించాలని సీబీఐ ఎప్పటి నుంచో కోర్టులను కోరుతోంది. కోర్టు అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. పెద్దగా బయటకు తెలియని కారణాలతో సీబీఐ మాత్రం ఆయన జోలికి వెళ్లలేదు. అరెస్టు చేస్తున్నట్లు పెద్ద బిల్డప్ ఇచ్చి కర్నూలు వరకూ సినీ ఫక్కీలో చేజ్ చేసి మరీ చేతులెత్తేసి వెనక్కు తిరిగి వచ్చేసింది. ఏపీ పోలీసులు సహకరించలేందంటూ కుంటి సాకులు చెప్పింది.   వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు   సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు  ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయింది. అయినా సీబీఐ ఇంకా అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది.   అయితే ఇప్పుడు మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు చేయాలని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది.    వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. ఈ కేసులో కీలక సాక్షిగా, అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి అవినాష్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అవినాష్ ఉల్లంఘించారని పేర్కొంది. అవినాష్, ఇతర నిందితులు సాక్షులను ప్రభావితం చేయగలరని దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్ పై సీబీఐ వేసిన కౌంటర్ లో దస్తగిరి, అతని కుటుంబాన్ని అవినాష్‌, అతని వ్యక్తులు బెదిరించారని సీబీఐ ఆరోపించింది. దస్తగిరి సహా ఇతర  సాక్షులను అవినాష్   బెదిరింపుల నుండి రక్షించడానికి, అతని బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో ఇక అవినాష్ అరెస్టును అడ్డుకోవడం ఎవరి తరం కాదన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆపద్థర్మ ముఖ్యమంత్రి హోదాలో జగన్ అవినాష్ రెడ్డిని రక్షించే ప్రయత్నాలు చేయలేరని అంటున్నారు. 

కోటలు దాటిన మాటలు.. గడపదాటని చేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేదలను ఉద్ధరించడానికే అవతరించానంటూ తన భుజాలు తానే చరుచుకుని మరీ గొప్పగా ప్రచారం చేసుకుంటారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 90శాతానికి పైగా అమలు చేసేశానని గప్పాలు కొట్టుకుంటారు. అయితే వాస్తవంలో ఆయన ఇచ్చిన హామీలలో పూర్తిగా నెరవేర్చినవి ఏమిటన్న లెక్కలు వేస్తే.. ఏ హామీ కూడా పూర్తిగా నెరవేరలేదనే తేలుతోంది. హామీలు అమలు చేస్తున్నా.. బటన్ నొక్కి క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నా అని చెప్పుకుంటున్న జగన్..బటన్ నొక్కిన ఎన్ని రోజులకు ఖాతాలలో డబ్బులు పడుతున్నాయో మాత్రం చెప్పరు.  ఇప్పుడు సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలోనూ అదే జరుగుతోంది. వలంటీర్లపై ఈసీకి ఫిర్యాదులు చేసి వారిని పించన్ల పంపిణీకి దూరం చేసిన తెలుగుదేశం కారణంగానే అవ్వా తాతలకు సమయానికి పింఛన్లు అందలేదని చెప్పుకుంటున్న జగన్.. వాస్తవానికి వారికి పింఛన్లు పంపిణీ చేయడానికి ట్రెజరీలో సొమ్ములు లేవన్న విషయాన్ని దాచిపెట్టడానికి శతథా ప్రయత్నించారు. అయితే నిమ్మల రామానాయుడు జగన్ బాగోతాన్ని బట్టబయలు చేశారు. పంచాయతీల ఖాతాలలో డబ్బులు జమ కాకపోవడం  వల్లనే పింఛన్ల పంపిణీ జరగడం లేదన్న వాస్తవాన్ని నిమ్మల బయటపెట్టారు.  ఇలా ఒక్కటని కాదు.. ప్రతి పథకం అమలులోనూ జగన్ కుటిలత్వం, కపటత్వం బయటపడుతూనే ఉంది. పాఠశాల పిల్లలకు పోషకాహారం అంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకున్న జగన్..   పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు, చిక్కీ ఇస్తున్నామంటూ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు గుప్పించుకున్నారు.  ల్లలకు మేనమామ ఇస్తున్న బహుమతిగా  చెప్పుకున్నారు.  అయితే ఇప్పుడు   పిల్లలకు భోజనంలో కోడిగుడ్డు, చిక్కీలు బందయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం ఏమిటా అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. యథా ప్రకారం వాటిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ బిల్లులు ఇవ్వలేదు. బిల్లులు రేపిస్తాం, మాపిస్తాం అంటూ ఇప్పటిదాకా బండినడిపేసిన జగన్ సర్కార్ కారణం అవి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు, జగన్ సర్కారు ఇప్పటిదాకా బిల్లులు ఇవ్వకపోవడమేనట. బిల్లులు వచ్చే నెలలో ఇస్తామంటూ ఈ ఫిబ్రవరి దాకా లాగించిన జగన్ సర్కారు.. