జగన్ వెంటే జనం.. ఎమ్మెల్యేల వల్లే ఓటమి.. వైసీపీ కొత్త కథలు!
posted on May 24, 2024 @ 6:05PM
ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్ బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది. పోలింగ్ ముగిసిన క్షణం నుంచే వారు తమ ఓటమిని అంగీకరించేశారు. ఓటమికి కారణాలు వెతుక్కుని వెతుక్కుని మరీ చెప్పారు.
నగరి నుంచి పోటీ చేసిన మంత్రి రోజా అయితే.. తన ఓటమికి సొంత పార్టీ వారే కారణమని పోలింగ్ ఇంకా పూర్తిగా ముగియకుండానే మీడియా ముందుకు వచ్చి గొంతు చించుకుని మరీ చెప్పారు. ఇక పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన ఎన్నికల సంఘాన్నీ పోలీసులనూ మేనేజ్ చేసి తమ అవకాశాలు దెబ్బతీశారంటూ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. అధికార పార్టీ అయి ఉండీ కొందరు పోలింగ్ ఏకపక్షంగా తెలుగుదేశంకు అనుకూలంగా జరిగిందని బేల అరుపులు అరిచారు. సరే ఎంత గింజుకున్నా, ఎంత మొత్తుకున్నా ఓటమి మాట మాత్రం వారి నోటి వెంట వారికి తెలియకుండానే వచ్చేసింది.
ఇక పార్టీ అధినేత జగన్ గంభీరంగా గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం అని ఓ మాట చెప్పి విదేశీ పర్యటనకు చెక్కేశారు. అధినేత గెలుపుపై చెప్పిన మాట వైసీపీ శ్రేణులకు ఇసుమంతైనా భరోసా కలిగించలేదనుకోండి అది వేరే సంగతి. ఇక ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వ్యూహకర్తలు ఓటమికి కారణాలు వెతుక్కుని మరీ చెబుతున్నారు. అందులో భాగంగానే విరిప్పుడు ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలు కావడం ఖాయమని అంగీకరించేసి.. ఆ ఓటమికి కారణాలు చెప్పుకొస్తున్నారు. అందుకు వారు సామాజిక మాధ్యమాన్నే వేదికగా ఎంచుకున్నారు.
జనం మొత్తం జగన్ వెంటే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలపై ప్రజలలో గూడుకట్టుకున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా జగన్ అధికారానికి దూరం కాబోతున్నారన్నట్లుగా కథనాలు వండి వారుస్తోంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత గడపగడపకూ సమయంలోనే ప్రస్ఫుటమైందనీ, వైసీపీ అధికారంలో ఉండాలి అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం మాకు వద్దు అంటూ పలు నియోజకవర్గాలలో ప్రజల నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయనీ చెప్పుకొస్తున్నారు. అందుకనుగుణంగానే జగన్ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ అప్పటికే ఆలస్యమైందని వివరణలు ఇచ్చుకుంటున్నారు.
కానీ వాస్తవమేమిటంటే ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా జగన్ పాలనక వ్యతిరేకంగా ఇవ్వడానికి డిసైడైపోయారని పరిశీలకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే..జనం ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూనే జగన్ అసలే వద్దు అని విస్పష్టంగా చెప్పేశారనీ, అందుకే ఇప్పుడు జగన్ కు అనుకూలమే కానీ వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలపైనని కలర్ ఇచ్చేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. అసలు జగన్ పై కంటే ఎమ్మెల్యేలపై ప్రజలలో వ్యతిరేకత ప్రబలడానికి కారణాలేమీ లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాలలో వాలంటీర్ల పెత్తనంతో ఎమ్మెల్యేల పాత్ర డమ్మీల స్థాయికి పరిమితమైపోయిందని అంటున్నారు.