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని చేతులెత్తేసిందని కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు.   jyడిగుడ్లు, చిక్కీ సరఫరా దారులకు ప్రభుత్వం, ఈ ఫిబ్రవరి వరకూ 189 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది.   చిక్కీ సరఫరాచేసే కాంట్రాక్టర్లకే 52 కోట్ల బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో  కాంట్రాక్టర్లు.. ఇకపై మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే వాటిని సరఫరా చేస్తామనీ, లేకుంటే లేదని బల్లగుద్దినట్లు చెప్పేశారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇప్పుడు బిల్లులు చెల్లించే అవకాశమే లేదు.  అసలు మామూలు రోజుల్లేనే బిల్లులు ఇవ్వని జగన్ సర్కారు.. ఇప్పుడు ఇంకేమి ఇస్తుందని కాంట్రాక్టర్లు.. చిక్కీ,కోడిగుడ్ల సరఫరాను నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. హామీలు ఇచ్చేయడం తరువాత సొమ్ములు లేవంటూ చేతులెత్తేయడం ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ కు ఒక రివాజుగా మారిపోయింది. అమ్మ ఒడి నుంచి తీసుకుంటే.. జగన్ సర్కార్ అమలు చేస్తున్న అన్ని పథకాల పరిస్థితీ దాదాపుగా ఇలానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ 

తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న మాజీ సిఎం కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లోబెయిల్ దొరికే అవకాశాలు కనబడటం లేదు. బలమైన ఆధారాలు ఉండటం వల్లే బెయిల్ దొరకడం లేదు.  ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కోర్టు అనుమతితో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమెకు న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.  

నవనీత్ కౌర్ కు సుప్రీంలో భారీ ఊరట 

సినీ నటి, లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ కు సంబంధించి సుప్రీంకోర్టు సానుకూల తీర్పును వెలువరించింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ గతంలో బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసింది.  2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. శివసేన అభ్యర్థి ఆనందరావుపై ఆమె విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె నకిలీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఎన్నికల్లో పోటీ చేశారని ఆనందరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమెది నకిలీ కుల ధ్రువీకరణ పత్రం అని గుర్తించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేయడంతో పాటు... రూ. 2 లక్షల జరిమానా విధించింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో నవనీత్ కౌర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. అమరావతి టికెట్ ను ఆమెకు బీజేపీ కేటాయించింది. నకిలీ సర్టిఫికేట్ స్టోరి ఇదే  నవనీత్ రాణా 2013లో క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారు. నవనీత్ రానాకు మోచి కులం సర్టిఫికెట్ ఇచ్చారు. ఆమె సర్టిఫికేట్ కుల ధృవీకరణ కమిటీ ద్వారా ధృవీకరించబడింది. అయితే దానిని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ ఆనందరావు అడ్సుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదనంతరం, బాంబే హైకోర్టు కుల పరిశీలన కమిటీ నిర్ణయాన్ని రద్దు చేసి నవనీత్ కౌర్ సర్టిఫికేట్ చెల్లదని తీర్పును వెలువరించింది. అమరావతి లోక్‌సభ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడింది. నవనీత్ రాణా ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె కుల ధ్రువీకరణ పత్రం బోగస్ అంటూ శివసేన మాజీ ఎంపీ ఆనందరావు అద్సుల్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో నవనీత్ కౌర్ చెప్పులు కుట్టే వర్గానికి చెందిన ఆమె కాదని, ఆమె భర్త చర్మకారుడని తెలిపారు. దీనిపై పరిశీలించిన బాంబే హైకోర్టు ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదని జూన్ 2021లో తీర్పునిచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవనీత్ రాణా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని, ఈ కుల ధృవీకరణ పత్రం చెల్లుతుందని సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆమె నామినేషన్ దాఖలు ప్రక్రియ సుగమం అయింది

లోక్ సభ ఎన్నికలు.. పోటీకి కేసీఆర్ కుటుంబం వెనుకంజ బీఆర్ఎస్ లో కనిపించని గెలుపు ధీమా!

నాయకుడు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుండి నడవాలి. పార్టీ పరాజయాల బాటలో ఉంటే పోటీకి నేనున్ననంటూ ముందుకు దూకాలి. పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో విశ్వాసాన్ని నింపాలి. అందుకు భిన్నంగా పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు అంతా నా మహత్మ్యమే అని విర్రవీగుతూ, పార్టీకి ఇబ్బందులు ఎదురుకాగానే క్యాడర్ కు, నాయకులకు ముఖం చాటేస్తూ.. వాళ్లంతా సరిగా పని చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందంటూ నిందలు వేయడం వల్ల ఉన్న వారు దురమవ్వడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చేస్తున్న పని ఇదే. ఆ కారణంగానే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. సరే ఏ రాజకీయ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. పార్టీ నాయకుడి సత్తా ఏమిటన్నది, పార్టీ పరాజయం పాలైన తరువాతనే జనాలకు, పార్టీ క్యాడర్ కు కూడా బాగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీనే తీసుకుంటే.. ఆ పార్టీ పరాజయం పాలైన ప్రతి సారీ గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో బలోపేతమైంది. ఆ పార్టీ నేత వెంట క్యాడర్ నడిచింది. అదే బీఆర్ఎస్ ను తీసుకుంటే.. ఒక్క పరాజయం ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి.. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లను అంగీకరించి వాటిని దిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సింది పోయి బీఆర్ఎస్ అధినాయకత్వం తమ ఓటమికి ప్రజలనే నిందించడం, బోగస్ హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిందంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోయడంతో ప్రజలలో పార్టీ ప్రతిష్ట మరింత మసకబారింది. అధికారంలో ఉండగా మితిమీరిన అతిశయంతో  వ్యవహరించిన అగ్రనాయకత్వానికి ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో నిలబెట్టేందుకు అభ్యర్థులే కరవైన పరిస్థితి వచ్చిందంటే ఆశ్చర్యం ఏముంది.   బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం (ఆవిర్భావ సమయంలో పార్టీ పేరు టీఆర్ఎస్) నుంచి ఎన్నికలు జరిగిన ప్రతి సారి అధినేత కేసీఆర్ లేదా ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు లోక్ సభ కు పోటీ చేసేవారు. పార్టీ ఆవిర్భవించింది 2001లో.. ఆ తరువాత 2004 ఎన్నికలలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.  తరువాత 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే కాకుండా మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. రెండో  చోట్లా విజయం సాధించారు. పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు.  అయితే ఆ ఎన్నికలలో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేసి విజయం సాధించి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. 2019 ఎన్నికలలో నిజామాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత పరాజయం పాలయ్యారు. అయితే అదే ఏడాది కేసీఆర్ సమీప బంధువు  జోగినిపల్లి సంతోష్ రెడ్డి  రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇలా పార్టీ  ఆవిర్భావం తరువాత నుంచి జరిగిన ప్రతి ఎన్నకలోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు లోక్ సభకో రాజ్యసభకో ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడం, రానున్న లోక్ సభ ఎన్నికలలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ బరిలో లేకపోవడంతో మరో ఐదేళ్ల వరకూ ఆ కుటుంబం నుంచి ఎవరూ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించరని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికీ, పార్టీ పరాజయంతో  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించడానికి ముందుగా పోటీకి నిలవవలసిన ఆ కుటుంబం నుంచి ఎవరూ ముందుకు రాకపోవడంతో క్యాడర్ లో నిరాస వ్యక్తం అవుతోంది.  ముందుండి నడిపించాల్సిన నాయకుడే వెనుకడుగు వేయడంతో బీఆర్ఎస్ లో విజయం పట్ల ధీమా, విశ్వాసం మచ్చుకైనా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పిఠాపురం ఈ సారి పవన్ కళ్యాణ్ దే... కొనసాగుతున్న సెంటిమెంట్

పిఠాపురం...  40 ఏళ్ళ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి గెలిచాడు. మరి ఈ సారి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏ కోశానా లేదు.విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠగా మారింది.  ఒకప్పుడు జమిందారులు  పిఠాపురం సంస్థానాన్ని  పాలించారు. సంగీతం, సాహిత్య, ఆధ్యాత్మికతను పెంచిపోషించి ప్రత్యేకతను చాటుకుంది ఈ సంస్థానం. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో పిఠాపురం పోరు ఉత్కంఠ రేపుతోంది.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానికన్నా పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ గెలుస్తాడా? లేదా? అనేదే  ఉత్కంఠ అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్కంఠ నెలకొందంటే ఫిఠాపురంలో  రాజకీయ వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పవన్ క‌ళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదనేది వైసీపీ సిద్దాంతం.   ఆరు నూరైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని  జనసేనాని పట్టుబడుతున్నారు. అటు జ‌గ‌న్‌, ఇటు ప‌వ‌న్ ఇద్ద‌రూ  మాంచి క‌సి మీద ఉన్నారు.  అస‌లు పిఠాపురం రాజ‌కీయం ఎలా వుంది అనేది  ఎపి ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పేపర్లు తిరగేస్తున్నారు. టీవీలకు అతుక్కుపోతున్నారు.   మొత్తం రాష్ట్రం పిఠాపురం వైపే చూస్తోంది. ఎందుకంటే పవన్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ ను ఈ  ఎన్నిక‌లు నిర్దేశించ‌నున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - వంగా గీత ఎవ‌రి బ‌లం ఏమిటో చూద్దాం. ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి  పరిశీలిద్దాం. టీడీపీ నేత‌ వ‌ర్మ‌తో ఉన్న త‌ల‌నొప్పి సెట్ అయింది. ఎందుకంటే  చంద్ర‌బాబునాయుడే వ‌ర్మ‌కు  హామీ ఇచ్చారు.  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  మొద‌టి విడ‌త‌లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాన‌ని హామీ దొర‌క‌డంతో వ‌ర్మ కూల్ అయ్యారు.  దీంతో 91 వేల మంది కాపులు. వారి ఓట్ల‌న్నీ అనుకూలంగా మారుతాయి.  కుప్పం, పులివెందుల త‌ర‌హాలో  పిఠాపురంను స్వంత‌ నియోజ‌క‌వ‌ర్గం చేసుకుని నియోజ‌క‌వ‌ర్గ రూపురేఖ‌ల్ని మార్చివేస్తానంటూ ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌చారానికి పిఠాపురం ఓట‌ర్లు ప‌డిపోయారు.   యూత్ ఓట‌ర్లు ప‌వ‌న్‌కు అనుకూలంగా వున్నారు. సినిమాల్లో పవన్ కు ఉన్న క్రేజు యూత్ ఓటర్లు ఆకట్టుకునేలా చేస్తోంది.  గ‌తంలో ప్ర‌జారాజ్యంకు ప‌ట్టు వున్న నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి  ప‌వ‌న్ కు ఈ ఓటు బ్యాంక్ క‌లిసివ‌స్తోంది. పిఠాపురం ప‌వ‌న్‌కు క్యాట్ వాక్ అని చెప్ప వ‌చ్చు.   అంతే కాదు ఇక్క‌డి ఓట‌ర్ల స్వ‌భావం  ఏమిటంటే  గ‌తంలో గెలిపించిన‌ పార్టీని మ‌ళ్ళీ గెలిపించ‌రు. కాబ‌ట్టి ఈ సారి జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇస్తారు అని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.  1978 నుంచి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు..  1978లో కాంగ్రెస్‌ తరుపున కొప్పున మోహన్‌రావు గెలిస్తే..  1983లో తెలుగుదేశం వేవ్‌లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు.  1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు,  1989లో కాంగ్రెస్‌ నుంచి కొప్పన మోహనరావు,  1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు,  1999లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు..  2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు,  2009లో ప్రజారాజ్యం తరపున వంగా గీత,  2014లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి వర్మ గెలుపొందారు..  2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు విజయం సాధించారు.  అయితే, 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు..  ఈ సారి గెలుపు పవన్‌ కల్యాణ్‌దే అని జనసేన లెక్కలు వేస్తోంది.  ప్రతీ ఎన్నికల్లో విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు..  2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది.. వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతకున్న బ‌లం ఏమిటో చూద్దాం ఆమె కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలే.  సుదీర్ఘ రాజకీయ ఆనుభ‌వం వుంది. ఆమె రాజ‌కీయ ప్రస్థానంలో  పలు పదువులు చేపట్టారు.  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు.  గత ఎన్నికల్లో వైసీపీ నుంచే కాకినాడ ఎంపీగానూ గెలిచారు.  అంతకు ముందు టీడీపీ నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు.  ఇలా అసెంబ్లీ, లోక్ సభ, రాజ్య సభ మూడు చట్ట సభలకూ ప్రాతినిధ్యం వహించిన ప్రత్యేకత ఆమె సొంతం.  10 వేల రెడ్డి ఓట్లు వున్నాయి. అవి కూడా ఆమెకు ప‌డ‌వ‌చ్చు. లోకల్ ఫ్యాక్టర్ తీసుకువ‌చ్చి ప‌వ‌న్ నాన్ లోక‌ల్ అనే ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నం. ఆయన సెలిబ్రిటీ. ఒకసారి గెలిచిన తరువాత అందుబాటులో వుండ‌ర‌నే ప్ర‌చారం బలంగా ఉంది.  పవన్ ఏ కుల ఓట్లపై ఎక్కువ ఆధారపడ్డారో అక్క‌డే జ‌గ‌న్ దెబ్బ కొట్టాల‌నుకుంటున్నారో,  అదే సామాజికవర్గానికి చెందిన కీలక నేత ముద్రగడ వైసీపీలో చేర్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వైసీపీకి కలసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.   దాంతో పాటు వంగా గీతకు కూడా అక్కడ సొంత ఇమేజ్ పలుకుబడి ఉన్నాయి.  ఇక్క‌డున్న 3 మండలాలు. గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి. పిఠాపురం, ద్వారంపుడి చంద్ర‌శేఖ‌ర్  యు.కొత్తపల్లి, దాడిశ‌ట్టి  రాజా గొల్లప్రోలు  కుర‌సాల క‌న్న‌బాబు ల‌ను ఇంఛార్జ్‌లుగా పెట్టి ముద్రగడ పద్మనాభం కో ఆర్డినేష‌న్ చేసుకుంటూ పవన్‌కల్యాణ్‌ను ఓడించేందుకు బాధ్య‌త‌ను అప్పజెప్పినట్లు సమాచారం. వీరికి అనుబంధంగా ఐప్యాక్ టీం  ప్ర‌భుత్వ సంక్షేమం పొందిన ల‌బ్దిదారుల ఓట్లు వైసీపీకి ప‌డేలా చేయ‌డంతో పాటు, కాపు ఓట్ల చీల్చ‌డం వార్తలు వస్తున్నాయి.  బీసీ, ఎస్సీ ఓట్లు క‌లుపుకునే వెళ్ళాలా వైసీపీ వ్యూహం వుంది. గ్రామీణ ప్రాంత ఓట‌ర్లు వైసీపీకి అనుకూలంగా వుండ‌టం కూడా ఆమెకు క‌లిసి వ‌చ్చే అంశం. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్‌ కల్యాణ్ ప్లాన్‌ చేస్తున్నారు..  అయితే, పవన్‌ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది..